Air India : వరుస సాంకేతిక సమస్యలతో.. విమానాలు ఆగిపోతున్నాయి. ప్రయాణాలు క్యాన్సిల్ అవుతున్నాయి. కొన్ని ఆలస్యమవుతున్నాయి.. మరికొన్ని పూర్తిగా రద్దవుతున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత.. పౌరవిమానయానం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వరుసగా ప్లేన్స్ ఎందుకు రద్దవుతున్నాయి ? డొక్కు విమానాలే కొంపముంచుతున్నాయా ? పూర్ మెయిన్‌టెయినెన్స్ కారణమా ? ఎమిరేట్స్ స్థాయికి ఎప్పుడు చేరుకుంటాం ? విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. వరుసగా బయటపడుతున్న వైఫల్యాలు.. ప్యాసెంజర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విమానం ఎక్కి.. దిగేంతవరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. హ్యాపీ జర్నీ అనే బదులు.. ఇక నుంచి హ్యాపీ ల్యాండింగ్ అని అనాలేమో.
అహ్మదాబాద్ ప్రమాదం.. మన దేశ చరిత్రలోనే అతి తీవ్రమైనది. ఒక్క ప్రయాణికుడు మినహా.. మిగిలినవారు, సిబ్బంది అంతా చనిపోయారు. ఏ పాపం ఎరుగని.. మెడికల్ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 12న మధ్యాహ్నాం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మందితో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. ఆ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా చనిపోయారు. ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది…
అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత కూడా మన విమానాల పరిస్థితిలో మార్పు లేదు. ఎక్కడో ఒక చోట, ప్రతిరోజు విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడుతూనే ఉన్నాయి. చాలా ఎయిర్‌ఇండియా విమానాల్లో సమస్యలు బయటపడుతున్నాయి. దీంతో ఎయిరిండియా సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే వారిపై చర్యలకు డీజీసీఏ తీసుకుంది. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎయిర్‌లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. నిబంధనలు పాటించకుండానే షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ లాంటి అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరించింది.
అహ్మదాబాద్ ఘటన ప్రభావం ఎయిరిండియా బుకింగ్స్‌పై పడింది. దేశీయ, అంతర్జాతీయ బుకింగ్స్ 20 శాతం మేర తగ్గాయి. టికెట్ ధరలు సైతం 8-15 శాతం మేర తగ్గినట్టు తెలుస్తోంది. టూర్ ఆపరేటర్ల ద్వారా ఎయిరిండియా విమానాలకు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు కూడా వాటిని రద్దు చేసుకుంటున్నారు. ఎయిరిండియాను ప్రభుత్వాలే నాశనం చేస్తూ వచ్చాయి. కనీసం ప్రభుత్వం చేతుల్లోంచి టాటా చేతుల్లోకి వెళ్లినప్పుడు అది బాగుపడుతుందని అందరూ ఆశించారు. కానీ బాగుపడని స్థితికి ఎప్పుడో చేరిపోయింది. ఇక దాన్ని సెట్ చేయడం అసాధ్యం అని తేలిపోయింది. వరస విమాన ప్రమాదాలు, కాలం చెల్లిన విమానాలు, క్వాలిటీ లేని స్టాఫ్ ఇవన్నీ కలిసి ఎయిరిండియాని ఈ దుస్థితికి చేర్చాయి. చివరకు ఎయిరిండియాలో ఏడెనిమిది రకాల ఫ్లైట్లు.. ఎందుకూ పనికిరానివిగా తేల్చి ఇప్పుడు పక్కన పెట్టాల్సి వచ్చింది. అంతేకాదు.. ఇంటర్నేషనల్ విమానాలు నడిపే సామర్ధ్యం ఆ సంస్థకు లేదని ప్రతిసారీ రుజువౌతూనే ఉంది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ మరోసారి ఆ విషయాన్ని బయటపెట్టింది.
