Story Board : రోజుకో మాట.. పూటకో పోస్ట్. ఏం చేసినా అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకోవటమే లక్ష్యం. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు. అందరూ నా గురించే మాట్లాడుకోవాలనుకుంటున్నారు ట్రంప్. అంతటితో ఆగకుండా నోబెల్ పిచ్చితో తానే యుద్ధాలు సృష్టించి. మళ్లీ వాటిని ఆపినట్టుగా ఇస్తున్న బిల్డప్ చూసి.. ప్రపంచం బెదిరిపోతోంది.
అమెరికాను ట్రంప్ పాలిస్తున్నారా.. ట్రూత్ సోషల్ నడుపుతుందా అనే సందేహం వస్తే.. అది మన తప్పు కాదు. ట్రంప్ రెండో విడత పాలన తీరు అంత చక్కగా ఉంది. ఎందుకంటే గతంలో అధ్యక్షుడి కీలక నిర్ణయాలన్నీ వైట్ హౌస్ ప్రకటనల్లో చూసి తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రంప్ ఎంత పెద్ద నిర్ణయమైనా ట్రూత్ సోషల్‌లోనే పోస్ట్ చేస్తున్నారు .ఆ తర్వాత దాన్నే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌గా ఇస్తున్నారు. దొంగలుపడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన చందాన.. ఆ తర్వాతెప్పుడో వైట్‌హౌస్ తీరిగ్గా ప్రకటన జారీచేస్తోంది. అసలు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటనలు చేయడమేంటనే ప్రశ్నలకు జవాబిచ్చే తీరిక ట్రంప్‌కు లేనేలేదు. మళ్లీ ఇదే ట్రంప్ అధికారిక రహస్యాలేవో సోషల్ మీడియాలో పెట్టారని తప్పుడు క్యాంపైన్ చేసి గతంలో హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్ష ఎన్నికల్లో ఓడించారు. అప్పుడు నైతికత గురించి లెక్చర్లు దంచిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా సొంత సోషల్ మీడియానే పెట్టుకుని కేవలం అందులోనే అధ్యక్షుడి కీలక నిర్ణయాలు పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలోనూ పక్షపాతానికి తెరలేపారు. ట్రంప్ తెంపరితనానికి అసలు కారణం ట్రూత్ సోషల్‌ను పాపులర్ చేయడంతో పాటు.. తద్వారా ఆదాయం పొందటమే అనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. స్వతహాగా బిలియనీర్ అయిన ట్రంప్.. కాసుల కక్కుర్తితో ఇలాంటి పనులు చేస్తారా అని మామూలు జనం ఆశ్చర్యపోవచ్చు కానీ.. ట్రంప్ చిల్లరబుద్ధి గురించి తెలిసినవారు మాత్రం అదే నిజం అంటున్నారు.
నిజానికి ట్రంప్ తొలివిడతలోనే ఈ అధ్యక్షుడు ఏంటి ఇలా ఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఏకంగా మాకొద్దీ ప్రెసిడెంట్ అంటూ ఆందోళనలూ జరిగాయి. కానీ రెండో విడతలో ట్రంప్ చూపుతున్న పైత్యం మాత్రం పిచ్చికి పరాకాష్ట అనే చెప్పాలి. ట్రంప్ తీరు చూస్తుంటే అమెరికా మీద పగ బట్టి అధ్యక్షుడై.. ఇప్పుడు సొంత దేశంపైనే పంతాలు, పట్టింపులతో వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. కొంతమందైతే గతంలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడినప్పుడు చేసిన కామెంట్లను గుర్తుచేసుకుంటున్నారు. తనను మోసం చేసి ఓడించారని, ఎలాగైనా అధ్యక్షుడై.. అందరికీ బుద్ధి చెబుతానని ట్రంప్ అప్పట్లో శపథం చేసినంత పని చేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏదో మారిపోయినట్టుగా నాటకమాడారు కానీ.. ఒరిజినల్ అలాగే ఉందని వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే నిరూపితమౌతూనే ఉంది.
రెండోసారి అధ్యక్షుడు కాగానే విద్యార్థి వీసాల్ని టార్గెట్ చేసిన ట్రంప్.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. ప్రముఖ వర్సిటీలపైనా కత్తి కట్టి.. వాటికి ఫెడరల్ నిధులు ఆపేస్తానని బెదిరించారు. ఏ వర్సిటీల కారణంగా అమెరికా పేరుప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తం అయ్యాయో అలాంటి వర్సిటీలనే కీలుబొమ్మల్ని చేసి ఆడించాలనుకుంటున్న ట్రంప్ తీరు.. విద్యావేత్తల్నే విస్తుపోయేలా చేస్తోంది. ట్రంప్ హయాంలో ఇక గతంలో మాదిరిగా అమెరికా విద్యాప్రమాణాలు ఉంటాయా.. లేదా అనే కొత్త సందేహాలు వచ్చేస్తున్నాయి. మొదట ఎఫ్‌వన్ వీసాలపై వచ్చిన విద్యార్థులపై కఠిన ఆంక్షలు పెట్టిన ట్రంప్.. ఆ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై పడ్డారు. ఓపీటీపై ఆంక్షల తర్వాత హెచ్‌వన్‌బీ వీసాల వార్షిక ఫీజు కొండంతగా పెంచేసి.. అమెరికా అంటేనే విదేశీ విద్యార్థులు ఠారెత్తిపోయేలా చేశారు. అప్పటికీ ట్రంప్ లో శాడిజం శాంతించలేదు. మరింతగా రెచ్చిపోయి విదేశీ విద్యార్థుల సంఖ్యను నియంత్రించాల్సిందేనని అమెరికా వర్సిటీలన్నింటికీ అల్టిమేటం ఇచ్చారు. దీనిపై కొన్ని వర్సిటీలు కోర్టులకెక్కినా అనుకున్న ఫలితం కనిపించలేదు. మొన్నటిదాకా స్వయంప్రతిపత్తితో ప్రత్యేక వ్యవస్థలుగా చలామణీ అయిన వర్సిటీలు.. ఇప్పుడు ఏ నిమిషం ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని బిక్కుబిక్కుమంటున్నాయి.
ఇక టారిఫ్‌ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేశానికో టారిఫ్ విధిస్తూ ట్రంప్ చెప్పిన లాజిక్ విని.. ప్రపంచం నివ్వెరపోయింది. మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే కాన్సెప్ట్‌తో ట్రంప్ టారిఫ్ విధానం పురుడు పోసుకుంది. దిగుమతులు, ఫార్మా, ఆఖరుకు సినిమాల్ని కూడా వదల్లేదు. అసలు ఇలాంటి సుంకాల్ని అమెరికా రాజ్యాంగం అనుమతించదని చెప్పినా.. ఆయన డోంట్ కేర్ అంటున్నారు. కిందపడ్డా తనదే పైచేయి అనే ట్రంప్ లాంటి మొండి మనిషిని ఎలా భరించాలో ఎవరికీ అర్థం కావడం లేదు. పక్కిల్లు తగలబెట్టి.. వినోదంలా చూసే నైజం ఉన్న ట్రంప్.. చివరకు సొంతింటికి కూడా మంట బెట్టుకుని శునకానందం పొందే స్థాయికి దిగజారారు.
పిచ్చి ముదిరింది. రోకలి తలకు చుట్టండి అన్నారు. ఇప్పుడు ట్రంప్ సరిగ్గా అదే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా తమకు నోబెల్ కావాలని డిమాండ్ చేసినవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకోసం పద్ధతిగా దరఖాస్తులు చేసుకున్నారు. కొందరు ప్రముఖులతో సిఫార్సులూ చేయించుకున్నారు. అంతేకానీ ఎవరూ ట్రంప్ మాదిరిగా నోబెల్ కమిటీనే బ్లాక్‌మెయిల్ చేసే దుస్సాహసానికి తెగబడలేదు. పైగా తనకు నోబెల్ ఇవ్వకపోతే తనకేం నష్టం లేదు.. అమెరికాకి అవమానం అని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు కృత్రిమ యుద్ధాల్ని ఆపేశానని, ఎనిమిదో యుద్ధం కూడా ఆపి చూపిస్తానని.. ట్రంప్ నోబెల్ కమిటీపై తొడ కొడుతున్నారు. ఈ యుద్ధాలన్నింటిలో అమెరికా ఏదో ఒక పక్షం కొమ్ముకాసింది. ఆయుధాలో, నిధులో ఇచ్చి ఎగదోసింది. తీరా ఘర్షణ ముదిరాక శాంతిదూత అవతారం ఎత్తి.. రెండో దేశాన్ని బెదిరించి యుద్ధం ఆపినట్టుగా పోజిచ్చింది. అసలు యుద్ధం మొదలుపెట్టడం ఎందుకు.. ఆపడం ఎందుకు అంటే ట్రంప్ గారికి నోబెల్ బహుమతి కోసం అంటోంది ఆయన కార్యవర్గం. ఇలా నోబెల్ బహుమతి కోసం ప్రపంచంలో ఆరని చిచ్చు రాజేసి.. మళ్లీ ఆర్పటం అంటే నిప్పుతో చెలగాటమే. అయినా సరే ట్రంప్ వెనక్కితగ్గటం లేదు. తానేం చేసినా విశ్వశాంతి కోసమే అని వీరభీకర కలరింగ్ ఇస్తున్నారు. అసలు ట్రంప్‌తో డీల్ ఎలాగో మిగతా దేశాలకే కాదు.. సొంత దేశానికీ ఏమీ పాలుపోవడం లేదు.
ప్రపంచంలో ఏ పనైనా సరే.. ట్రంప్ చేస్తేనే మంచి.. ఆయన కాదంటే చెడు. అంతే ఇది ట్రంప్ యుగం అంటున్నారు. మాట మాట్లాడితే తగిన బుద్ధి చెబుతాం అని బెదిరిస్తారు. మళ్లీ తనకు మించిన శాంతిదూత లేడంటారు. పైగా ఏం చేసైనా యుద్ధాలు ఆపటమే తక్షణ కర్తవ్యమని ఐక్యరాజ్యసమితికే కర్తవ్యబోధ చేస్తున్న ట్రంప్ గడుసుతనం.. ఆరున్నొక్క రాగం తీస్తోంది. ట్రంప్ బెడద ఎప్పుడు వదులుతుందా అని ప్రపంచం ఎదురుచూస్తుంటే.. త్వరలోనే ఆయన బలం తగ్గవచ్చని అమెరికన్లు కూడా ఆశాభావంతో ఉన్నారు.