తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది.. ఇవాళ 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున నామినేషన్ పత్రాలను సమర్పించారు.. చండూరులోని బంగారుగడ్డ నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు.. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున పార్టీ నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు.. మరో 14 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే, బీజేపీ తరఫున మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక సెట్ దాఖలు చేయగా.. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఒక సెట్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీ తరపున మరోసెట్ నామినేషన్ దాఖలు చేశారు.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.. వీరికి తోడు మరో 14 మంది ఇండిపెండెంట్లు నామినేషన్ దాఖలు చేశారు.. కాగా, మునుగోడు ఉప సమరంపై ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఇప్పటికే సభలు, సమావేశాలకు భువనగిరి జిల్లాతోపాటు పరిసర జిల్లాల కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. అయితే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కీలకమైన ఈ సమయంలో ప్రజాప్రతినిధులకు అక్కడ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించడంతో ఎన్నికలయ్యే వరకు వారిని కలవాలనే స్థానికులు మునుగోడు వెళ్లాల్సిన పరిస్థితి తప్పదని ప్రజలు భావిస్తున్నారు. ఈ నెల 7 నుంచి నామినేషన్లను స్వీకరణ ప్రారంభం కాగా.. 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6న కౌంటింగ్ నిర్వహించిన ఫలితాలు ప్రకటిస్తారు.