ఇండియాలో విమాన సంస్థలు.. ప్రయాణికుల్ని, సర్వీసుల్ని పెంచుకోవాలి అనే రేసింగ్‌లో పడి క్వాలిటీ లేని సర్వీసుల్ని భద్రత లేని ప్రయాణాల్ని ఇస్తున్నాయి. ఆ విషయంలో ఇండిగో వ్యవహరించే తీరు చాలా దుర్మార్గంగా ఉంటుంది. ఒక ఫ్లైట్ సర్వీస్‌కి మరో ఫ్లైట్ సర్వీస్‌కి మధ్య అరగంట కూడా గ్యాప్ ఉండదు. ఒక ఫ్లైట్ దిగగానే సిటీ బస్సులానే ఫ్రంట్ డోర్‌లోంచి జనం దిగుతుంటే బ్యాక్ డోర్‌లోంచి జనాన్ని ఎక్కిస్తుంటారు. అలా సమయాన్ని ఆదా చేసి రోజుకో నాలుగు సర్వీసులు పెంచుకున్నా చాలనుకుంటున్నారు. విమానం ఎక్కేవాడు వెయ్యి రూపాయలు అటూ ఇటూ అయినా ఇబ్బంది పడడు. కానీ తక్కువ ధరకు ఎక్కువ జనాన్ని ఎక్కించాలి అనే లక్ష్యంతో సాంకేతికంగా బలహీనమైన విమానాల్ని, సెకెండ్ హ్యాండ్ విమానాల్ని కాలం చెల్లిన విమానాల్ని నడుపుతున్నాయి ఇండియాలో ఏరో సంస్థలు. ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఇదే. అసలు పదేళ్ల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్‌కు కాలం చెల్లిపోతుంది. మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్‌లన్నీ 15 ఏళ్లు దాటినవే..! అయినా వాటికి మరమ్మత్తులు చేసి ఎద్దుల బండి తిప్పినట్టు తిప్పుతారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. క్వాలిటీ సర్వీసులు పెంచాల్సిన అవసరం ఉంది.
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం.. మన దేశ విమానయాన వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యాలు, లోపాలను బయటపెట్టింది. అత్యవసర పరి స్థితుల్లో స్పందించాల్సిన విధానాల్లో ఆలస్యం, సాంకేతిక లోపాల గుర్తింపులో అశ్రద్ధ, ఇవన్నీ ఈ ఘటనను మరింత సంక్లిష్టంగా మార్చాయి. విమానాల నిర్వహణలో పారదర్శకత కొరవడటం, ప్రయాణికుల భద్రతకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, పైలట్ల శిక్షణా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం వంటి అంశాలు తిరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సంస్థల మధ్య సమన్వయ లోపం, విమాన రవాణా రంగంలో ఎక్కువ మందిని కలిపి తీసుకువెళ్లే సామర్థ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య. ఇంతకుముందు మంగళూరు, కొజికోడ్ ప్రమాదాల దర్యాప్తుల్లో కొన్ని కీలక అంశాలపై నివేదికలు వచ్చినా, అవి అమలైనట్లు గానీ, వాటి ఆధారంగా లోపాలను సరి దిద్దుకున్నట్లుగాని కనిపించలేదు.
భారతదేశం ప్రస్తుతం గగనతల రవాణాలో కూడా గణనీయంగా దూసుకుపోతోంది. రోజూ వేలాది ప్రయాణికులు విమానాలను నమ్ముకొని తమ ప్రాణాలను విమానయాన సంస్థలకు అప్పగిస్తున్నారు.. కనుక వారి భద్రత పట్ల ప్రభుత్వాలకు, సంస్థలకు రాజీలేని బాధ్యత ఉండాలి. ప్రయాణికుల సంఖ్య పెరగడం మంచిదే. కానీ, వారి రక్షణ, ఆ వేగానికి అనుగుణంగా ATC వ్యవస్థలు, విమానాశ్రయ వేదికలు, పైలట్ల శిక్షణ ప్రమాణాలు అభివృద్ధి చెందకపోతే, ఈ విమాన ప్రయాణాలే.. యమపాశాలు అవుతాయి. అదే ఇప్పుడు జరిగింది. ఇప్పుడైనా సమస్యల్ని పరిష్కరించుకోకపోతే.. మరిన్ని ప్రమాదాలు తప్పవు.
