నందమూరి తారక రామారావు… తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనం… రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయనో ప్రభంజనం. ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవం.. ఆయన తీరు రాజకీయ విశ్వరూపం… నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవ రూపం… నాయకుడిగా ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం. తెలుగు జాతి ఆత్మగౌరవం హస్తిన వీధుల్లో పరాభవానికి గురవుతున్న సమయంలో ఢిల్లీ అహంకారంపై తిరుగుబావుటా ఎగరేసి, తల ఎత్తి తెలుగోడి సత్తా చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్. రాజకీయ వారసత్వం లేదు… తాతలు, తండ్రుల చరిత్ర లేదు.. ఉన్నదల్లా ప్రజాభిమానం ఒక్కటే. రంగేసుకునే వాళ్లకు రాజకీయాలేంటని విమర్శించిన నోళ్లనే… ఔరా అనిపించేలా అడుగులేశారు.
ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా గుండెలకు హత్తుకుంటుంది.. ఏ డైలాగు చెప్పినా ఆలోచింపజేస్తుంది.. దేశం గర్వించదగిన నటులలో అగ్రస్థానంలో ఉంటారు.. ఆ పాత్ర ఈ పాత్ర అని లేదు. పౌరాణిక , జానపద, సాంఘీక చిత్రాలలోని వైవిధ్యమైన మరపురాని పాత్రలకు ఆయనే చిరునామా. రాముడైనా-రావణుసురుడైనా.. కృష్ణుడైనా-ధుర్యోధనుడైనా.. కర్ణుడైనా-అర్జునుడైనా ఇలా ఏ పౌరాణిక పాత్ర పోషించినా ఆయనదో ప్రత్యేకమైన శైలి. అందుకే తెలుగు వారి హృదయాలలో ఆరాధ్య దైవంగా నిలిచాడాయన. ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన గొప్ప నేత ఆయన.
1981లో ఊటీలోని ఓ అటవీ ప్రాంతం. సర్దార్ పాపారాయుడు షూటింగ్ విరామ సమయంలో మీడియా ప్రతినిధులతో ఎన్టీఆర్ సమావేశం నిర్వహించారు. త్వరలో 60వ ఏట అడుగుపెడుతున్నందున జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం ఉంటుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. సినీ నటుడిగా ఎంతగానో ఆదరించిన ప్రజలకు తర్వాతి పుట్టిన రోజు నుంచి నెలలో 15రోజులు వారి సేవ కోసమే కేటాయిస్తానని సమాధానం ఇచ్చారు. తన రాజకీయ ప్రయాణానికి ఎన్టీఆర్ ఇచ్చిన తొలి సంకేతం అదే.
1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ ఏర్పాటును ప్రకటించారు ఎన్టీఆర్. 300 మందితో నాలుగు గోడల మధ్య సమావేశం నిర్వహించి పార్టీ ప్రకటన చేయాలని ఎన్టీఆర్ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణ నిండిపోయింది. సమావేశాన్ని అప్పటికప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్‌లోకి మార్చాల్సి వచ్చింది. సభనుద్దేశించి ఎన్టీఆర్ అరగంటపాటు ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీపైనా, ప్రభుత్వంపైనా సునిశిత విమర్శలు చేశారు. రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. పార్టీ పేరేంటో చెప్పాలని కొందరు అడగటంతో, ఆయన చిరునవ్వు నవ్వి.. నేను తెలుగువాడిని. నాది తెలుగుదేశం పార్టీ… అంటూ పార్టీ పేరును ప్రకటించారు ఎన్టీఆర్.
శ్రామికుడి చెమటలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.. ఆశీర్వదించండి అంటూ పార్టీని ప్రకటించారు. పార్టీ విధానం సోషలిజమా, నక్సలిజమా లేక సెక్యులరిజమా అని అడిగితే, హ్యూమనిజమ్ అంటూ బదులిచ్చారు.
