దేశంలో అన్ని నగరాల్లో నెట్ వర్క్ ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న 2 ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. ఢిల్లీ కేంద్రంగా కొకైన్ సరఫరా జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఎబుకా సుజీ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడని, అతని కోసం గాలించినా దొరకలేదని తెలిపారు. ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయని.. అక్కడ డీఆర్‌ఐ గ్యాంగ్‌కు ఇతనికి సంబంధాలు ఉన్నాయన్నారు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ , స్నాప్ చాట్ కొన్ని యాప్స్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ తీసుకొని సప్లై చేస్తున్నారని సీపీ చెప్పారు. ఇలా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేశామన్నారు.
హేన్రీ చిగ్బో అనే వ్యక్తి టూరిస్ట్ వీసా మీద వచ్చాడని.. కానీ వీసా గడువు ముగిసిన ఇండియాలో ఉంటూ డ్రగ్స్ ద్వారా సప్లై చేస్తున్నాడని సీపీ వెల్లడించారు. ఇక గ్రాము 8 వేలకు కొనుగోలు చేసి పది వేలకు అమ్మకాలు చేస్తున్నారని సీపీ వివరించారు. ఇమాన్యుల్ అనే మరో కీలక నిందితుడు ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని.. ఇమాన్యుల్, ఎబుకా సుజీ ఇద్దరు ఒకే గ్యాంగ్‌కి చెందిన వారుగా అనుమానిస్తున్నామన్నారు. త్వరలో వీరిని పట్టుకుంటామన్నారు.
వీసాలు ముగిసినా ఇండియాలో ఉంటున్న నైజీరియన్‌లను వారి దేశాలకు పంపుతామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఐదుగురిని వారి దేశానికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. మన దేశంలోకి వచ్చి అక్రమంగా ఉంటున్నారని, వీసాలు గడవు ముగిసిన తరువాత నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో వీరు బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేశారని స్పష్టం చేశారు. ఎయిర్ టికెట్లు కొనుగోలు చేసి స్వయంగా వారిని వారి దేశానికి అప్పగిస్తున్నామని తెలిపారు. 2500 మంది ఆఫ్రికన్స్ ఉంటే అందులో 750 మంది పైగానే వీసాలు గడువు ముగిసిన వారు ఉన్నారన్నారు. కార్డెన్స్ సెర్చ్ చేసి మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. వీరిపై కేసులు లేకుండా వారిని వారి దేశాలకు పంపుతున్నామని తెలిపారు. వీరిపై కేసులు పెడితే వారిని వారి దేశానికి పంపడానికి ఇబ్బంది ఉంటుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.