తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిన్న ఓ మహిళా ఎంపీడీవో విషయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరువక ముందే.. నేడు మరో మంత్రి గంగుల కమలాకర్ పొరపాటున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో హారితహారం కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని మొక్కలు నాటారు. మహిళా సంఘం, గౌడ సంఘాల కోసం నిర్మించిన కొత్త భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి సభలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇన్ని మంచి పథకాలిచ్చిన చంద్రబాబుకు దీవెనలు అందించాలా వద్దా.. కడుపు చల్లగా ఉండాలని కోరుకోవాలా వద్దా.. అంటూ ప్రజలను అడిగారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే తన పొరపాటును గుర్తించిన మంత్రి గంగుల.. సీఎం కేసీఆర్‌కు దీవెనలు ఇవ్వాలని కోరారు.దీంతో గంగుల మాజీ బాస్ ను ఇంకా మరచిపోనట్లు లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.