పార్టీని ప్రకటించి.. చైతన్య రథాన్ని సిద్దం చేసి.. ఓట్లేయండని జనంలోకి వచ్చారు. ఆయనకి జనం నీరాజనాలు పలికారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను చాటారు.
ఎన్టీఆర్ ప్రతి మాట ఓ తూటాగా పేలింది. ఇదే సందర్బంలో ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు ఎన్టీఆర్. కాంగ్రెస్ పార్టీ వల్ల.. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిందనీ, దానిని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల అప్పటికే విసుగు చెందిన ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు.
చైతన్య రథంపై ప్రచారం. ఇప్పుడు రోడ్ షోల పేరుతో నేటి తరం రాజకీయ నేతలు చేస్తున్న ప్రచారానికి ఆద్యుడు ఎన్టీఆరే. చైతన్య రథమెక్కి ప్రచారం చేస్తూ.. ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడే బహిరంగ సభ. చైతన్య రథంలోనే పడక. రోడ్డు పక్కనే స్నానపానాదులు. అలా ఒక కొత్త ఒరవడికి ఎన్టీఆర్ తెరతీశారు. ఆయన వస్తున్నారంటే ఊళ్లకు ఊళ్లే తరలి వచ్చేవి. ఆయన రావడం ఆలస్యమైతే, రోజుల తరబడి ఎదురు చూసేవారు. పేదవాడే నా దేవుడు… సమాజమే నా దేవాలయం అంటూ ఎన్టీయార్ చేసిన ప్రసంగాలు ప్రజల మననుల్లో బలంగా నాటుకు పోయాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో.. బాగా చదువుకున్న యువతకు, అప్పటిదాకా రాజకీయ అవకాశాలు అందని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి.. చట్టసభల్లో సామాన్యులు అడుగుపెట్టడానికి కారణమయ్యారు. అలా కొద్ది రోజుల్లోనే మహా ప్రభంజనంలా మారిన తెలుగుదేశం ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే 1983 ఎన్నికల్లో 199 స్థానాలతో ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రాష్ట్రంలో అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది.
అన్నగారు తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే… మద్రాసీలుగా ఉన్న ముద్రను చెరిపేస్తూ… తెలుగు జాతి స్వాభిమానానికి అంకురార్పణ చేశారు. అన్నగారి పాలన ఎలా ఉండబోతోందన్నది ఆయన ప్రమాణ స్వీకారం నాడే ప్రజలకు అర్థమైంది. అప్పటి వరకూ పనిచేసిన ముఖ్యమంత్రులంతా… రాజ్‌భవన్లోనే ప్రమాణ స్వీకారం చేసేవాళ్లు. కానీ ఎన్టీఆర్ మాత్రం… 1983 జనవరి 9న నాటి ఆంధ్రప్రదేశ్ పదవ ముఖ్యమంత్రిగా, తొలి కాంగ్రెసేతర సీఎంగా… తనను ఆదరించిన ప్రజల సమక్షంలోనే ప్రమాణస్వీకారం చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పాలనలో ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేసి, పారదర్శకత, నీతి నిజాయతీలకు మారు పేరుగా నిలిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లారు
అధికార పీఠం దక్కించుకోవడం కాదు… దాన్ని ప్రజలకు ఉపయోగ పడేలా సద్వినియోగం చెయ్యడం ఎలాగో అన్నగారిని చూసి నేతలంతా నేర్చుకోవాలి. అన్నగారు సీఎం అయ్యాక సంక్షేమ పథకాలకు కొత్త అర్థాన్నిచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు.
ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఒక సంచలనం. ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ఓ ప్రభంజనం. అన్నగారు ప్రవేశ పెట్టిన పథకాల్లో ముఖ్యమైనది… మొదటిది… ఇప్పటికీ నేతలకు ఆదర్శంగా ఉన్నది రెండ్రూపాయల కిలో బియ్యం పథకం. ప్రతి పేదోడి కడుపూ నింపాలన్న సదాశయంతో రెండ్రూపాయలకే కిలో బియ్యమిచ్చి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. పదవిలో ఉన్నంత కాలం ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు.
