Amazon: సాంకేతిక రంగంలో అగ్రగామి అమెజాన్ మరోసారి పెద్ద సంచలనం సృష్టించింది. రోజంతా వినిపించే మాటలను నోట్‌లుగా మార్చే ప్రత్యేక వెయిరబుల్ పరికరాన్ని తయారు చేసిన Bee AI స్టార్టప్‌ను అమెజాన్ కొనుగోలు చేసింది. సాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ రూపొందించిన Bee Pioneer అనే గ్యాడ్జెట్ ఇప్పటికే వినియోగదారుల్లో మంచి హడావుడి సృష్టించింది. $49.99 (సుమారు రూ. 4,000) ధరలో లభ్యమయ్యే ఈ పరికరం రోజువారీ సంభాషణలను రికార్డ్ చేసి, సారాంశాలు తయారు చేస్తుంది. ఈ విధంగా యూజర్లకు టు-డూ లిస్ట్‌లు, ముఖ్య సూచనలు ఆటోమేటిక్‌గా అందిస్తుంది.

గోప్యత విషయంలో Bee AI ప్రత్యేక హామీ ఇస్తోంది. వినియోగదారుల ఆడియో డేటాను రికార్డు చేయదని, AI శిక్షణకు వాడదని స్పష్టంగా పేర్కొంది. అయితే కొన్నిసార్లు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదా ఇతర శబ్దాలను ఫిల్టర్ చేయడంలో సమస్యలు ఉంటాయని యూజర్లు అంటున్నారు. అమెజాన్ ఈ పరికరాన్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా గోప్యతా విధానాలను కచ్చితంగా కొనసాగిస్తామని ప్రకటించింది.

Bee టెక్నాలజీని తన Alexa , ఇతర AI సర్వీసుల్లో సమీకరించడానికి అమెజాన్ సీరియస్‌గా ప్లాన్ చేస్తోంది. Halo పరికరాలు అంతగా రాణించని నేపథ్యంలో Bee Pioneer వంటి కొత్త వెయిరబుల్ ద్వారా మార్కెట్‌లో బలమైన అడుగు వేయాలని చూస్తోంది. టెక్ విశ్లేషకుల అంచనా ప్రకారం, Bee టెక్నాలజీ అమెజాన్‌కి AI ఆధారిత వ్యక్తిగత సహాయక పరికరాల రంగంలో కొత్త శక్తిని ఇస్తుంది.
