Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Story Board About Did Trump Sink The World Us Iran War Impact Gulf Crisis And Global Economy Analysis

Story Board: ట్రంప్‌ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్‌ ఇప్పట్లో కోలుకోవా..?

Published Date :April 24, 2026 , 6:06 pm
By NTV WebDesk
  • ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం..
  • కుటుంబాలు విచ్ఛిన్నం..
  • యుద్ధం ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా...
  • మానవాళికి తీరని నష్టం తప్పదు..
  • రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోలేదు..
  • యుద్ధంలో అమెరికాకు బిలియన్ల డాలర్ల నష్టం..
  • తొలి వారంలోనే ఏకంగా 11.3 బిలియన్‌ డాలర్లు..
  • ఇరాన్ గెరిల్లా తరహా దాడులు, క్షిపణి వ్యూహాలు..
  • ఒక దేశం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి చేస్తున్న ఆత్మాహుతి పోరాటం..
  • గల్ఫ్ నుంచి చమురు సరఫరా ఆగడంతో ఇంధన ధరలు పైపైకి..
  • యుద్ధాన్ని ప్రారంభించడం ఈజీనే..
  • ఇంకా యుద్ధం ఓ కొలిక్కి రావట్లేదు..
  • అటు యుద్ధ ఖర్చులు, ఇటు దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం..
  • అమెరికాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసే అవకాశాలు ..
  • యుద్ధం అంటేనే వినాశనం అని చరిత్ర చెబుతున్నా..
  • అగ్రరాజ్యాలు అదే బాటలో పయనించడం విషాదకరం..
Story Board: ట్రంప్‌ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్‌ ఇప్పట్లో కోలుకోవా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board: యుద్ధం ఏదైనా వినాశనమే అనేది అక్షరాలా నిజం. యుద్ధం ఏ దేశాల మధ్య జరిగినా, గెలుపు ఎవరిదైనా, అంతిమంగా నష్టపోయేది మాత్రం మానవాళే. యుద్దం అంటేనే…వేల మంది సైనికులతో పాటు అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతారు. దేశాల మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతాయి. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు, మానసిక వేదనకు గురవుతారు. యుద్ధం వల్ల తరతరాలుగా సాధించిన అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధమైనా, అమెరికా-ఇరాన్‌ వార్‌ అయినా…మానవాళికి ముప్పునే తెచ్చిపెట్టాయి. ఈ యుద్దాలతో ప్రపంచానికి ఒరిగిందేమీ లేదు. ప్రాంతీయ యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి, ఇది చమురు, గ్యాస్, ఆహారం ఇలా అనేక రకాల ధరల పెరుగుదలకు దారితీస్తోంది.

యుద్ధం ఎందుకు జరిగినా…ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా…మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. గడచిన యుద్ధాలు చేసిన గాయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయినా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. చరిత్రలో యుద్ధాలతో గడిచిన కాలమే ఎక్కువ. యావత్‌ ప్రపంచం అంతటా శాంతి పరిఢవిల్లిన కాలం చాలా తక్కువ. యుద్ధోన్మాదం తలకెక్కిన నియంతలకు, మిథ్యా పౌరుషాలతో పిచ్చిపట్టిన పాలకులకు ఇలాంటి హితోక్తులు రుచించవు. వాళ్ల ఆధిపత్యమే వాళ్లకు ముఖ్యం. వాళ్ల చండశాసనాలు చలామణీ కావడం వారికి పైశాచిక ఆనందం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు…రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోలేదు. అగ్రరాజ్యం అమెరికా అహంకారం…అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెంపరితనం…ప్రపంచానికి తలనొప్పులు తెచ్చింది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇరాన్ అణు కార్యక్రమం , ప్రాంతీయ అధిపత్యం అనే సమస్యను యుద్ధం ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. అయితే ఈ వ్యూహం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, అమెరికా తన సైనిక శక్తిని , అంతర్జాతీయ ప్రతిష్ఠను భారీగా కోల్పోయే పరిస్థితికి దారి తీసింది. అణ్వాయుధాల తయారీ పేరుతో ఇరాన్‌పై యుద్ధానికి దిగాడు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించి…కయ్యానికి కాలు దువ్వాడు. ఖమేనీ దాదాపు 40 రోజుల పాటు ఇరాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు.

