Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
ఇరాన్ యుద్ధం గల్ఫ్ పుట్టి ముంచింది. అమెరికాపై అతిగా ఆధారపడ్డందుకు.. గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించాయి. సొంత సైన్యం, ఉత్పత్తి లేకపోవడంతో.. ఒక్క యుద్ధానికే గల్ఫ్ పూర్తిగా కదిలిపోయింది. దశాబ్దాల శ్రమతో నిర్మించుకున్న దుబాయ్ లాంటి నగరాల్ని మళ్లీ పునాదుల నుంచి మొదలెట్టాల్సిన దుస్థితి వచ్చింది. మరోవైపు గల్ఫ్ వీసా విధానం కూడా.. అక్కడ ఇతర దేశాల వారెవరూ ఉండకూడదన్నట్టుగా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా గల్ఫ్ అమెరికాను పొమ్మంటూ.. ఇజ్రాయెల్ సాయం కోరుతుందే కానీ.. తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆలోచన చేయకపోవడం విడ్డూరంగా ఉంది.
మొన్నటివరకు గల్ఫ్ అంటే ఉన్న ఇమేజ్ వేరు.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాత సీన్ వేరు. ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ప్రదేశంగా.. పెట్టుబడులకు సురక్షిత స్థావరంగా డప్పు కొట్టుకున్న గల్ఫ్ సామర్థ్యం ఏ పాటిదో ఒక్క యుద్ధంతో తేలిపోయింది. కళ్లు చెదిరే భవంతులు, ఇరవై నాలుగ్గంటలు తళుకుబెళుకులున్నా.. అవసరమైన భద్రత మాత్రం కనీసస్థాయిలో కూడా లేదని నిరూపితమైంది. గల్ఫ్ దేశాలు అన్నింటికీ అమెరికాపై ఏ స్థాయిలో ఆధారపడుతున్నాయో చూసి.. ప్రపంచం తెల్లబోతోంది.
Also Read
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Story Board: దీదీ హెచ్చరికలు పనిచేస్తాయా? మోడీ మసాలా మరమరాల సంగతేంటి?
- Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ షాక్..! 54 ఓట్ల తేడాతో..
మొన్నటిదాకా అమెరికా అవకాశాల స్వర్గమైతే.. మా దేశాలు పెట్టుబడులకు స్వర్గధామాలని గల్ఫ్ సగర్వంగా చెప్పుకుంది. అందుకు తగ్గట్టుగానే దుబాయ్ లాంటి నగరాల్లో ఏడాది పొడవునా అంతర్జాతీయ బిజినెస్ కు సంబంధించిన ఏదో కార్యక్రమం జరుగుతూ చాలా సందడిగా ఉండేది. ప్రపంచంలో కొత్త మోడల్ కార్లు కూడా పనిగట్టుకుని దుబాయ్‌లోనే లాంచ్ అవుతుండేవి. ఇక విమానయాన రంగంలోనూ కొత్త సాంకేతికలు, సదుపాయాలు అన్నీ దుబాయ్ కేంద్రంగానే ప్రపంచ దేశాలు తెలుసుకునేవి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త విషయం ఎవరికి తెలియాలన్నా.. ఏ కొత్త ఆవిష్కరణ జరగాలన్నా.. దానికి దుబాయ్ కేంద్రంగా ఉంటేనే బాగుంటుందనే నమ్మకం ప్రపంచ పెట్టుబడిదారుల్లో బలపడిపోయింది. దీనికి తోడు గల్ఫ్ దేశాలకు ప్రత్యేకంగా ఎవరితోనూ శత్రుత్వం లేకపోవడం.. గత మూడు దశాబ్దాల్లో ఆ ప్రాంతంలో ఎలాంటి యుద్ధం జరగపకపోవడం.. పెట్టుబడిదారులకు మరింత నమ్మకాన్నిచ్చాయి. ఆపైన అమెరికా స్థావరాలు ఉండనే ఉన్నాయి. దీంతో ఇక గల్ఫ్ శత్రుదుర్భేద్యం అనే ఊహల్లో ప్రపంచ పెట్టుడిదారులంతా ఊరేగారు. కానీ ఒక్క యుద్ధం వారి ధీమాను పటాపంచలు చేసింది. కేవలం మూడు వారాల్లోనే ఆకాశహర్మ్యాలు, తమకే సాధ్యమైన అభివృద్ధితో ఆకాశంలో విహరించిన గల్ఫ్ నగరాలు.. కళ్ల ముందే కుప్పకూలాయి. చివరకు ఎన్ని ఉన్నా.. భద్రత విషయంలో గల్ఫ్ ఎంత అతి సున్నితంగా ఉందో చూసి.. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.
