Storyboard: తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్.. ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉంది. మొదటిసారి కంటే రెండోసారి మరిన్ని సీట్లు ఇవ్వడం ద్వారా.. తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ కు మద్దతు పలికారు. కానీ ప్రజల మద్దతును పాలనలో సద్వినియోగం చేయలేకపోయిన బీఆర్ఎస్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీ పరంగా ఓటమి, అధికారం కోల్పోవడం ఓ ఎత్తైతే.. సీఎంగా కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం మరో ఎత్తు. తెలంగాణలో తిరుగులేని నేతగా వెలిగిన కేసీఆర్.. ఓ అనామకుడి చేతిలో సీఎంగా ఓడిపోవటం కారు పార్టీకి పెద్ద షాకిచ్చింది.
ఏ ముహూర్తాన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిందో కానీ.. అప్పట్నుంచీ బీఆర్ఎస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి పూర్తిగా కోలుకోకముందే.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడం .. బీఆర్ఎస్ కు అస్సలు జీర్ణం కాలేదు. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరగడం, అందులో కవిత ప్రధాన పాత్ర పోషించడం.. బీఆర్ఎస్ కు ప్రజల ముందు ముఖం చూపించుకోలేని దుస్థితి వచ్చింది. ఈ స్థితిలోనే పార్లమెంట్ ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికి కవిత ఇంకా జైల్లోనే ఉండటంతో.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్ సభలో జీరో అయిపోయింది. ఉద్యమ సమయంలో కూడా లోక్ సభలో ఎంపీలున్న బీఆర్ఎస్ ను.. ఈ దారుణ పరాభవం మరింత కుంగదీసింది. అదే సమయంలో బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు జంపయ్యారు. ఇక ఎమ్మెల్యేలకే పార్టీపై నమ్మకం లేనప్పుడు.. క్యాడర్ గా మన సంగతేంటని కార్యకర్తలు కూడా డైలమాలో పడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రచారానికి వచ్చినా.. ఆయన ఒకటి, రెండు సభలకే పరిమితమయ్యారు. ఇది కూడా క్యాడర్ కు తప్పుడు సంకేతాలు పంపింది. పైగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ల పంపిణీ పెద్ద ప్రహసనంగా మారింది. పార్టీ టికెట్లిచ్చిన వారు కూడా వేరే పార్టీల్లో చేరి అక్కడ్నుంచి ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడం బీఆర్ఎస్ నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇది చాలదన్నట్టుగా స్వయంగా కేసీఆర్ ను కలిసి పార్టీని వీడిపోయేది లేదని చెప్పినవారు కూడా గంటల వ్యవధిలో ఇతర పార్టీల్లో చేరటం.. గులాబీ అధినేత క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసింది. ఇంతకంటే పెద్ద అవమానం తనకు మరోటి ఉండదని కేసీఆర్ కూడా ఫీలైన సందర్భమిది. ఇన్నాళ్లుగా తెలంగాణలో తాను చెప్పిందే రాజకీయంగా నడిపిన కేసీఆర్.. ఇప్పుడు తన మాటను నేతలు నమ్మకపోవడాన్ని తట్టుకోలేకపోయారు. దీంతో ఆయన అసెంబ్లీకి కూడా పోకుండా ఫామ్ హౌస్ కే పరిమితమౌతున్నారు. అడపాదడపా కొద్దిమంది నేతలతో సమావేశాలే తప్ప.. పార్టీ క్యాడర్ కు కేసీఆర్ పూర్తిగా దూరమయ్యారు.
నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ మొదట్లో కాంగ్రెస్ పై తొడగొట్టింది. తన ఓటమిని పక్కనపెట్టి.. కాంగ్రెస్ సర్కారు ఐదేళ్లూ ఉండేది కాదంటూ గులాబీ జోస్యాలు చెప్పింది. కాంగ్రెస్ సర్కారును పడగొడతామని పోటీపడి కామెంట్లు చేసిన బీఆర్ఎస్ నేతలు.. చివరకు తమ పార్టీ నుంచి జారిపోతున్న ఎమ్మెల్యేల్ని కాపాడుకోలేక ఆపసోపాలు పడ్డారు. సరే వెళ్లినవారు ఎటూ వెళ్లారు. కనీసం ఉన్నవారైనా నమ్మకమేనా అనే నిత్య సందేహాలు గులాబీ పార్టీని వేధిస్తున్నాయి. చివరకు పార్టీలో కింది నుంచి పైదాకా పూర్తిస్థాయిలో అపనమ్మకం వచ్చేసింది. క్యాడర్ నేతల్ని, నేతలు అధినేతని, అధినేత నేతల్ని పరస్పరం నమ్మడం మానేశారు. ఇది మరింత గందరగోళానికి దారితీసింది. చివరకు నేతల ప్రెస్ మీట్లనూ అనుమానించాల్సిన దుస్థితి వచ్చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎదురుదాడి మంత్రంగా.. ప్రత్యర్థుల్ని ఆటాడుకున్న బీఆర్ఎస్ కు.. ఇప్పుడు ప్రత్యర్థులే తనను ఆడుకోవడం జీర్ణం కావడం లేదు. బీఆర్ఎస్ పుట్టిన నాటి నుంచి ఎలాంటి రాజకీయ వ్యూహాలతో ఆ పార్టీ బలపడిందో.. పార్టీ ఓటమి తర్వాత అవే వ్యూహాలను ప్రత్యర్థుల నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మొదటిగా కేసీఆర్ ఇగో దారుణంగా దెబ్బతింది. తనకు ఏ మాత్రం ఇష్టం లేని రేవంత్ రెడ్డి సీఎం కావడం.. ఆయనకు మరో పెద్ద షాక్.