Also Read

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Story Board: దీదీ హెచ్చరికలు పనిచేస్తాయా? మోడీ మసాలా మరమరాల సంగతేంటి?
  • Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ షాక్..! 54 ఓట్ల తేడాతో..
  • Story Board: నియోజకవర్గాల పునర్విభజన..! తెలుగు రాష్ట్రాలకు వరమా? శాపమా?

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోతోంది. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే ఏకంగా 11.3 బిలియన్‌ డాలర్లను అమెరికా వెచ్చించింది. రోజుకు సగటున 2 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది. యుద్ధం కోసం మరో 200 బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని పెంటగాన్‌ వైట్‌హౌస్‌ని కోరింది. ఆయుధ నిల్వలు కరిగిపోయాయి. ఇరాన్‌ దాడులతో గల్ఫ్‌లోని అమెరికా బేస్‌లకు భారీ నష్టం వాటిల్లింది. మొత్తంగా ఈ యుద్ధం అమెరికాకు మోయలేని భారంగా మారింది. ఉక్రెయిన్‌ రక్షణ కోసం కేటాయించిన ఆయుధాలను అమెరికా దారి మళ్లించి ఇరాన్‌పై యుద్ధంలో వినియోగించింది. 40 రోజుల పాటు జరిగిన యుద్దంలో అమెరికా అత్యంత విలువైన, అరుదైన ఆయుధ సామగ్రి నిల్వలు కరిగిపోయాయి.

యుద్ధం ప్రారంభమైన అనతికాలంలోనే అమెరికా అసాధారణమైన నష్టాలను చవి చూసింది. ఇరాన్ ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల ధాటికి అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, కీలకమైన సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతర్గతంగా ప్రజల ఆగ్రహానికి దారి తీసింది. ఆధునిక సాంకేతికతతో ఇరాన్‌ను క్షణాల్లో అణచివేయవచ్చన్న అంచనాలు తప్పాయి. ఇరాన్ గెరిల్లా తరహా దాడులు, క్షిపణి వ్యూహాలు అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు చేసింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో అనేకమంది అమెరికా సైనికులు గాయపడగా, యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి.

టెహ్రాన్‌ వైఖరి ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. తమ ఉనికికే ముప్పు ఏర్పడినప్పుడు, ప్రపంచాన్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వబోమనే ధోరణితో ఇరాన్ వ్యవహరిస్తోంది. తమ దేశంలోని మౌలిక సదుపాయాలు నాశనమైనా పర్వాలేదు. కానీ, పోతూ పోతూ శత్రువుకు…ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని విధంగా దెబ్బ తీయడమే లక్ష్యంగా పని చేస్తోంది. అందుకే గల్ఫ్ ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, అంతర్జాతీయ నౌకాయాన మార్గాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఒక దేశం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి చేస్తున్న ఆత్మాహుతి పోరాటం లా కనిపిస్తోంది. ఈ యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం యుద్ధ రంగంకే పరిమితం కాలేదు. గల్ఫ్ నుంచి చమురు సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐరోపా నుండి ఆసియా వరకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది.

