ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ భారత్‌లో ఎప్పుడు అడుగుపెడుతుంది? ఈ ప్రశ్నకు ఇప్పుడప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు. లేటెస్ట్‌గా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌ని బట్టి చూస్తే.. దిగుమతి సుంకాలు, తయారీ విషయంలో టెస్లా, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. టెస్లా తయారీ యూనిట్‌పై ట్విటర్ మాధ్యమంగా ఓ నెటిజన్.. ‘భవిష్యత్తులో భారత్‌లో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ప్నశ్నించాడు. అందుకు ఎలాన్ మస్క్ బదులిస్తూ.. ‘‘మా కార్లను విక్రయించేందుకు, సర్వీసులు అందించేందుకు అనుమతి లభించని ప్రాంతంలో టెస్లా తయారీ ప్లాంట్‌ను నెలకొల్పబోదు’’ అని అన్నాడు.
నిజానికి.. ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న మన భారతదేశంలో ప్రవేశించేందుకు టెస్లా కొంతకాలం నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాకపోతే.. విదేశాల్లో తయారైన తమ కార్లను మొదట ఇక్కడ విక్రయించాలని ఆ సంస్థ చూస్తోంది. ఆ తర్వాతే తయారీ యూనిట్‌ని నెలకొల్పాలని ప్లాన్ చేస్తోంది. నేరుగా ప్లాంట్‌ని నిర్మించి, ఆ తర్వాత విక్రయాలు సరిగ్గా లేకపోతే.. భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అందుకే, విక్రయాల్ని బట్టి ప్లాంట్‌ని నిర్మించాలా? వద్దా? అనేది టెస్లా ఆలోచిస్తోంది. దీనికితోడు.. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై 100 శాంత సుంకం ఉంది, దాన్ని తగ్గించాలని మస్క్ డిమాండ్ చేస్తున్నాడు. అయితే.. భారత ప్రభుత్వం మాత్రం మస్క్ ప్రతిపాదనలకు అంగీకరించడం లేదు.
మేకిన్ ఇండియాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది కాబట్టి.. మస్క్‌ని భారత్‌లో తయారీ ప్లాంట్‌ని సిద్ధం చేయాల్సిందిగా కోరుతోంది. అందుకు కావాల్సిన సామర్థ్యాలు, సాంకేతికతను అందిస్తామని అంటోంది. భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ, చైనాలో తయారు చేసిన కార్లను భారత్‌లో విక్రయించాలని చూస్తోన్న మస్క్ ప్రతిపాదన సరైనది కాదని ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత్‌లో టెస్లా కార్లు విక్రయించే ప్రణాళికను ఈ సంస్థ తాత్కాలికంగా విరమించుకుంది. ఈ క్రమంలో తాజాగా మస్క చేసిన ట్వీట్.. మళ్ళీ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇలాగైతే.. టెస్లా కార్లు భారత్‌లో ఇప్పుడప్పడే అడుగుపెట్టకపోవచ్చు.