ఇక జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికీ కనీస అవసరమైన వస్త్రాలను అందించారు. ఇక అప్పట్లోనే బడుగు వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించి కొత్త సంచలనానికి తెర తీశారు. పేదల కనీస అవసరాలైన… రోటీ కపడా ఔర్ మకాన్‌లకు ఎక్కడా లోటు లేకుండా చూశారు అన్నగారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు… హైదరాబాద్‌లో గంజి కేంద్రాలు పెట్టాలంటూ వామపక్ష నేతలు యాత్ర చేపట్టారు. అన్నగారు గంజి కేంద్రాలేంటి బ్రదర్… ఏకంగా అన్నమే పెడదాం అంటూ అన్నం సాంబార్ పథకం ప్రవేశ పెట్టారు. పేదవాడికి మేలు జరుగుతుందంటే క్షణం కూడా ఆలస్యం చెయ్యని తత్వం అన్నగారిది.
స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు కల్పిస్తూ అన్నగారు తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్నే ఊపేసింది. సహకార సంఘాలను ప్రక్షాళన చేసి సింగిల్ విండో వ్యవస్థను తీర్చిదిద్దారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారి బీసీ వర్గాలకు, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. ఇంట్లో ఉండి చదువుకునే వెసులుబాటు కల్పించే దూర విద్య విశ్వవిద్యాలయం, మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం, పేద వర్గాల పిల్లలకు గురుకుల పాఠశాలల వంటివి నెలకొల్పారు. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధంతో మహిళల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన హయాంలో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. నీటిపారుదల రంగానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎన్టీయార్ కృషి ఫలితంగానే.. తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తయ్యి… చెన్నైతో పాటు రాయలసీమ ప్రజల దాహం తీరింది. రైతులకు మేలు జరుగుతుందంటే ఎంత పెద్ద నిర్ణయమైనా క్షణాల్లో తీసుకునే వారు. రైతులకు విద్యుత్ రాయితీలు ఇవ్వడం, మార్కెట్ యార్డ్‌లు నిర్మించడం వంటివి అన్నగారు తీసుకున్న నిర్ణయాలే.
ఏసీ రూములు, కాన్ఫరెన్స్ హాళ్లలో మీటింగులు వంటివి అన్నగారి హయాంలో ఎక్కడా వినిపించలేదు. ఆయన ఎక్కడుంటే అక్కడే సచివాలయం. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం ఎన్టీఆర్ సొంతం. ఓసారి నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా శ్రీరాం సాగర్ ప్రాజక్టు గురించిన ఫైల్‌ను ఇంజినీర్లు ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఫైల్ చూడగానే… ఈ ప్రాజెక్టుతో ఎంత మంది రైతులకు లబ్ది కలుగుతుందని అధికారుల్ని అడిగారు. వాళ్లు ఇన్ని వేల ఎకరాలకు నీరంది.. లక్షలాది మంది రైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పారట. అది విన్న అన్నగారు కనీసం ఖర్చెంత అవుతుందన్నది కూడా చూడకుండానే…వెంటనే శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసేశారు.