ఎయిరిండియా ప్రస్థానమే సవాళ్ల మధ్య మొదలైంది. 1932లో టాటా ఎయిర్ లైన్స్ స్థాపించగా.. స్వాతంత్య్రం వచ్చాక 1953లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ సంస్థను జాతీయీకరించారు. సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకూ అందించే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎట్టకేలకు ఎయిరిండియాను తిరిగి సొంతం చేసుకుంది. ప్రభుత్వ సంస్థగా 69 సంవత్సరాలు కొనసాగిన ఎయిరిండియా సొంత గూటికి ఎగిరిపోయింది. దీంతో కోట్లకొద్దీ పన్నుచెల్లింపుదారుల సొమ్ముతో ఏళ్లుగా మూతపడకుండా నడుస్తున్న ఎయిరిండియా ప్రైవేటీకరణకు శుభం కార్డు పడింది…
1960వ దశకంలోనే ఆసియా నుంచి బోయింగ్ లాంటి విమానం నడిపిన తొలి ఎయిర్ లైన్స్ గా ఎయిరిండియా ఘనత సాధించింది. ఎయిరిండియా లోగో మహారాజా బాగా పాపులరైంది. అంతా బాగున్న రోజుల్లో.. ఎయిర్ ఇండియా దేశానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. స్వీడన్ రాజు, రాణే కాదు.. పోప్ పాల్ -6 కూడా ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించి ఇండియాకు వచ్చారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్పొరేషన్ ఏర్పాటైన మూడేళ్లలోనే 3 కోట్ల కిలోమీటర్ల ప్రయాణదూరాన్ని, ఐదున్నర లక్షల మంది ప్రయాణికుల సంఖ్యను అధిగమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఒకటిగా ఎయిరిండియా నిలిచింది.
అయితే ఎయిరిండియా ప్రభ క్రమంగా మసకబారింది. పౌర విమానయాన శాఖ ఎంపిక చేసిన అధికారుల అజమాయిషీలో.. సంస్థ నష్టాల బాట పట్టింది. 1980ల నుంచి ఎయిర్ ఇండియా ఛైర్మన్, ఎండీని కూడా పౌర విమానయాన శాఖే ఎంపిక చేసేది. ఎయిర్ లైన్స్ కు సంబంధం లేని అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం కూడా కొంప ముంచింది. అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల సంఖ్య పెరగడం కూడా నష్టాలకు ఓ కారణంగా చెబుతారు. ఎయిరిండియాలో ఇండియన్ ఎయిర్ లైన్స్ విలీనం సంస్థ కష్టాలను మరింత పెంచింది. ఆ తర్వాత టాటాల చేతికి రావడంతో.. ఈ సంస్థ తలరాత బాగుపడుతుందని అంతా భావించారు. టాటా సంస్థ కూడా దీని కోసం అనేక ప్రయత్నాలు చేసింది.
పాత విమానాలను అప్‌గ్రేడ్ చేయడమే కాక, కొత్త విమానాలకు ఆర్డర్ పెట్టి.. ఎయిర్ ఇండియాను గాడిలో పెట్టాలని ప్రయత్నించింది. 2022 జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా గ్రూప్ తిరిగి తన చేతుల్లోకి తీసుకుంది. అయితే అప్పటి నుంచి అనేక సమస్యలు ఎయిర్ ఇండియాను వెంటాడుతున్నాయి. ఎయిరిండియా విమాన సర్వీసులు తరచూ ఆలస్యం అవుతున్నాయనే ఫిర్యాదులు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. 2024లో సగటున 46 నిమిషాల ఆలస్యంతో బ్రిటన్‌లో సమయపాలన అంశంలో అధ్వాన విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలిచింది. ఎయిరిండియా పాత విమానాల్లో లోపలి భాగాల అప్‌గ్రేడ్ కోసం 400 మిలియన్ డాలర్లను గ్రూప్ కేటాయించింది. అయితే అవసరమైన పరికరాల సరఫరా ఆలస్యం అవుతోంది. ఇప్పుడు వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటికి వస్తుండటం.. ఎయిర్ ఇండియాకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది…
ఎయిరిండియా దగ్గర బోయింగ్ 787-8 విమానాలు 26, బోయింగ్ 787-9 విమానాలు ఏడు ఉన్నాయి. జెన్‌ఎక్స్ ఇంజిన్లతో కూడిన బోయింగ్ 787-8, 787-9 విమానాలకు సంబంధించి.. అదనపు నిర్వహణకు చర్యలు చేపట్టాలని కూడా ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది. విమానంలో ఏసీ, టీవీ స్క్రీన్‌లు, విమాన సిబ్బందితో మాట్లాడే పరికరం బటన్స్, సీటుపైన ఉండే లైట్లు ఏవీ పనిచేయలేదని.. ఒక ప్రయాణికుడు పోస్ట్ చేశాడు. మెయింటెనెన్స్‌లో ఎయిర్ ఇండియా చూపిన నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఏ మాత్రం శ్రద్ధ వహించినా వందలాది మంది ప్రాణాలు నిలిచేవని కొందరి విశ్లేషణ.
