Congress Readied Buses for MLAs at Taj krishna Hotel: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ప్రస్తుతానికి బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు కాగా మరికొద్ది సేపట్లో ఈవీఎం ఓట్లను కూడా లెక్కించనున్నారు. అయితే ఈసారి కచ్చితంగా తెలంగాణలో ఎదురు అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ ట్రబుల్ షూటర్లను రంగంలోకి తెచ్చింది. సౌత్ లో కాంగ్రెస్ కి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిన్న రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకోగా ఆయన నుంచి కాంగ్రెస్ అభ్యర్థులందరికీ స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఒక్కొక్క కాంగ్రెస్ అభ్యర్థితో పాటు కర్ణాటక నుంచి వచ్చిన ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరిని అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపొందినట్లు లేఖ అందుకున్న వెంటనే సదరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యే గెలుపొందిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేని తమ ఎస్కార్ట్, గన్మెన్లతో పాటు హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్ కి తీసుకురాబోతున్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం మూడు బస్సులను సిద్ధం చేశారు.
Telangana Elections Counting NTV Live Updates: ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్.. లైవ్ అప్‌డేట్స్
ఒకవేళ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వెంటనే కాంగ్రెస్ లో గెలుపొందిన ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని బెంగళూరు బయలుదేరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజ్ కృష్ణ హోటల్ లో దాదాపు 60 రూములను ఈరోజు కోసం బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్క్ హోటల్ లో బస చేసిన డీకే శివకుమార్ మరికొద్ది సేపట్లో తాజ్ కృష్ణ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తనకు బాగా నమ్మకస్తులైన మంత్రి జార్జి వంటి వారిని డీకే శివకుమార్ రంగంలోకి దింపారని ఒక్క ఎమ్మెల్యే కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయి జారిపోకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నానికి తాజ్ కృష్ణ కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాత్రి కాంగ్రెస్ రిజిస్టర్ పార్టీ అసెంబ్లీ మీటింగ్ జరపాలని కాంగ్రెస్ పార్టీ నియమించిన పరిశీలకులు భావిస్తున్నారు.