యుద్ధాన్ని ప్రారంభించడం ఈజీనే. దాన్ని ముగించడమే చాలా కష్టం. ఇరాన్ లాంటి దేశాన్ని అమెరికా లాంటి అగ్రరాజ్యం తక్కువ అంచనా వేయడంలో అర్థం ఉంది. కానీ, యూఎస్ చేసిన పెద్ద తప్పు అదే. ఇరాన్‌కు ఉన్న భౌగోళిక పరిస్థితులు, భూగర్భ సైనిక స్థావరాలే.. ఆ దేశానికి కొండంత అండ. కేవలం.. బాంబు దాడులు, డ్రోన్లు, మిసైల్ ఎటాక్స్‌తో ఓ దేశాన్ని లొంగదీసుకోవచ్చనే అమెరికా వ్యూహాలు బెడసికొట్టాయి. అవి ఇప్పుడు అస్సలు పనిచేయడం లేదు. ఇరాన్ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఎలా ఛేదించాలో తెలియక.. ట్రంప్ సతమతమవుతున్నారు. అందుకే.. ఇంకా యుద్ధం ఓ కొలిక్కి రావట్లేదు. వందల కోట్ల విలువైన క్షిపణులను ఎదుర్కోవడానికి ఇరాన్ కేవలం లక్షలు విలువ చేసే డ్రోన్లను వాడింది. ఇదే.. అమెరికాకు లక్ష కోట్లు ఖర్చయ్యేలా చేసింది. గతంలో.. అమెరికా యుద్ధానికి వెళితే.. యూరప్ దేశాలు వెంటనే మద్దతిచ్చేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాటో దేశాలు కూడా తమకు సంబంధం లేదని చెప్పేశాయి.

అమెరికాపై ఈ ప్రభావం రాను రాను మరింత తీవ్రంగా ఉండబోతోంది. అటు యుద్ధ ఖర్చులు, ఇటు దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం అమెరికాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుద్ధం అంటేనే వినాశనం అని చరిత్ర చెబుతున్నా, అగ్రరాజ్యాలు అదే బాటలో పయనించడం విషాదకరం. క్షిపణులు, బాంబులతో సమస్యలు పరిష్కారం కావని, అవి మరిన్ని సమస్యలకు బీజం వేస్తాయని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి. అనేక యుద్దాలతో ఇప్పటికే రుజువైంది. అమెరికా, ఇజ్రాయెల్ తమ మొండివైఖరిని వీడకపోయినా, లేదా ఇరాన్ తన విధ్వంసక దాడులను ఆపకపోయినా.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రపంచం ఇప్పుడు ఒక అంచున నిలబడి ఉంది. ఇక్కడి నుండి శాంతి వైపు అడుగులు వేయకపోతే…ప్రపంచం వినాశనమే.

ఇరాన్-అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు…గల్ఫ్‌ దేశాల భవితవ్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశాయి. సురక్షిత ప్రాంతాలుగా ఉన్న అరబ్‌ దేశాలు… స్వర్గం ప్రతిష్టను తీవ్రంగా సవాలు చేస్తున్నాయి. యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకపోయినా…గల్ఫ్‌ బాధలు వర్ణణాతీతంగా మారాయి. సుసంపన్నమైన గల్ఫ్‌ దేశాలు…ఇరాన్‌, అమెరికా యుద్దంతో బజారుపడ్డాయి. ఊహించనిస్థాయిలో అన్ని రంగాలు ప్రభావితం అయ్యాయి. చమురు, టూరిజం, రియల్ ఎస్టేట్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలు కుదేలయ్యాయి. చమురు కేంద్రాలు, రిఫైనరీలతో పాటు నౌకలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకోవడం…గల్ఫ్‌ను దారుణంగా దెబ్బకొట్టింది. యుద్ధంలో జరిగిన నష్టాన్ని భరించాలని అమెరికాపై గల్ఫ్ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ బెయిల్‌ ఔట్ ప్యాకేజీ డిమాండ్‌ చేసింది. మిగిలిన గల్ఫ్‌ దేశాలు ఆ బాటలో పయనించే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల ఉమ్మడి జీడీపీలో సుమారు 5.2శాతం నుంచి 8.5శాతం యుద్ధంతో నష్టపోయింది. అంటే 103 బిలియన్ డాలర్ల నుంచి 168బిలియన్ల డాలర్లు. భారత కరెన్సీలో దీని విలువ 8.5 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లు. 2026 సంవత్సరానికి గల్ఫ్ దేశాల వృద్ధి రేటు మునుపటి అంచనాల కంటే 1.8% నుంచి 2.4% వరకు పడిపోయింది. యుద్ధం కారణంగా సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్ దేశాల చమురు ఉత్పత్తి రోజుకు 10 మిలియన్ బారెల్స్ వరకు తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 120 డాలర్ల మార్కును తాకింది.