ఎయిరిండియాకు నిర్వహణ సమస్యలు ఒక ఎత్తయితే.. బోయింగ్‌ల వల్ల కలుగుతున్న అనర్థాలు మరో ఎత్తు. బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికుల ప్రమాదకరమని సలోహ్‌పోర్ అనే విజిల్‌బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారు. 2009లో 787-8 డ్రీమ్‌లైనర్ ప్రపంచంలో వాడుకలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన తొలి ప్రమాదం కూడా ఇదే. బోయింగ్‌లో సేఫ్టీ కల్చర్ లేదని సలేహ్‌పూర్ అనే విజిల్ బ్లోయర్.. 2024లో యూఎస్ సెనేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికులకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. బోయింగ్ క్వాలిటీ ఇంజనీర్‌గా పనిచేసి ఆయన డ్రీమ్‌లైనర్ల తయారీ, లోపాల కారణంగా విమానం పదేపదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని, సమస్యలను పరిష్కరించకుంటే విమాన ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని తన వాంగూల్మంలో పేర్కొన్నారు. 787 మెయిన్ బాడీ ముఖ్యమైన భాగాల మధ్య ఖాళీలు ఉన్నాయని, ఇందువల్ల రెండు ప్రధాన విమాన జాయింట్లలో సమస్య తలెత్తి సమయానికి ముందే వైఫల్యానికి దారితేసే అవకాశం ఉందన్నారు. హడావిడిగా విమానాల నిర్మాణం జరుగుతోందని, ఓవర్‌టైమ్ పనిచేయాలని ఉద్యోగాలపై ఒత్తిడి ఉందని, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, ఫంక్షన్ సిస్టన్, టెస్టింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్ టెస్టింగ్‌లలో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు. ఇప్పుడు బ్లాక్‌బాక్స్, వాయిస్, సిస్టమ్ డేటాను పరిశీలిస్తే.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ తొలిసారి కుప్పకూలడానికి కారణాలు ఏమిటో, గతంలో విజియబ్లోయర్స్ నుంచి వ్యక్తమైన హెచ్చరికల్లో నిజమెంతో తెలుస్తుంది.
అహ్మదాబాద్ ఘటన తర్వాత బోయింగ్ డ్రీమ్‌లైనర్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ ప్రమాదంపై మనదేశ దర్యాప్తు సంస్థలతో పాటు బోయింగ్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అయితే బోయింగ్ విమానాల్లో నిర్వహణ లోపాలు, ఇంజిన్ సమస్యలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. బోయింగ్ 737 MAX విమానాలు 2018, 2019లో ఇండోనేషియా, ఇథియోపియాలో కూలిపోయాయి. ప్రమాదాల వెనుక ఫ్లైట్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌లో ప్రధాన లోపం ఉన్నట్లు గుర్తించారు. ఇక రన్‌వేపై టైర్లు ఊడిపోవడం, విమానాలు గాల్లో ఉండగానే డోర్లు విరిగిపోవడం, బోల్టులు ఊడడం, ఏసీ సమస్యలు తరచూ కనిపిస్తూ భద్రతను ప్రశ్నిస్తున్నాయి. విమానాల ఉత్పత్తిలో షార్ట్ కట్ మార్గాలను ఉపయోగించడం వల్ల నాణ్యత దెబ్బతింటోందని ఆరోపణలున్నాయి. ఒకవైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు మెయిన్‌టెయినెన్స్ సమస్యలు.. ఎయిరిండియాను వేధిస్తున్నాయి..
ఎయిరిండియా ఒక్కటే కాదు.. మన దేశంలో ఇతర ఎయిర్‌లైన్స్ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. ఇండిగోలోనూ తరచూ సమస్యలు వస్తున్నాయి. ఇక ఆ సంస్థ గురించి ప్రయాణికులు.. కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారు. అయినా తీరు మారడంలేదు. డొమెస్టిక్ సంగతి అటు ఉంచితే.. అంతర్జాతీయంగా ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు మంచి పేరు ఉంది. ఖతార్, లుఫ్తాన్సా, కాథే పసిఫిక్ లాంటి సంస్థలు.. బెస్ట్ ఎయిర్‌లైన్స్‌గా గుర్తింపు పొందాయి. మన సంస్థలు.. ఆ రేంజ్‌కు ఎప్పుడు చేరుకుంటాయి ?