ప్రస్తుత ప్రపంచంలో అగ్రదేశాలంటే కేవలం జీడీపీ, అభివృద్ధి, తలసరి ఆదాయం లెక్కలు మాత్రమే కాదు. ఆ గణాంకాలు సురక్షితమనే భావన కలగాలంటే.. ఇతర దేశాల్ని ఆక్రమించుకునే స్థాయి సైన్యం లేకున్నా.. కనీసం స్వీయరక్షణ సామర్థ్యమైనా ఉండాలి. మెజార్టీ ధనిక దేశాలకు స్వీయ రక్షణ సామర్థ్యం ఉంది. కానీ గల్ఫ్‌కు మాత్రం ఆ సత్తా లేదు. ఈ సంగతి ఎవరికీ తెలియదనుకోలేంది. కానీ గల్ఫ్‌లో పెట్టుబడుల నుంచి వస్తున్న ప్రతిఫలాల మత్తులో.. పెట్టుబడిదారులు దాదాపుగా మూడు దశాబ్దాల పాటు గల్ఫ్ దేశాలకు సొంత సైన్యం లేదనే సంగతే మర్చిపోయారు. గల్ఫ్ తళుకుబెళుకులు. అలా మర్చిపోయేలా చేశాయి. ఇప్పుడు కూడా ఇరాన్ యుద్ధం జరగకపోతే.. గల్ఫ్‌పై అదే భ్రాంతిలో పెట్టుబడిదారులు ఉండేవారనడంలో సందేహం లేదు. వారు మాత్రమే కాదు.. గల్ఫ్ దేశాలు కూడా సొంత రక్షణ సంగతి అమెరికాకు వదిలేసి.. అలాగే బతికేసేవి. కానీ ఇరాన్ యుద్ధం.. ఆకాశంలో విహరిస్తున్న గల్ఫ్ మోడల్‌ను నేలకు దించింది. ఎంతసేపూ ఉక్కిరిబిక్కిరి చేసే ఆకాశ భవంతుల నిర్మాణమే కాదు. కాస్త నేల మీద భద్రత సంగతీ చూసుకోవాలని కాస్త గట్టిగానే మాడు పగలగొట్టింది.
ఇన్నాళ్లూ అమెరికాని నమ్ముకుని కళ్లు మూసుకున్న గల్ఫ్ దేశాలు కూడా.. భారీ నష్టం జరగడంతో.. ఇప్పుడిప్పుడే అతి కష్టం మీద కళ్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాకు తమ భూభాగంలో సైనిక స్థావరాలు ఏర్పాటుచేసుకునే అవకాశం ఇచ్చి.. తమ భద్రత చూస్తున్నందుకు కొంత డబ్బు చెల్లిస్తూ.. ఇప్పటిదాకా బతికేసిన గల్ఫ్ దేశాలకు.. ఇరాన్ ఇచ్చిన వరుస షాకులతో కళ్లు బైర్లుకమ్మాయి. పైగా తాము బాగా నమ్మిన అమెరికా సామర్థ్యం ఎందుకూ కొరగాదని తేలిపోవడంతో.. అవాక్కవటం వాటి వంతైంది. ఇన్నాళ్లూ మనకేంటి..? మన దగ్గర కావాల్సినంత డబ్బుంది. కాస్త డబ్బు పారేస్తే.. మన రక్షణ చూడటానికి అమెరికా ఉంది. అమెరికాను ఓడించే దేశం ఎక్కడుంది..? ఈ మాత్రం దానికి అనవసరంగా రక్షణ పేరుతో డబ్బు తగలేయటం ఎందుకు దండగ. ఆ డబ్బును కూడా అభివృద్ధికే ఖర్చు పెడితే.. మరిన్ని పెట్టుబడులు వచ్చి ఆదాయం పెరుగుతుంది కదా. ఇదీ గల్ఫ్ దేశాలు వేసిన గుడ్డి లెక్క. కానీ ఈ లెక్క కరెక్ట్ కాదనే సంగతి చూచాయగా కాదు ఆధారాలతో సహా తెలిసినా.. గల్ఫ్ మాత్రం భద్రతను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. అలాగే గల్ఫ్‌లో అసలు యుద్ధం రాదనే ధీమా కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే మూడు దశాబ్దాల క్రితం ఇదే ప్రాంతంలో వచ్చిన యుద్ధం.. మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి.. ఇంధన సంక్షోభం తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడూ అదే జరిగింది. అంటే ఇక్కడ ఎప్పుడు యుద్ధం వచ్చినా.. నష్టం ఊహించని విధంగానే ఉంటుందనేది తెలిసిన విషయమే. కానీ కేవలం చమురు ఎగుమతుల మీదే ఆధారపడ్డ గల్ఫ్ మాత్రం ప్లాన్ బీ సంగతి కనీసం ఆలోచించకపోవడం.. తెలిసి చేసిన తప్పిదమే అనడంలో సందేహం లేదు. ఈ పాత చరిత్రను పక్కనపెట్టినా.. ఇటీవలి పరిణామాలు చూసుకున్నా.. యుద్ధం తప్పదని ముందే సంకేతాలున్నాయి. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ మధ్య ఉన్న గల్ఫ్ దేశాలు.. ఆ రెండు దేశాల మధ్య ఏం జరిగినా.. తమకేమీ కాదని ఎలా తప్పుడు అంచనా వేశాయో ఎవ్వరి ఊహకూ అందటం లేదు. ఎవరేం చెప్పినా.. మనకు అమెరికా రక్షణ ఉంది కదా అని కళ్లుమూసుక్కూర్చున్న గల్ఫ్ నేతలు.. ఇప్పుడు చేతులు కాలాక ఆకుల కోసం పరిగెడుతున్నారు.
ఇరాన్ యుద్ధంలో అమెరికా నుంచి గల్ఫ్ అతిగా ఆశించింది. కానీ అమెరికా మాత్రం కనీసం కూడా ఆదుకోలేక చేతులెత్తేసింది. అమెరికా దారుణ వైఫల్యంతో.. ఇరాన్ యథేచ్ఛగా గల్ఫ్‌ను టార్గెట్ చేసి.. ఆయా దేశాల మౌలిక సదుపాయాలను, అభివృద్ధి చిహ్నాలను చాలా వేగంగా నేలమట్టం చేసింది. కొన్నింటినైతే చెప్పి మరీ కొట్టింది. ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేక గల్ఫ్ దేశాలు నిస్సహాయంగా చూస్తుండిపోయాయి. తమకు గర్వకారణమైన దుబాయ్ లాంటి నగరాల పునాదులు కదులుతున్నా.. తమకు ప్రాణాధారమైన చమురు బావులు ధ్వంసమౌతున్నా.. నిట్టూర్చడం తప్ప మరో చర్యకు సాహసించలేకపోయాయి. యుద్ధం మొదలైన తొలినాళ్లలో అమెరికాను సుతిమెత్తగా కసురుకున్న గల్ఫ్ దేశాలు.. తాము పూర్తిగా నష్టపోయాక మాత్రం ఇప్పటిదాకా చేసిన సేవలు చాలు ఇక దయచేయండి అని గట్టిగా గదమాయించాయి. కానీ అప్పటికే చేయి దాటిపోయింది. పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. గల్ఫ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. మిగతా ప్రపంచానికి కాల్పుల విరమణతో కాస్త ఊరట దక్కినా.. గల్ఫ్‌కు మాత్రం ఏమీ తేడా తెలియడం లేదు. యుద్ధం జరుగుతున్నా.. ఆగినా..అవి నిప్పుల కుంపటి మీద నిలబడ్డట్టే ఫీలౌతున్నాయి. అంతే కాదు.. ఎప్పుడు ఎట్నుంచి ఏ క్షిపణి దేన్ని టార్గెట్ చేస్తుందోననే భయంతో వణికిపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలో దుబాయ్ ఖాళీ అయిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్ని దశాబ్దాలుగా కేవలం అభివృద్ధి మీదే దృష్టి పెట్టిన గల్ఫ్.. స్వీయ తప్పిదాలతో చేజేతులా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చుకుంది. చమురు డబ్బుతో ధనిక దేశాలనే పేరున్నా.. మన భద్రత మనం చూసుకోవాలనే స్పృహ లేకపోవడం గల్ఫ్ కొంప ముంచింది. ఇప్పటికీ అమెరికాని నిందిస్తూ.. ఇజ్రాయెల్‌ను ఆహ్వానిస్తున్నాయే కానీ.. మన సంగతి మనం చూసుకుందామనే యోచన చేయకపోవడం.. గల్ఫ్ దేశాల హ్రస్వ దృష్టికి అద్దం పడుతోంది.
