కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం వచ్చిందంటే చాలు టమోటాల వినియోగం ఎక్కువగా వుంటుంది. మాంసం ప్రియులు అయితే పెద్దగా వాడరు కానీ శాఖాహార ప్రియులు టమోటాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. హోల్ సేల్ మార్కెట్లో కిలో 70పలుకుతుంటే.. చిల్లర వ్యాపారులు కిలో 80 నుంచి 100కి చేర్చారు. నాణ్యత కలిగిన టమోటాలు కిలో రూ.100 పలుకుతున్నాయి. చిత్తూరు జిల్లా రామకుప్పం మినీమార్కెట్ యార్డులో 15 కిలోల బాక్సు ధర గరిష్ఠంగా రూ.1150 , వి.కోట, కుప్పం, ఏడోమైలు మార్కెట్లలో రూ.1000 వరకు పలికింది. నాణ్యతను బట్టి రూ.850 నుంచి రూ.1150 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు.అది నిన్నటిధర. ఇవాళ మరింతగా పెరిగింది. రీటైల్ మార్కెట్లో ధరలు ఇంకా మండుతున్నాయి.
తమిళనాడు, కర్ణాటకలో మండుటెండలు, ఎడతెరపిలేని వర్షాల కారణంగా దిగుబడి తగ్గడం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి కూడా టమోటాల దిగుబడి తగ్గడంతో బయటినుంచి వచ్చే టమోటాలకు భారీగా ధర పలుకుతోంది. మరో వైపు టమోటా ధరలు పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. వేసవికి ముందే టమోటా పంట వేసి ధర పెరగడంతో ఇప్పుడు మంచి లాభాలు పొందుతున్నారు. టమోటాల ధర పెరగడంపై సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందు రెండుమూడు కిలోలు కొనేవారు ఇప్పుడు అరకిలోకి పరిమితం అయ్యారు. కొందరైతే టమోటా కొనడం మానేశారు. నిమ్మకాయలు కూడా భారీగా ధర పలకడంతో వాటిని దూరంగా వుంచుతున్నారు.
Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