డొమెస్టిస్ సర్వీసెస్ అందిస్తున్న విమానయాన సంస్థల్లో.. పలు నిర్వహణ లోపాలు కూడా బయపడుతున్నాయి. ప్రయాణికులు పదే పదే వీటిపై ఆందోళన చేస్తున్నా.. పట్టించుకొని చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ. ట్రిప్‌కి, ట్రిప్‌కి మధ్య టైమ్ ఇంటర్వెల్ చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీ నుంచి హైదరాబాద్.. వన్ స్టాప్ ముంబై ఫ్లైట్ అనుకుంటే.. ఒకవైపు ప్రయాణికులు దిగుతుంటే.. మరోవైపు ప్యాసెంజర్స్‌ను ఎక్కించే సంస్థలు కూడా ఉన్నాయి. చౌకగా విమానయానం అందిస్తున్నామని చెప్పుకోవడానికి.. ఇలాంటివి చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక విమానం ఆలస్యమైందని.. రోజుకో ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఆందోళన చేస్తున్న ఉదంతాలు అనేకం. తక్కువ టైమ్ గ్యాప్‌లో అన్ని చెకింగ్‌లు ఎలా చేస్తారు ? క్లియరెన్స్‌లు ఎలా ఇస్తారు ? ఇవన్నీ సామాన్య ప్రయాణికుడి ప్రాణాల్ని పణంగా పెట్టి.. విమానయాన సంస్థలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి…
మాములుగా విమానాలు ప్రమాదానికి గురికావడం చాలా అరుదు. ఎయిర్ యాక్సిడెంట్స్ రేట్.. కోటి ప్రయాణాల్లో ఒకటి. ఇటీవలి కాలంలో విమానయానం కూడా బాగా పెరిగింది. 2023లో గ్లోబల్ ప్యాసెంజర్ ట్రాఫిక్ 400 కోట్లకు పెరిగింది. ప్రమాదాల్లో 80శాతం మానవ తప్పిదాల వల్లే నమోదవుతుండగా.. 15శాతం టెక్నికల్ ప్రాబ్లమ్స్, 5శాతం వాతావరణం కారణంగా జరుగుతున్నాయి. అందువల్ల ఎక్కువ ప్రమాదాలకు కారణం.. మానవ, సాంకేతిక కారణాలే. విమాన సర్వీసుల్ని.. ఇష్టానుసారం తిప్పడం వల్ల.. ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తంమీద విమాన ప్రమాదాలు రెండు కారణాల వల్ల జరుగుతున్నాయి. ఒకటి సంస్థాగతమైతే.. రెండోది సాంకేతిక సమస్య. ఈ రెండింటిని బాగా హ్యాండ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ విమాన సంస్థలు ఎన్నో ఉన్నాయి..