ఇరాన్ యుద్ధం గల్ఫ్ భద్రతలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. సరే అమెరికా ఏదో చేస్తుందనుకుంటే.. ఏమీ చేయలేదని తేలిపోయింది. ఈ మాత్రం దానికి అగ్రరాజ్యాన్ని మన భూభాగంపై భరించడం ఎందుకనే ఆలోచన చేసిన గల్ఫ్ దేశాలు.. ఇక దయచేయమంటూ పెద్దన్నకు దారి చూపటం.. ఇప్పటికైనా మంచి పనే. కానీ పనిలోపనిగా సొంత భద్రతపై దృష్టి పెట్టి.. ఓ సమగ్ర వ్యూహం రూపొందించుకుంటాయన్న ఆశలకు మాత్రం గండి పడింది. మొదట ఇరాన్ యుద్ధంలో తమకు జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇవ్వాలని యూఏఈ, సౌదీ లాంటి దేశాలు అమెరికాను గట్టిగా అడిగాయి. మిగతా దేశాలు కూడా అదే బాట పడతాయనే అంచనాలు వచ్చాయి. కానీ చివరకు పరిహారం సంగతి ఎటూ తేలకుండానే.. మొదట తమ భూభాగం ఖాళీ చేయాలని అమెరికాకు గల్ఫ్ దేశాలు అల్టిమేటం ఇచ్చాయి. ఈ విషయంలో అందరి కంటే ముందే యూఏఈనే తొలి అడుగు వేసింది. ఇక తమ సెక్యూరిటీ తాము చూసుకుంటామని తేల్చేసింది. దీంతో అమెరికా కూడా ఓ అడుగు వెనక్కి వేసి.. గల్ఫ్‌లో తమ బలగాల సంఖ్య తగ్గిస్తామంటూ పరువు కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. పోనీలే ఇప్పటికైనా గల్ఫ్ దేశాలకు కర్తవ్యం ఏంటో గుర్తొచ్చిందని పెట్టుబడిదారులు అనుకున్నారు. కానీ అదేం లేదని వెంటనే తేల్చేశాయి గల్ఫ్ దేశాలు.
అమెరికాను సాగనంపిన చేత్తోనే.. ఇతర దేశాల సాయం కోసం గల్ఫ్ అంగలారుస్తోంది. గల్ఫ్ నిస్సహాయతను గమనించిన ఇతర దేశాలు కూడా తాము భద్రత కల్పిస్తామంటూ ఆఫర్లిస్తున్నాయి. మొదట ఇజ్రాయెల్ యూఏఈలో ఐరన్ డోమ్ వ్యవస్థను మోహరించింది. హమాస్ దెబ్బనూ కాచుకోలేని ఐరన్‌డోమ్‌ను యూఏఈ నమ్ముకోవడం మరోసారి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గల్ఫ్ దేశాల తప్పుడు నిర్ణయాలు ఇంతటితో ఆగలేదు. చివరకు జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్ లాంటి దేశాలను సాయం కోరేదాకా వెళ్లిన దుస్థితి. ఆయా దేశాల రక్షణ సామర్థ్యం కూడా అంతంతమాత్రమే. కొన్ని దేశాలకైతే సైన్యం సంఖ్య కూడా తక్కువే. మరి అలాంటి దేశాలు గల్ఫ్‌ను కాపాడగలవా అనేది ఇప్పటికీ సందేహాస్పదమే. కానీ సొంత రక్షణ ఖర్చు దండగ అని గతంలో భావించిన గల్ఫ్.. ఇప్పుడు కూసాలు కదిలిపోయే దెబ్బ తగిలినా.. ఆలోచన మార్చుకోవడం లేదు. అమెరికా పోతే ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్ అంటూ ఇంకా ఎవరెవరు ఎలాంటి సెక్యూరిటీ ఆఫర్ ఇస్తారా అనే వెతుకులాట.. స్వీయ తప్పిదాలన్నింటికీ పరాకాష్ట అనడంలో సందేహం లేదు. గల్ఫ్ దగ్గర ఎప్పుడూ డబ్బుకు కొదువలేదు. ఇప్పటిదాకా తెలిసో తెలియకో తప్పులు చేశాం. ఇప్పటికైనా సమగ్ర భద్రతా విధానం రూపొందించుకుందాం అని ఆలోచించకపోవడం దురదృష్టకరం.
