తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచింది. వరస చేరికలతో హుషారుగా కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే ప్రజా సమస్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. దీంతో పాటు ఇటీవల కాలంలో వరసగా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల వరంగల్ సభకు రాహుల్ గాంధీ రావడం, రైతు డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. దీంతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు కొంత సమసిపోయన వాతావరణం కనిపిస్తోంది.
Read Also: Y. S. Sharmila : కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు? సమీకరణాలు మారుతున్నాయా..? |
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటకు రానున్నట్లు తెలిసింది. ఈ రోజు జరిగిన పీసీసీ కార్యవర్గం సమావేశంలో రాహుల్ టూర్ గురించి చర్చించారు టీ కాంగ్రెస్ నాయకులు. ఆగస్టు మొదటి వారంలో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉండనుంది. సిరిసిల్లలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించనున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా ఖారారు కావాల్సి ఉంది. ఈ నెలాఖరు కల్లా తేదీలు ఖరారు అవుతాయని తెలుస్తోంది.
పీసీసీ కార్యవర్గం సమావేశంలో పార్టీలో చేరికలపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్. పార్టీలో ఎవరి చేరికలను అడ్డుకోవద్దని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు వెల్లడించారు. పార్టీలో ఒకరిద్దరు ఇంకా అంతర్గత అంశాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఇకపై అలా మాట్లాడితే సహించేది లేదని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రమోషన్లు ఉంటాయని వెల్లడించారు.