Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఉత్తొండ గ్రామంలో కేశవ్, గంగామణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కేశవ్ దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా చిన్న కూతురు వేదశ్రీ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే వున్న బకెట్‌లో పడింది. బకెట్ నిండా నీళ్లు ఉండడంతో అందులో మునిగిపోయింది. అయితే కొద్ది సేపటి తరువాత తల్లిదండ్రులు వేదశ్రీ కనిపించకపోవడంతో ఇళ్లంతా వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో బయటకు వచ్చి చూడగా షాక్ తిన్నారు. చిన్నరి నీటి బకెట్ లో విగత జీవిగా పడివుంది.
Read also: IT Tower Website: సిద్దిపేటలో ఐటీ టవర్ వెబ్ సైట్.. ప్రారంభించిన హరీష్ రావు
బకెట్‌లో చిన్నారి పడిపోవడం ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కోటగిరి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బోధన్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో వారి దగ్గర నీటి బకెట్లు పెట్టుకోవడం మంచిది కాదని చిన్న పిల్లల నిపుణులు అంటున్నారు. వాటర్ ట్యాంకులు, డ్రమ్ములపై కూడా మూతలు పెట్టాలని సూచించారు. వేడినీరు, వాటర్ హీటర్లను పిల్లలకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. ఆడుకుంటూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున పిల్లలకు దూరంగా ఉంచాలన్నారు.
Sai Dharam Tej: రామ్ చరణ్ లాంచ్ చేసిన ‘సోల్ ఆఫ్ సత్య’