ప్రస్తుత ప్రపంచంలో కొన్ని పేద దేశాలు కూడా అందరూ అబ్బురపడే స్థాయిలో సైనిక శక్తిని పెంచుకుంటున్నాయి. అలాంటిది అంత డబ్బు దగ్గరపెట్టుకుని కూడా కనీసం పరిమిత స్థాయిలో సైన్యం ఏర్పాటు గురించి.. ఆత్మరక్షణకు కావాల్సిన వ్యవస్థల ఏర్పాటు గురించి సొంతంగా విధానాలు రూపొందించుకోకుండా.. ఇంకా ఏదో దేశం ఉద్ధరించకపోతుందా అని చూస్తున్న గల్ఫ్ దేశాలు.. ఇలాంటి అరకొర చర్యలతో పెట్టుబడిదారుల విశ్వాసం పొందగలరా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎవరైనా ఓ నష్టం ఎదురైనప్పుడు.. మరోసారి అలాంటి నష్టం వచ్చే పరిస్థితి ఉండదనే భరోసా కల్పించాలి. పెట్టుబడుల విషయంలో ఏ దేశమైనా చేసే పని అదే. అత్యంత సురక్షితంగా ఉండే దేశాలు కూడా ఎప్పటికప్పుడు మీ పెట్టుబడులకు మాదీ పూచీ అంటూ కొత్త కొత్త విధానాలు తీసుకొస్తూనే ఉంటాయి. కానీ గల్ఫ్ దేశాలు మాత్రం నిండా మునిగాక చలేమిటనే ధోరణితో ఉండటం.. ఏమిటో విశ్లేషకులకూ అంతుబట్టడం లేదు.
భద్రత విషయంలో గల్ఫ్ ఆలోచనా విధానం ఇలా ఉండటానికి.. ఆ దేశ మోడల్ మూలాల్లోనే లోపం ఉందనే చర్చ జరుగుతోంది. సొంతగా టూత్ బ్రష్నూ ఉత్పత్తి చేసే స్థితిలో లేని గల్ఫ్.. ఇక భద్రత గురించి ఏం ఆలోచిస్తుందిలే అని సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. అన్నింటికీ అమెరికా, యూరప్‌పై అతిగా ఆధారపడి, ప్రతి చిన్న వస్తువునూ డబ్బిచ్చి కొనుక్కోవటానికి అలవాటుపడ్డ గల్ఫ్ షేకులకు.. భద్రత కూడా వస్తువే అనిపించడంలో వింతేం లేదు. అందుకే ఓ చోట కొన్న వస్తువు బాగాలేకపోతే.. మరోచోట కొన్నట్టు.. మొన్నటిదాకా అమెరికా దగ్గర సెక్యూరిటీ కొనుక్కుని.. ఇప్పుడు అది డొల్ల అని తేలగానే.. మరో దేశం నుంచి భద్రతను కొనుగోలు చేయాలని చూస్తున్నాయి. ఇక్కడ ప్రతి దేశానికి ఆత్మగౌరవం ఉండాలని, భద్రత అనేది ఎవరికి వారే చూసుకోవాలనే కనీస ఆలోచన గల్ఫ్‌కు ఇంత పెద్ద దెబ్బ తగిలాక కూడా రావడం లేదు. మొన్నటిదాకా గల్ఫ్ నుంచి పెట్టుబడుల తరలింపుకు కాస్త ఆలోచించిన పెట్టుబడిదారులు కూడా.. ఇప్పుడు ఆ దేశాల తీరు చూసి.. అర్జెంట్‌గా ఇతర దేశాలకు మళ్లటం బెటరని ఫిక్స్ అవుతున్నారు. ఏతావాతా గల్ఫ్ దేశాలు పూర్వవైభవం దిశగా కృషి చేయకపోగా.. ఇక ఆ రోజులు మళ్లీ రావనే సంకేతాలివ్వటం ఆర్థికంగా ఆత్మహత్యతో సమానం అంటున్నారు నిపుణులు.