దుబాయ్‌ని ప్రపంచ నగరంగా నిర్మించడానికి అక్కడి పాలకులు పాతికేళ్లకుపైగా శ్రమించారు. అమెరికా-ఇరాన్‌ అనే యుద్దం దెబ్బకు…దశాబ్దాల కష్టం వృథా అయింది. దేశంలో పెట్రోల్‌ నిల్వలు తగ్గిపోవడంతో ప్రత్నామ్నాయాలపై దృష్టి పెట్టారు. పర్యాటక, రియల్ ఎస్టేట్ , టెక్నాలజీ రంగాల వైపు మళ్లించడంలో గొప్ప విజయం సాధించింది. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్…విజన్‌తో పని చేస్తున్నారు. ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక కేంద్రాలలో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మంది కుబేరులు…తమ కుటుంబాలతో సహా ఇక్కడ స్థిరపడ్డారు. కేవలం విలాసం కోసమే కాకుండా, పన్ను రాయితీలు, అద్భుతమైన మౌలిక సదుపాయాల కారణంగా ఇది అంతర్జాతీయ వ్యాపారాలకు ప్రధాన చిరునామాగా మారింది.

పర్యాటకులను ఆకట్టుకునేందుకు…అత్యాధునిక సౌకర్యాలతో హోటల్స్‌ నిర్మించాయి. ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. పర్యాటక రంగం, హోటల్స్‌, షాపింగ్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చేశాయి. విఐపీలు షాపింగ్‌ చేయలన్నా…స్వచ్ఛమైన బంగారం కోనుగోలు చేయాలన్నా…ప్రపంచంలోని ప్రముఖులంతా అరబ్‌ కంట్రీస్‌లోనే వాలిపోయారు. సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు..అందరూ షాపింగ్‌ కోసం అరబ్‌ కంట్రీస్‌కే వెళ్లారు. ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయింది. రోజుకి 50 వేల రూంలు బుక్కయితేనే…ఈ నగరం మనగలుగుతుంది. ప్రస్తుతం యుద్దంతో దుబాయ్‌లో అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. పునర్‌ వైభవం తీసుకురావాలంటే…అక్కడి పాలకులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. అయితే ఎన్నాళ్లు పడుతుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. సేఫ్‌ హెవన్‌గా పిలుచుకునే నగరం…యుద్ధంతో రూపు కోల్పోయింది. దుబాయ్‌ అత్యంత సురక్షితమైన అంతర్జాతీయ కేంద్రం. పర్యాటకులకు కేరాఫ్‌ అడ్రస్‌. అంతకుమించి…సురక్షితమైన నగరం. ఇదంతా యుద్ధానికి ముందు పరిస్థితి. ఇరాన్‌ ప్రతీకార దాడులకు దుబాయ్‌ కకావికలం అయింది. ప్రసిద్ధ కట్టడాలపై ఇరాన్‌ డ్రోన్, క్షిపణి దాడులు దుబాయ్‌ ప్రతిష్ఠను మసకబారేలా చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28న ప్రారంభించిన దాడులకు ప్రతిగా ఇరాన్‌ తన పొరుగున ఉన్న గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లు ప్రయోగించాయి. ఇరాన్‌ దాడులతో…యూఏఈ తన గగనతలాన్ని మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. పశ్చిమాసియా ప్రాంతంలోని అత్యంత సురక్షిత ప్రదేశంలో తాము పర్యటించబోతున్నామని పర్యాటకులు భావించారు. యుద్ధంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.