ఇలా బయటి నుంచి వచ్చే సమస్యలకు తోడు.. అంతర్గత సమస్యలు బీఆర్ఎస్ ను షేక్ చేశాయి. దీంతో ప్రతిపక్షంగా తానేం చేయాలన్న కనీస ఆలోచన కూడా ఆ పార్టీ చేయలేదు. కేవలం ప్రెస్ మీట్లతోనే సరిపెట్టింది. అంతే కానీ తనకు అసలు బలమైన క్షేత్రస్థాయి పోరాటాలు చేసే ధైర్యం చేయలేకపోయింది. అసలు ఆందోళనకు పిలుపునిచ్చినా క్యాడర్ స్పందించదేమో అనే అనుమానం పెనుభూతమై.. బీఆర్ఎస్ ను పీడించింది. పిలుపునిచ్చి పరువు పోగొట్టుకోవడం కంటే.. సైలంట్ గా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చేసింది. స్వయంగా అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావడంతో.. ద్వితీయ శ్రేణి నేతలు కూడా చాలా మంది గడప దాటడం లేదు. ఇవన్నీ పక్కనపెడితే.. మాయలఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ ప్రాణం అధికారంలో ఉందా అనే కొత్త సందేహాలు ప్రజలకు వచ్చేలా ఆ పార్టీ ప్రవర్తిస్తోంది. ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు నోరెత్తకుండా రాజకీయం చేసిన బీఆర్ఎస్ నేతలు.. ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రం ఘోరంగా తడబడ్డారు. ఏ అంశంపైనా ప్రత్యర్థులకు దీటుగా కౌంటర్ ఇవ్వకపోగా.. అనుకోకుండా పొరపాట్లు చేసి.. సొంత పార్టీనే మరింత ఇబ్బందుల్లో పడేశారు. దీంతో అసలు కొన్నాళ్లు ప్రెస్ మీట్లు కూడా వద్దని పార్టీ చెప్పాల్సి వచ్చింది. తెలంగాణ జాతిపితగా సొంత పార్టీ నేతల ప్రశంసలందుకున్న కేసీఆర్ కు.. ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం జీర్ణం కావడం లేదు. ఎలాంటి పార్టీ ఎలా అయిపోయిందా అని ఆయన ఫామ్ హౌస్ లో తీరిగ్గా బాధపడుతున్నారని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. అయినా సరే కేసీఆర్ మాత్రం పబ్లిక్ లోకి రావటానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రతిపక్షంలో ఉన్నా.. అసెంబ్లీలో కాంగ్రెస్ ను కేసీఆర్ చెడుగుడు ఆడతారని ఆశపడ్డ బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది.
పదేళ్లు అధికారంలో ఉన్నాం కదా. ఒక్కసారి అధికారం పోయినా పోయేదేముందిలే అనేది మొదట్లో కేసీఆర్ తన పార్టీ నేతలతో అంతర్గత చర్చల్లో చెప్పిన మాట. కానీ అధికారం లేకుండా బీఆర్ఎస్ మనుగడ అంత తేలిక కాదని ఆయనకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే బలాలనుకున్నారో..అవే ఇప్పుడు బలహీనతలుగా మారాయి. తెలంగాణ రాజకీయాల గురించి అసలు ఆలోచించక్కర్లేదు. దేశ రాజకీయాల్నీ దున్నేస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన బీఆర్ఎస్.. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. మూలాల కోసం వెతుక్కుంటోంది. కానీ ఆ మూలాలు దాటి తాము చాలా దూరం వచ్చేశామని, అసలు పార్టీ ప్రాథమిక సూత్రాల్ని కూడా వదిలేశామనే సంగతి అర్థమైనా.. వాస్తవాలు ఒప్పుకోవటానికి బీఆర్ఎస్ ఇప్పటికీ ముందుకు రాకపోవడమే.. ఆ పార్టీ పెను విపత్తుకు అసలు కారణం అని చెప్పకతప్పదు. ఓటమి తర్వాత ప్రజల ముందు కొచ్చి జరిగిన పొరపాట్లు దిద్దుకుంటామని గులాబీ నేతలెవరూ చెప్పలేకపోయారు. దీంతో వీరికి చింత చచ్చినా పులుపు చావలేదని ప్రజలు అనుకోవటానికి ఆస్కారం ఏర్పడింది. ఈ ప్రజాభిప్రాయమే బీఆర్ఎస్ ను రాజకీయంగా ఒంటరిని చేసిందని చెప్పొచ్చు.