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు ఎన్టీఆర్. తెలుగులోనే అన్ని పాలనా వ్యవహారాలు సాగేలా నిర్ణయం తీసుకున్నారు. తెలుగు టైప్ మిషన్లను ప్రత్యేకంగా తయారు చేయించి సచివాలయం సహా… అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంస్థలకు, భవనాలకు తెలుగు పేర్లు పెట్టడం, దరఖాస్తులన్నీ తెలుగులోనే ఉండేలా చేయడం, హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు, ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాలు పెట్టడం వంటి నిర్ణయాలతో తెలుగు జాతికి, సంస్కృతికి పునరుజ్జీవనమిచ్చారు. అన్నగారు ఎక్కడికెళ్లినా అచ్చతెనుగు పంచె కట్టుతో.. భుజాన కండువా వేసుకుని తెలుగువాడికి నిలువెత్తు చిరునామాలా కనిపించేవారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అనేక బస్టాండ్లు అన్నగారి హయాంలో నిర్మించినవే. తెలంగాణ జిల్లాల్లో ప్రజలను నిలువునా దోచేస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి అక్కడి ప్రజలకు మరోసారి స్వాతంత్ర్యమిచ్చారు. తెలంగాణలో పెత్తందారీ వ్యవస్థ కుప్పకూలడానికి.. భూమి రికార్డులు ప్రజలకు అందుబాటులోకి రావడానికి దోహదపడింది. అప్పటివరకూ ఉన్న తాలుకా వ్యవస్థను రద్దు చేసి.. మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికలతో పాలనను మరింత సుగమం చేసేలా బాటలు వేశారు.
ఇక అవినీతి నిర్మూలనలో ఎన్టీఆర్ స్టైలే వేరేగా ఉండేది. సీఎం కాగానే ఉన్నతాధికారుల అవినీతిని నిర్మూలించడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేయించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా కార్యాలయంలోనే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సును 58 నుంచి 55ఏళ్లకు తగ్గించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు 2 నెలల పాటు సమ్మె చేశారు. ఉద్యోగుల మనోభావాలు వారి అభిప్రాయాలకు తగ్గట్టుగా నిర్ణయాన్ని ఎన్టీఆర్ వెనక్కి తీసుకున్నారు. ఇలా కొన్ని నిర్ణయాల కారణంగా సీఎం పదవి చేపట్టిన ప్రారంభంలోనే అధికారులు, ఉద్యోగుల మద్దతు కోల్పోయారు ఎన్టీఆర్. ఇక శాసన మండలి రద్దు ఓ చరిత్ర. పరిపాలనా నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడుతోందని భావించిన ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేయటానికి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకించినా ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు.
ఇక 1984 ఆగష్టు 16న నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తెలుగునాట మరో చరిత్ర. రామారావును అధికారం నుంచి తొలగించి, తాను దొడ్డిదారిన నాదెండ్ల భాస్కరరావు గద్దెనెక్కారంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళారు. ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావు తిరిగి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. అయితే తాను మళ్లీ ప్రజా తీర్పు కోరతానంటూ మార్చి 1985లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు ఎన్టీఆర్. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు.
నటుడిగా ఉన్నప్పుడే వరద బాధితుల కోసం జోలె పట్టుకుని ఊరూరా తిరిగిన అన్నగారు. అధికారంలోకి వచ్చాక తెలుగు వాడి శ్రేయస్సే ధ్యేయంగా పాలన సాగించారు. అడ్మినిస్ట్రేషన్లో అంతర్లీనంగా అన్నగారు పాటించే సూత్రం ప్రజోపయోగం ఒక్కటే. ఎంత ప్రజారంజకంగా పాలించారో… అదే స్థాయిలో రాజకీయాలూ నడిపారు. తెలుగోడి సత్తాను దేశమంతా తెలిసేలా చేశారు. రాజకీయంగా తనపై జరిగిన కుట్రలను ప్రజా బలంతోనే తిప్పికొట్టారు.
రాజకీయాల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, నిష్పాక్షికత ఆయన్ను చూసే నేర్చుకోవాలి. ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి… నేటి నాయకులు మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలా అని పనిచేస్తారు. కానీ ఆయన గెలిచినప్పటి నుంచి ప్రజలకోసమే పనిచేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవం విషయంలో రవ్వంత కూడా రాజీపడని నాయకుడు ఎన్టీఆర్. తన పదవి పోతుందన్న పరిస్థితులు వచ్చినా… ఏనాడూ తలవంచింది లేదు.