ప్రస్తుత ప్రపంచంలో పెట్టుబడుల ఆకర్షణకు దేశాలన్నింటి మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఇలాంటి స్థితిలో ఉన్న సురక్షిత స్థానాన్ని కోల్పోవటమే కాకుండా.. మరింత బలహీన విధానాలను ఆశ్రయించి.. గల్ఫ్ తన సమాధి తానే కట్టుకుంటుందా అనే కొత్త సందేహాలు వస్తున్నాయి. దశాబ్దాల క్రితమే చమురుకు ప్రత్యామ్నాయ రంగాలుండాలని ఆలోచించిన గల్ఫ్.. ఆతిథ్య రంగం, రియల్ ఎస్టేట్ రంగం, వినోద రంగం మీదే దృష్టి పెట్టింది కానీ.. ప్రాథమిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఉత్పత్తి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది. సరే ఇంతకుముందు అంటే.. ఇలా అవుతుందని అనుకోలేదు. ఊహించలేదు. అదేమంటే కలగన్నామా అని దబాయిస్తారు. సరే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు తెలిసింది కదా. అయినా తప్పును సరిగా దిద్దుకోరే..? శ్రేయోభిలాషులు, మిత్రదేశాల సలహాలు, సూచనలతో సరైన నిర్ణయం తీసుకోరే..? ఇంకా డబ్బు పెట్టి భద్రత కొనుక్కుందామనే దిక్కుమాలిన ఆలోచన ఏంటి..? ఆత్మరక్షణను అంగట్లో సరుకులా చూడటమేంటి..? ఎప్పటికీ ఎవరో రావాలి. ఏదో చేయాలి అనుకోవడం ఆత్మవంచన అవుతుందని ఇప్పటికైనా గల్ఫ్ తెలుసుకోవాలి. లేకపోతే ఆ దేశాల్ని కాపాడటం ఎవ్వరి చేతుల్లోనే ఉండదని గుర్తుంచుకోవాలి.
అసలు గల్ఫ్ అభివృద్ధి మోడల్లోనే లోపాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తున్నా.. వారెవరికీ సిటిజన్‌షిప్ ఇవ్వకపోవడం గల్ఫ్ చేసిన తప్పిదమనే చర్చ జరుగుతోంది. కేవలం పదేళ్ల వీసాతో సరిపెట్టేస్తే.. ఎవరికైనా గల్ఫ్ తమ సొంతమనే భావన ఎందుకు ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. అమెరికా వీసా విధానంతో పోలిస్తే.. గల్ఫ్ వీసా విధానం తీసికట్టే అనడంలో సందేహం లేదు.
ప్రపంచంలో ధనిక దేశాలుగా పేరున్న అమెరికా, యూరప్ కు ఈ స్థాయికి రావటానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. కానీ గల్ఫ్ దేశాలు మాత్రం దుబాయ్ లాంటి ఆధునిక ఆర్థిక ప్రగతికి చిరునామా అనదగ్గ నగరాల్ని కేవలం కొన్ని దశాబ్దాల్లోనే సాకారం చేసుకున్నాయి. అలాగే అత్యంత వేగంగా దుబాయ్ ని ప్రపంచ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేశాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీఐపీలు, సెలబ్రిటీలు, బిలియనీర్లు దుబాయ్‌లో నివాసం ఉండాలనే విధంగా ఆ నగరాన్ని తీర్చిదిద్దాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కానీ ఏ దేశంలో అయినా విదేశీయులు సెటిల్ కావాలంటే.. అక్కడి వీసా విధానానిదే కీలక పాత్ర. ఉదాహరణకు అమెరికా అవకాశాల స్వర్గం అయిందంటే.. అందుకు ఆ దేశ వీసా విధానం పోషించిన పాత్ర చాలా ఉంది. అమెరికా అందరి సొంతం. అమెరికాలో కేవలం అమెరికన్లే ఉండరు. ప్రపంచంలో ఉన్న అన్నిదేశాల పౌరులకూ అక్కడ పౌరసత్వం ఇస్తారు. ఒక్కసారి పౌరసత్వం వచ్చాక అందరూ అమెరికన్లే. ఎవరి పట్లా వివక్ష ఉండదు. ఇలాంటి విధానాలే అమెరికాను ఇప్పటికీ అగ్రదేశంగా నిలబెడుతున్నాయి. కానీ గల్ఫ్ దేశాలు మాత్రం పెట్టుబడుల ఆకర్షణకు ఇచ్చినంత ప్రాధాన్యత.. మెరుగైన వీసా విధానం విషయంలో మాత్రం చూపలేదు.