విమాన సర్వీసుల విషయంలో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రపంచ విమాన సంస్థలు అన్నింటికీ ఆదర్శం. ఈ ఏడాది 20 బిలియన్ డాలర్ల ప్రాఫిట్ చూపించిన సంస్థ ఇది. అంతేకాదు.. ప్రపంచ టూరిజానికి దుబాయ్ హబ్‌గా మారిందంటే దానికి కారణం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్. ఒకప్పుడు అమెరికా వెళ్లాలన్నా.. లండన్ వెళ్లాలన్నా సౌత్ ఏషియాను బేస్ చేసుకుని సింగపూర్, మలేషియా మీదుగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు దుబాయ్ మీదుగా వెళ్తున్నారు. అమెరికా వాడు కూడా దుబాయ్ వచ్చి షాపింగ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే కారణం ఎమిరేట్స్ ఎయిర్ లైన్సే..! ఎమిరేట్స్ – 380లో ప్రయాణం వరల్డ్ క్లాస్ జర్నీ ఇస్తుంది. అంతేకాదు..! ఎమిరేట్స్ మెయింటెనెన్స్ కానీ.. మిగతా విషయాల్లో కానీ ఎక్కడా రాజీ పడదు. మిగిలిన ఎయిర్‌లైన్స్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేసినప్పటికీ ఎమిరేట్స్‌కు డిమాండ్ తగ్గకపోవడానికి అదే కారణం. ఎమిరేట్స్ -380 లాంటి విమానాన్ని మిగిలిన సంస్థలు ఏవీ నడపలేకపోవడానికి కారణం ఆ సంస్థ స్టాండర్డ్సే..! ఖతార్, లుఫ్తాన్సా, కాథే పసిఫిక్ లాంటి సంస్థలు కూడా ఎమిరేట్స్ పోటీని తట్టుకోలేకపోయాయి. అమెరికాలో డొమెస్టిక్ సర్వీసెస్ నడిపే ఈస్ట్ వెస్ట్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థల పనితీరును మనవాళ్లు అధ్యయనం చేయాలి. విమానాలు సింపుల్‌గా ఉండడం, సర్వీస్ మాత్రం క్వాలిటీగా ఇవ్వడం వాటి ప్రత్యేకత. అందుకే అంత పెద్ద దేశంలో ఈ రెండు సంస్థలు బ్రహ్మాండంగా ప్రయాణాలను నిర్వహించగలుగుతున్నాయి. ఇప్పటికైనా మన డొమెస్టిక్ విమాన సర్వీసులు తక్కువ రేటుకు నడపాలనే లక్ష్యంతోకన్నా భద్రత, క్వాలిటీ ప్రయాణాలు ఇవ్వాలనే టార్గెట్‌తో పనిచేస్తే ఇండియాలో విమాన సర్వీసులు సేఫ్‌గా ఉంటాయి.
రెండోది విమానాల నిర్మాణపరంగా కూడా భారత్.. చాలా దూరంలో ఉంది. అమెరికా తయారు చేసే బోయింగ్, ఐరోపా ప్రొడక్ట్ ఎయిర్ బస్ మోడళ్లపై ఆధార పడడం తప్ప మనకో విమానం ఇప్పటివరకు లేదు. బోయింగ్, ఎయిర్‌బస్ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా కొనసాగుతూ 90% మార్కెట్ వాటా పంచుకుంటున్నాయి. గత కొన్నాళ్లుగా బ్రెజిల్ దేశానికి చెందిన “ఎంబ్రాయర్” కూడా కొంతమేర మార్కెట్‌ను పొందగా మన పొరుగు దేశం చైనా సొంత విమానాన్ని ఆవిష్కరించింది. విమాన ప్రయాణికుల రద్దీ లెక్కల్లో మనదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు విమానయానానికి పెరుగుతున్న ఆదరణ కారణంగా.. మరో 20 ఏళ్లలో 2,200 కొత్త విమానాలు అవసరం కాగా, 1200 కొత్త విమానాలకు ఆర్డర్లు వెళ్లాయి. మరో వైపు సొంతంగా వాణిజ్య విమానం తయారీకి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. “టాటా”లు తయారు చేస్తున్న “హెచ్125” హెలికాప్టర్.. ఆ లక్ష్యంలో వేస్తున్న ముందడుగు. విమాన తయారీ సంస్థలైన బోయింగ్, ఎయిర్‌బస్ ఇప్పటికే మన దేశంలో పరిశోధన, సాంకేతికత, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వాస్తవానికి విమాన తయారీ విభాగం చాలా క్లిష్టమైన అంశం. విడిభాగాలు, అత్యాధునిక సాంకేతికతతో పాటు భారీ పెట్టుబడులు తప్పనిసరి. 2008-2020 మధ్య చైనా తన సీ919 అభివృద్ధికి దాదాపు 72 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందని అంచనా. ఇది మన కరెన్సీలో దాదాపు 6.12 లక్షల కోట్లు ఉంటుంది.టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్.. ఎయిర్‌బస్ సంస్థతో కలిపి కర్ణాటకలోని కోలార్ వద్ద హెచ్125 హెలికాప్టర్లకు ఫైనల్ అసెంబ్లీ లైన్ ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటిదాకా వీటి తయారీ ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్‌లోనే జరుగుతుండగా మన దేశం వాటి సరసన చేరనుంది. నిర్వహణ లోపాలు సవరించుకొని.. నిర్మాణపరంగా కూడా ముందడుగు వేస్తే.. విమానయానరంగంలో మనదేశం స్వయంసమృద్ధి సాధిస్తుంది.