అమెరికా, ఇరాన్‌ వార్‌…గల్ఫ్‌ దేశాలకు ప్రాణసంకటంగా మారింది. ప్రధానంగా దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం అనిశ్చితిలో పడింది. గతేడాది దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 2.70 లక్షలకు పైగా స్థిరాస్తి లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 917 బిలియన్‌ ఏఈడీ. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 2 లక్షల 30 వేల 872 కోట్లు. దుబాయ్‌ రియల్టీ చరిత్రలో ఇవే అత్యధిక లావాదేవీలు. ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యధిక అద్దె రాబడి వచ్చేది దుబాయ్‌లోనే.. ఇక్కడ అద్దె వార్షిక ఆదాయం 6-9 శాతం మధ్య ఉంటుంది. దుబాయ్‌లోనే భారతీయులు ఎక్కువ మంది పెట్టుడులు పెడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్‌ ఆస్తి కొనుగోళ్ల వాటా 20 నుంచి 22 శాతంగా ఉందని అనరాక్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి దుబాయ్‌లో గృహాల ధరలు సుమారు 60-75 శాతం మేర పెరిగాయి. గతేడాది దుబాయ్‌లో దాదాపు 2 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వీటి విలువ ఇండియన్‌ కరెన్సీలో 1,34,945 కోట్లు.

దుబాయ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే క్లయింట్లు డీల్స్‌పై వెనక్కి తగ్గుతున్నారు. చాలా మంది ఒప్పందాలు జాప్యం చేస్తున్నారు. సైట్‌ విజిట్స్‌ తగ్గాయి. లావాదేవీలు 30-40% పడిపోయే అవకాశం ఉంది. లగ్జరీ సెగ్మెంట్‌ మరింత దెబ్బతింటోంది. ఇన్వెస్టర్లు ఆస్తుల విలువ పడిపోవడం, ఫోర్స్‌డ్‌ సేల్స్‌ భయంతో ఉన్నారు. అలాగే హోటల్, పర్యాటక రంగం మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో అరైవల్స్‌ తగ్గాయి. పామ్‌ జుమైరా, దుబాయ్‌ మెరీనా హోటల్స్‌ ఆక్యుపెన్సీ రేట్లు దారుణంగా పడిపోయాయి. మైనింగ్, గోల్డ్‌ బిజినెస్‌లో డైరెక్ట్‌ డ్యామేజ్‌ తక్కువే అయినా, ఇన్సూరెన్స్‌ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఇవన్నీ గల్ఫ్‌లో పెట్టుబడిపెట్టిన ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గల్ఫ్‌లోని ప్రస్తుత పరిస్థితులతో రియల్‌ ఎస్టేట్, హోటల్, గోల్డ్‌ ట్రేడింగ్, మైనింగ్‌ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టిన భారతీయలు తీవ్ర ఆందోళనలో పడ్డారు. యుద్దం…దుబాయ్‌ సేఫ్‌ హెవెన్‌ అనే ఇమేజ్‌ను దెబ్బతీసింది. దీంతో దుబాయ్, అబుదాబి, దోహా, షార్జా తదితర నగరాల్లో పెట్టుబడులు పెట్టిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. వీరిలో సీక్రెట్‌ పెట్టుబడులు పెట్టిన పలువురు రాజకీయ నాయకులు, వారి దగ్గరి బంధువులతోపాటు కొందరు సినీ ప్రముఖులు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖుల్లో కొందరు బినామీల ద్వారా దుబాయ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. పలువురు కీలక నేతలు లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలు, హోటల్స్, గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. కొందరికి దుబాయ్‌లో హోటల్, రియల్‌ ఎస్టేట్, ఐటీ, మైనింగ్‌ వ్యాపారం చేస్తున్న నేతలు ఆందోళనలో పడిపోయారు.