గల్ఫ్ దేశాలు ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ జీవన విధానం విషయంలో కొన్ని సిద్ధాంతాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. గల్ఫ్‌లో చట్టాలు, శిక్షలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. గల్ఫ్ దేశాల రూపు మాత్రమే మారింది కానీ.. కరడుగట్టిన జీవనశైలి అలాగే ఉందనేది కొందరు విమర్శకుల వాదన. వారి వాదనకు బలం చేకూరేలా గల్ఫ్ వీసా విధానం చాలా కఠినంగా ఉంటుంది. ఎంతటి పెట్టుబడిదారులకైనా.. మరెవరికైనా కేవలం పదేళ్లకు మాత్రమే వీసా ఇస్తారు. కావాలంటే తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సిందే. అదేంటి ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా అంటే.. మీరు సొంతంగా మా దేశంలో కంపెనీ పెట్టినా సరే.. వీసా మాత్రం పదేళ్లకే అంటాయి గల్ఫ్ దేశాలు. దీంతో గల్ఫ్‌లో స్థిరనివాసం అంత తేలిక కాదనే భావన వచ్చేసింది. చివరకు అక్కడ ఉన్నవారు కూడా స్థానికుల్లాగా.. అది తమ దేశం అనుకోరు. అలా అనుకోవటానికి గల్ఫ్ దేశాలు ఏనాడూ అవకాశం ఇవ్వలేదు. అమెరికా అందర్నీ కలుపుకుపోతుండగా.. గల్ఫ్ మాత్రం పెట్టుబడులకు కలిసి రండి.. స్థిరనివాసం మాత్రం అడగకండి.. ఆ విషయంలో మీకు మీరే.. మాకు మేమే అంటోంది. దీంతో ఇన్నాళ్లూ అమెరికాలో మాత్రమే స్థిరనివాసానికి స్థానం ఉంది. ఇప్పుడు తమకు రెండో నివాసస్థానం వచ్చిందనుకున్న బిలియనీర్లకు నిరాశే ఎదురైంది.
ఓ దేశాన్ని తమది అనుకున్నప్పుడే ఎవరైనా పూర్తిస్థాయిలో అక్కడ దృష్టి కేంద్రీకరిస్తారు. అంతేకానీ ఏదో కొన్నాళ్ల కాలక్షేపం అనుకున్నప్పుడు.. అంతగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. నిజానికి గల్ఫ్ ఉన్న భౌగోళిక స్థానం కూడా ఆ ప్రాంతం వేగవంతమైన అభివృద్ధికి కారణమైంది. ఈ మాత్రం సానుకూలత కూడా అమెరికా తోడ్పాటుతో సాధ్యమైందనే వారూ లేకపోలేదు. జీవన విధానంలో విదేశీయుల్ని తేడాగా చూస్తున్నప్పుడు.. గల్ఫ్ తమది అని ఎందుకు అనుకోవాలని గోల్డెన్ వీసా దక్కించుకున్నవారూ అడుగుతున్న ప్రశ్న. ఇలాంటి పరిస్థితి మంచిది కాదని గతంలోనే గల్ఫ్ నేతలకు చాలా దేశాలు చెప్పిచూశాయి. కానీ వారు ఆ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకున్నారు. పైగా తమ సంస్కృతి అలాగే ఉండాలంటే.. ఈ మాత్రం కట్టుదిట్టాలు ఉండాలనే వాదన కూడా చేశారు. దీంతో ఈ విషయంలో వీరు మారేలా లేరని చెప్పడం కూడా మానేశాయి ఆ దేశాలు. అప్పటికైనా తమ పద్ధతి మార్చుకోకపోగా.. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా స్వతంత్రంగా ఉంటున్నామని గల్ఫ్ నేతలు గర్వించారు. కానీ ప్రస్తుత దుస్థితిలో ఆ తప్పు కూడా మరింత ముంచుతుందని గ్రహించలేకపోయారు.
రెండున్నర దశాబ్దాల క్రితం అమెరికాపై దారుణమైన ఉగ్రదాడి జరిగింది. అక్కడ ఉన్నవారందరూ తీవ్రంగా భయపడిన మాట నిజం. కానీ అమెరికానుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలనే యోచన కొందరే చేశారు. చాలా మంది అక్కడే ఉన్నారు. పైగా ఆ దాడి జరిగిన కొన్ని రోజుల వ్యవధిలో అమెరికాలో జనజీవనం యథాస్థితికి వచ్చింది. కానీ గల్ఫ్ పరిస్థితి అలా లేదు. ఇరాన్ యుద్ధానికి ముందు జనంతో నిండుగా కళకళలాడిన గల్ఫ్.. ఇప్పుడు జీవం కోల్పోయి.. జీవచ్ఛవంలా మిగిలింది. జనంతో పాటు.. వారి రాకకు మూలమైన పెట్టుబడులూ తరలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అందరిలో విశ్వాసం పాదుకొల్పాల్సిన గల్ఫ్ దేశాలు.. ఇంతవరకూ ఓ నిర్దిష్ట కార్యాచరణకు ముందుకు రాకుండా చోద్యం చూస్తున్నాయి. ఇప్పటికైనా తమ అభివృద్ధి మోడల్లో మౌలిక లోపాల్ని గల్ఫ్ సరిచేసుకోకపోతే.. ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ బాగుచేయలేరు. రేపు నిజంగా అమెరికా పరిహారం ఇచ్చినా.. కూడా పరాయి దేశాలిచ్చే భద్రతపై ఆధారపడ్డ చోటుకు పెట్టుబడులు గతంలో మాదిరిగా వస్తాయనుకోవడం భ్రమే అవుతుంది. ఇప్పిటకి అయిన నష్టం చాలు.. మళ్లీ గల్ఫ్‌లో పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకోవడం ఎందుకు అనే ధోరణి పెరిగితే.. అది పెట్టుబడిదారుల తప్పు కాదు. కచ్చితంగా ఆ లోపం గల్ఫ్ విధానాలదే అవుతోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గల్ఫ్ దేశాలు తమ అభివృద్ధి మోడల్‌పై ఆత్మ సమీక్ష చేసుకోవాలి. భద్రత విషయంలో కట్టుదిట్టాలు చేసుకోవాలి. అలాగే కీలకమైన ఉత్పత్తి రంగాన్ని చిన్నగా పట్టాలెక్కించాలి. ఆ తర్వాత పెట్టుబడిదారులతో సమావేశాలు పెట్టి.. ఎలా వారి పెట్టుబడులకు భరోసా ఇస్తారో వివరించాలి. అవసరమైతే వారి సలహాలు కూడా తీసుకుని అమల్లో పెట్టాలి. అలాగే వీసా విధానం కూడా మార్చుకుని.. విదేశీయుల్ని సముచితంగా గౌరవించడం నేర్చుకోవాలి. ఇలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే.. గల్ఫ్ మరో పదేళ్లకైనా పూర్వవైభవం పొందటానికి అవకాశం ఉంటుంది. అంతేకానీ ఏం జరిగినా.. మేం మూస పద్ధతుల్లోనే ఉంటాం.. మా విధానాలు మార్చుకోం అంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అంతేకాకుండా చేతులారా నిర్మించిన అభివృద్ధి సౌధాన్ని..తామే కుప్పకూల్చుకున్నట్టవుతుంది. ఏ వ్యవస్థ అయినా నిర్మించడం కంటే.. దాన్ని భద్రంగా కాపాడుకోవటమే చాలా కష్టమైన పని. ఈ సంగతి ఇప్పటికే గల్ఫ్‌కు అనుభవంలోకి రావాలి. కానీ ఇంకా రాలేదంటే మాత్రం ఇక ఎప్పటికీ రాదని పెట్టుబడిదారులు అనుకుంటే అంతకు మించిన ప్రమాదం మరోటి ఉండదు. అలా పరిస్థితి పూర్తిగా చేయి దాటక ముందే.. గల్ఫ్ దేశాలు మేలుకోవాలి. ప్రాప్తకాలజ్ఞతతో ఆలోచించి.. సరైన కార్యాచరణ తీసుకోవాలి.. మెరుగైన భవిష్యత్తును స్వప్నించాలి.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?