మూసీనదిపై రూ.540 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2021-22 ఏడాదికి పురపాలకశాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నానక్‌రామ్‌గూడ నుంచి టీఎస్‌పీఏ వరకు సర్వీస్ రోడ్డు విస్తరిస్తున్నామని తెలిపారు. ఉస్మాన్ సాగర్ చుట్టూ 18 ఎకరాల్లో కొత్త పార్కు తుదిదశకు వచ్చిందన్నారు. హెరిటేజ్ భవనాలను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.2410 కోట్లతో 104 కొత్త లింక్ రోడ్లను నిర్మించబోతున్నామన్నారు.
హైదరాబాద్‌లో 37 లింక్ రోడ్ల పనుల చేపట్టామని, ఏడు లింక్ రోడ్లను పూర్తిచేశామన్నారు. మిగతావి తుదిదశలో ఉన్నాయని చెప్పారు. ఉప్పల్, మెహిదీపట్నంలో స్కైవాక్‌లు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలతోపాటు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ప్రత్యేక దృష్టితో పట్టణాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో రోడ్లు, నాలాలు, ఫ్లై ఓవర్లు నిర్మించుకున్నామన్నారు.
హైదరాబాద్‌లో వ్యర్ధ పదార్థాలతో 62 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధీకరణ చేస్తున్నామన్నారు. రూ.100 కోట్లతో అవుటర్ రింగ్‌రోడ్డు మొత్తం ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సోలార్ రూఫ్‌టాప్‌తో 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం కింద రూ.వెయ్యి కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈసారి వరద ముప్పు ఉండదని తాను చెప్పనని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.