అమెరికా-ఇరాన్‌ యుద్దం…భారత్‌ కొంప ముంచుతోంది. ఈ వార్‌ కారణంగా ఇండియాకు ఊహించనంత నష్టం జరుగుతోంది. ఇరాన్‌లో యుద్ధం జరుగుతుంటే.. మనదేశంలోని అన్ని రంగాలపై ఎఫెక్ట్‌ పడుతోంది. చమురు నుంచి సబ్బుల దాకా…ఔషధాల నుంచి ఎరువుల వరకు…స్టీల్‌ నుంచి సిమెంట్‌ దాకా… అన్ని రంగాలపైన ఎఫెక్ట్‌ పడుతుంది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఎగుమతులు ఆగిపోయాయి…దిగుమతులు బంద్‌ అయ్యాయి. విదేశాల నుంచి రావాల్సిన అనేక ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. స్టాక్‌మార్కెట్లు బేర్‌మంటున్నాయి. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూనే ఉంది. ఈ రంగం…ఆ రంగం అంటూ ఏమీ లేదు. అన్ని రంగాలకు యుద్ధం షాక్ ఇచ్చింది. ఈ పరిస్థితులు మరింతకాలం కొనసాగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముడి చమురు ధర పెరగడం వల్ల దేశానికి దిగుమతుల బిల్లు భారం అధికమవుతుంది. ఎగుమతులు బలహీన పడుతున్నందున…కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతుంది. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకపు విలువ మరింత తగ్గొచ్చు. ఎరువులపై సబ్సిడీకి అధికంగా వెచ్చించాల్సి రావడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2025 డిసెంబరు నుంచి యూరియా ధర సుమారు 50% అధికమైంది. పెరుగుతున్న గ్యాస్‌ ధరలు, ఎరువుల ద్రవ్యోల్బణం కారణంగా సబ్సిడీ 30వేల కోట్లకు పైగా చేరే అవకాశం ఉంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు అధికమైతే, దేశ వార్షిక కరెంట్‌ ఖాతా లోటు 15 బిలియన్‌ డాలర్ల మేర పెరుగుతుందని అంచనా. ముడి చమురు ధర దీర్ఘకాలం పాటు బ్యారెల్‌కు 100 డాలర్ల దగ్గరగా ఉంటే, కరెంటు ఖాతా లోటు బాగా ఎక్కువ కావచ్చు. కరెంట్‌ ఖాతా లోటు 70 బిలియన్‌ డాలర్ల మేర పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. మున్ముందు ఇంధన సంక్షోభంతో పాటు ఎరువుల సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం ఉంది. భారతదేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలక ఎరువైన యూరియా సప్లైలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత్‌ వినియోగించే యూరియాలో దాదాపు 46 శాతం ఒమన్ దేశం నుంచే వస్తుంటుంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాలు కూడా మన దేశానికి యూరియాను విక్రయిస్తుంటాయి. ప్రస్తుతం ఇరాన్‌ పరిధిలోని హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు యూరియా సప్లై ఆగిపోయింది. యూరియాను తయారు చేయాలంటే సహజ వాయువు అవసరం. ఎల్‌ఎన్‌జీ సప్లై ఆగిపోవడంతో ప్రస్తుతం భారత్‌లోని యూరియా తయారీ ప్లాంట్లు సగం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతో యూరియా ధరలు ఇప్పటికే 19 నుంచి 28 శాతం పెరిగాయి. ఇతరత్రా ఎరువుల కొరత కూడా నెలకొంది.

యుద్ధ జ్వాలలు నిర్మాణ రంగాన్ని తాకాయి. పేద, మధ్య తరగతి జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది. పరిశ్రమలకు గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో ఇనుము, సిమెంట్, ఇతర ముడి సరకుల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో చాలా వరకు నిర్మాణాలు నిలిచి పోతున్నాయి. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం అంటేనే హడలిపోయే పరిస్థితులు కలుగుతున్నాయి. నిర్మాణాల్లో కీలకమైన ఇనుము ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. 20 రోజుల క్రితంతో పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభంలో టన్ను ఇనుము ధర 65వేలు ఉండగా ప్రస్తుతం 75వేల నుంచి 78వేల వరకు పెరిగింది. సిమెంట్‌ బస్తాకు 50 నుంచి 60 వరకు పెరిగింది. ఇంటి నిర్మాణంలో వినియోగించే టైల్స్, మార్బుల్స్‌ ధరలకు రెక్కలొచ్చాయి. నిర్మాణాలకు వినియోగించే అన్నిరకాల టైల్స్‌ ఇతర ప్రాంతాల నుంచే జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. గ్యాస్‌ కొరత కారణంగా అక్కడ కొన్ని పరిశ్రమలు మూసి వేయడంతో సమస్య ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. చదరపు అడుగు టైల్స్‌కు 5 నుంచి 10 వరకు రకాన్ని బట్టి పెంచి విక్రయిస్తున్నారు. ఆల్‌టెక్‌ సీలింగ్‌కు వినియోగించే జిప్సమ్‌ షీట్‌ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రతి దానిపైన రూ.500 వరకు పెరిగింది. జింకు పైపు ధరలు గతంలో కిలో రూ.75 ఉంటే ఇప్పుడు రూ.90కి చేరుకుంది. 20 అడుగుల పొడవు ప్లాస్టిక్‌ పైపు గతంలో రూ.300 ఉంటే తాజాగా రూ.450కి చేరుకుంది. పూర్తి స్థాయిలో ఇనుము, సిమెంటు సరఫరా కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో చదరపు అడుగుకు 2,500 ఖర్చయితే ప్రస్తుతం రూ.3వేలు అవుతోందని చెబుతున్నారు. భారం తట్టుకోలేక కొంత మంది నిర్మాణదారులు మధ్యలోనే నిలుపుదల చేస్తుండటంతో అమ్మకాలు సైతం తగ్గాయి.

ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులకే ఇండియా కేరాఫ్‌ అడ్రస్‌. యుద్దం సప్లై చైన్‌ను ప్రభావితం చేస్తోంది. యూఏఈ మీదుగా మెడిసిన్స్, ఫార్మా ఉత్పత్తుల సరఫరా అవుతాయి. భారత ఫార్మా రంగానికి ఈ విమానాశ్రయం కీలకమైనది. ప్రపంచంలో జనరిక్ మెడిసిన్స్‌ను భారత్ అధికంగా సరఫరా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే వ్యాక్సిన్లలో 60శాతం భారత్ నుంచి వస్తున్నట్లు భారత వాణిజ్య పరిశ్రమల శాఖ చెబుతోంది. భారత ఫార్మా ఎగుమతులలో అధిక భాగం దుబాయి ఓడరేవు ద్వారా జరుగుతాయి. ఇక్కడ నుంచి మందులు పర్షియన్ గల్ఫ్, ఆఫ్రికా, యూరప్‌ దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడుల వల్ల దుబాయి పోర్టు, ఎయిర్‌పోర్టు దెబ్బ తినడంతో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధ జ్వాలలు పరిసర దేశాల్ని ప్రత్యక్షంగా… దిగుమతులు, ఎగుమతులపై ఆధారపడిన దేశాల్ని పరోక్షంగా కాల్చేస్తున్నాయి. ఇక్కడే భారత్ ఊహించని సవాళ్లు ఎదుర్కొంటోంది. దేశీయ చమురు అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారం. యుద్ధానికి ముందు వరకు భారత్‌కు వచ్చే చమురు సరఫరాలో 40 నుంచి 50 శాతం హార్మోజ్ జలసంధి ద్వారానే సాగేది. ఇప్పుడా జీవ నాడి బిగుసుకుపోయి, ఇక్కడ అనేక రంగాలకు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. ఇంధన, ఏవియేషన్ రంగం ఆ కష్టనష్టాల్లో ముందు వరుసలో నిలుస్తోంది. ముడిచమురు మంటతో విమానయాన ఇంధన ఖర్చులు పెరిగి టికెట్ ధరలు భారీ స్థాయిలో ఎగబాకాయి. ఇదే సమయంలో మన దేశ యూరియా, ఎన్‌పీకే వంటి ఎరువుల అవసరాల్లో 40 శాతం గల్ఫ్ నుంచే తీర్చుకుంటోంది. ఇప్పుడు ఆ సరఫరా ఆగడం వల్ల సాగు ఖర్చులు పెరిగి ఆహార భద్రతపై ప్రభావం పడే ప్రమాదం నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump Iran Conflict
  • global economy war impact
  • Gulf crisis impact
  • Hormuz Strait Crisis
  • India economy Iran war

తాజావార్తలు

  • Story Board: ట్రంప్‌ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్‌ ఇప్పట్లో కోలుకోవా..?

  • Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన నెతన్యాహూ..

  • Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!

  • TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!

  • NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions