ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌కు సరిగ్గా సరిపోతుంది. ఉన్నోడు కార్లలో తిరుగుతూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంటే.. లేనోడు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌జామ్‌లలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాడు. ట్రాఫిక్‌జామ్‌కు భారీ వర్షాలే కారణమని వాదించవచ్చు. కానీ అది 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం నానాటికీ పెరుగుతున్న కార్ల ట్రాఫిక్‌ను ప్రభుత్వాధికారులు అదుపు చేయలేకపోవడం కూడా కారణమే అన్న వాదనలు లేకపోలేదు.
Read Also: Congress: ఆగస్టు మొదటివారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ
ఒక్కరి కోసం కారు.. దర్పం కోసమేనా?
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ను పరిశీలిస్తే గత రెండేళ్లుగా అంటే కరోనా తర్వాత చేతిలో కాస్త డబ్బులుంటే చాలు కారు కొనుగోలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. సౌలభ్యం కోసం కారు కొనుగోలు చేయడంలో తప్పు లేదు. కానీ ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు రోడ్డుకు చాలనంత కారును కొనుగోలు చేసి సామాన్యులను ఇబ్బంది పడేలా చేయడమే తప్పు. ప్రస్తుతం కారు డ్రైవింగ్ చేసే వాళ్లలో 100 శాతం డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. సరిగ్గా డ్రైవింగ్ రాకుండానే రోడ్డు మీదకు కారును తీసుకువెళ్లి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేవాళ్లు చాలామందే ఉన్నారు.
అప్పుడు సిగ్నళ్లు.. ఇప్పుడు యూటర్నులు
ఒకప్పుడు నగరంలో జంక్షన్‌ల వద్ద రెడ్ సిగ్నల్ పడితే కిలోమీటర్, రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించేది. కానీ ఇప్పటి ప్రభుత్వం ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పలుచోట్ల సిగ్నళ్లు తొలగించి యూటర్నులు ఏర్పాటు చేసింది. అయితే కారు డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడం కారణంగా చాలా మంది యూటర్నుల వద్ద తమ వాహనాలతో ఇక్కట్లకు గురవుతున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ వంటి నగరాల్లో పొల్యూషన్‌ను కంట్రోల్ చేసేందుకు సరి, బేసి విధానంలో వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుందంటే.. ఒకవేళ ఐటీ ఆఫీసులన్నీ ఓపెన్ చేస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భయం వేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.