1983లో ఇందిర దారుణ హత్యకు గురయ్యాక మరుసటి ఏడాది కేంద్రంలో లోక్‌సభ రద్దయింది. ఆనాడు పంజాబ్ మినహా… 514 స్థానాల్లో జరిగిన ఎనిమిదో లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ 404 సీట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ 30 స్థానాలు దక్కించుకుని, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. దేశ లోక్‌సభ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా గెలవడం అదే తొలిసారి. అలా తెలుగోడి సత్తా ఏంటో ఐదేళ్ల పాటు ఢిల్లీకి కాంగ్రెస్‌కు రుచి చూపించారు ఎన్టీఆర్.
రాజకీయ కుట్రలను జనబలంతో తిప్పికొట్టిన ఎన్టీఆర్ పేరు కేంద్ర రాజకీయాల్లో మారుమోగింది. వారసత్వ రాజకీయాలకు నిలయమైన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. దేశంలో ప్రతిపక్షాలను, వామపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా అడుగులేసి, జాతీయ శక్తిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా కాంగ్రేసేతర పార్టీల ముఖ్యనేతలని ఏకతాటిపైకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. తమిళనాడులో వైరిపక్షాలైన కలిగిన ఎంజీ రామచంద్రన్, కరుణానిధిని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేశారు. దేశ రాజకీయాల్లో స్టార్ వార్స్‌గా పేరొందిన చంద్రశేఖర్, అటల్ బీహారీ వాజ్ పేయి, రామకృష్ణ హెగ్డే, ఎస్.ఆర్.బొమ్మై చండ్ర రాజేశ్వరరావు, నంబూద్రి పాద్, జ్యోతి బసు, భీం సింగ్, బిజూ పట్నాయక్ వంటి నాయకులను ఒక్కతాటి మీదకు తెచ్చారు. ఒకే వేదిక మీదకు రప్పించగలిగారు. దేశ రాజకీయాల్లో తెలుగు వాడు చక్రం తిప్పగలడన్న సత్తాను ఎన్టీఆర్ ఈ వేదిక ద్వారా చాటారు. విజయవాడలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించారు. కృష్ణా నదీ తీరంలో జనం మధ్యన ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహించారు.
ఇక 1985-89 మధ్య కాలంలో ఎన్టీఆర్ పరిపాలన పరంగా కొంత అప్రదిష్టను మూట గట్టుకున్నారనే చెప్పాలి. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించారు. ఎవ్వరి మాట వినని నియంత అనే విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. మంత్రులందర్నీ ఒక్క కలం పోటుతో బర్తరఫ్ చేయడాన్ని అప్రజాస్వామిక చర్యగా నాడు ప్రజలు భావించారు. ఇది ప్రజల్లో నిరసన భావం కలగడానికి ప్రధాన కారణమైంది. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. అదే ఎన్నికల్లో హిందూపురం, కల్వకుర్తి నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ కల్వకుర్తిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడినా.. భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1994 ఎన్నికల్లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు.
ఎన్టీఆర్ లాంటి అరుదైన నాయకుడు ఏ కాలంలో అయినా అరుదనే చెప్పాలి. ఈ రోజుల్లో నాయకులంతా ఓటు బ్యాంకు రాజకీయాలతో, అధికారం కోసం అడుగులేసే వాళ్లే తప్ప… జనం కోసం, జన క్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసిన వాళ్లు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఆత్మ గౌరవం విషయంలో రాజీ లేదు. దేన్నైనా శాసించి తీసుకోవడమే తప్ప.. బతిమాలడం అనే మాట ఆయన డిక్షనరీలో లేదు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వేదికగా నిలబెట్టిన శక్తి ఎన్టీఆర్.
ప్రజల మధ్యే పుట్టి, ప్రజలతోనే జీవించి, ప్రజల కోసమే జీవించి, ఆఖరికి ప్రజల మధ్యే కన్నుమూసిన మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగువాడు అన్న మాటకు కేరాఫ్ అడ్రస్ ఎన్టీఆర్. అందుకే తెలుగు అన్న మూడక్షరాలున్నంత కాలం.. ఎన్టీఆర్ అన్న పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది.