StoryBoard: తెలంగాణలో కొన్ని నెలలుగా స్థానిక ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీకాలం ఫిబ్రవరిలోనే ముగిసింది. మొదట అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అనే చర్చ జరిగింది. కానీ నిర్ణీత గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో.. ప్రక్రియ ఆలస్యం కావచ్చనే అంచనాలు వచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపినా.. అది రాష్ట్రపతికి వెళ్లి అక్కడ పెండింగ్ లో ఉంది. సీఎం మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకపోవడంతో.. ఇక ఆర్డినెన్స్ మార్గంలో రిజర్వేషన్లు ఇవ్వాలని సర్కారు డిసైడైంది. చివరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. హైకోర్టు ఇచ్చిన గడువు లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం విర్ణయం తీసుకుంది. ఒక్కసారి సర్కారు ఫిక్సయ్యాక.. చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. నిజానికి అంతకుముందే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల కోసం ప్రాథమిక కసరత్తును పూర్తిచేసింది. దీంతో పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేకుండానే.. రోజుల వ్యవధిలోనే షెడ్యూల్ విడుదలైంది. మొదట్లో స్థానిక ఎన్నికలు పెట్టడానికి సర్కారు భయపడుతుందని విపక్షాలు చేసిన ప్రచారాన్ని కూడా సర్కారు దీటుగా తిప్పికొట్టినట్టైంది. స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. అలాగే తన వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కకుండా గుంభనంగా ఉంటూ వచ్చింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ప్రకటించారు. మెుత్తం ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. మెుదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఆరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం షురూ అవుతుంది.
రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మూడు దశల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు నవంబర్ 11న వెల్లడించనుండగా… సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు పోలింగ్ జరిగిన రోజే ప్రకటించనున్నారు. మెుత్తంగా నవంబర్ 11తో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. షెడ్యూల్ విడుదలతోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 23 తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. స్థానిక ఎన్నికల ప్రక్రియ కోసం రూ. 350 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. అలాగే 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు కూడా ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే, 565 మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు), 31 జిల్లాల జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాలకు మాత్రం పరోక్షంగా ఎన్నిక జరగనుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం 11 గుర్తింపు పొందిన పార్టీలు, 31 నమోదు చేసుకున్న పార్టీలు తమ గుర్తులపై పోటీకి దిగనున్నాయి. దశలవారీగా పోలింగ్ వివరాలు చూసినట్లయితే.. మొదటి దశలో 41 మండలాల్లోని 1,098 గ్రామాలు, 9,324 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 272 మండలాల్లోని 5,910 గ్రామాలు, 52,190 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో 252 మండలాల్లోని 5,752 గ్రామాలు, 51,020 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో 290 జడ్పీటీసీలు, 2,977 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో దశలో 275 జడ్పీటీసీలు, 2,786 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,03,168గా ఎన్నికల సంఘం గుర్తించింది. వీరిలో 85,36,770 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 651 మంది ఆర్వోలు, 2,337 మంది ఏఆర్‌వోలు సహా 1,98,258 మంది సిబ్బందిని వినియోగిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు దశలకు కలిపి దాదాపు 2 లక్షల 7 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. బ్యాలెట్ బాక్స్‌ల విషయానికి వస్తే, 1,72,916 బాక్స్‌లు అవసరం అవుతాయని అంచనా.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ సర్కారు ఇప్పటికే గెజిట్‌ను జారీచేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ పేరుతో ఈ గెజిట్ జారీ అయ్యింది. ఈ గెజిట్ ప్రకారం… ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 13, అన్ రిజర్వ్‌డ్‌కు 8 జెడ్పీ చైర్‌పర్సన్ పదవులను రిజర్వ్ చేశారు. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం పదవులు రిజర్వ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. అందుకు అనుగుణంగానే జెడ్పీ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు ఆ మొత్తంలోనే స్థానాలను కేటాయించింది ప్రభుత్వం. జెడ్పీ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను పరిశీలిస్తే బీసీలకు 41.93 శాతం, ఎస్సీలకు 19.35 శాతం, ఎస్టీలకు 12.90 శాతం, అన్‌రిజర్వుడ్‌కు 25.80 శాతం దక్కినట్టుగా కనిపిస్తోంది. జిల్లాల వారీగా రిజర్వేషన్ల వివరాలు చూస్తే.. ఖమ్మం జెడ్పీని – ఎస్టీ సామాజికవర్గానికి కేటాయించారు. ములుగు జెడ్పీ ఎస్టీ – మహిళ కోటాలోకి వెళ్లింది. నల్గొండ జెడ్పీ కూడా ఎస్టీ – మహిళ కోటానే. ఇక వరంగల్ జెడ్పీ విషయానికొస్తే.. ఎస్టీకి రిజర్వ్ అయింది. హన్మకొండ, జనగామ జెడ్పీలను ఎస్సీ మహిళ కోటాలో వేశారు. జోగులాంబ గద్వాల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జెడ్పీలు ఎస్సీ మహిళా కోటాలోకి వెళ్లాయి. సంగారెడ్డి ఎస్సీ కోటాకు వెళ్లింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమురంభీం అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్ధిపేట,సూర్యాపేట, వికారాబాద్ జెడ్పీలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జెడ్పీలు బీసీ మహిళ కోటాలోకి వెళ్లాయి. ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట జెడ్పీలు ఓసీ మహిళ కోటాలోకి వెళ్లాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్ జెడ్పీలు ఓసీ జనరల్ కు రిజర్వ్ అయ్యాయి.