తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ, తాజాగా హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి మరో భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒక ఫైల్ ప్రాసెసింగ్ కోసం లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన వెంకట్ రెడ్డి అక్రమ సామ్రాజ్యం వందల కోట్లలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ , హన్మకొండలోని ఆయనకు సంబంధించిన నివాసాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ సోదాల్లో సుమారు ₹100 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.
Teena Sravya: కుక్కకు ‘బంగారం’ తూకం.. తప్పు తెలుసుకుని హీరోయిన్ బహిరంగ క్షమాపణలు
ఈ సోదాల్లో అధికారులు విస్తుపోయే రీతిలో ఆస్తులను కనుగొన్నారు. ఎల్‌బీ నగర్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో రెండు విలాసవంతమైన విల్లాలు, వివిధ ప్రాంతాల్లో 10 ప్లాట్లు , 14 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వెంకట్ రెడ్డి నివాసం , బ్యాంక్ లాకర్ల నుండి సుమారు 2 కిలోల బంగారం, ₹50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌ను అధికారులు గుర్తించారు. తన అధికారిక పదవిని అడ్డం పెట్టుకుని బినామీల పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టిన ఈ అధికారి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు దాడులను ముగించి, స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.