Story Board: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, దానికి ఇరాన్ ప్రతిదాడులు ప్రస్తుత యుద్ధాన్ని రోజురోజుకీ మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇరు పక్షాలతో పాటు ప్రపంచ దేశాలూ దీనికి భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నాయి. తొలిరోజు దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ, ఆ దేశ ముఖ్య సైనికాధికారులు చనిపోవడంతో భారీ విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. సైనికపరమైన ఈ విజయం…రాజకీయ, వ్యూహాత్మక గెలుపునకు దారితీయకపోగా దీర్ఘకాల యుద్ధంలో ఆ దేశాలు కూరుకుపోయేలా చేస్తోందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ తక్షణ లక్ష్యం ఇరాన్లో ప్రభుత్వ మార్పు. తొలిరోజు విజయంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సమయం పట్టదని అంచనా వేశారు. కానీ, యుద్ధం ప్రారంభమై రెండు వారాలు దాటినా.. ట్రంప్, నెతన్యాహు ఆశించినట్లు టెహ్రాన్‌లో మత గురువుల పాలన ఇప్పటికిప్పుడు ముగిసిపోయే సూచనలు కనిపించటంలేదు. పైగా ఇరాన్ పన్నిన దీర్ఘకాలిక యుద్ధం ఉచ్చులో అమెరికా చిక్కుకున్నట్లు అనిపిస్తోంది. యుద్ధ పరిధిని భౌగోళికంగా విస్తరింపజేయాలన్నది టెహ్రాన్ వ్యూహం. గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలున్న దేశాలపై దాడులు దీనిలో భాగమే. అమెరికా యుద్ధం ఖర్చులను భారీగా పెంచడం, చమురు సరఫరాలను అడ్డుకోవడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచడం ఇరాన్ నేతల ఉద్దేశం.
తన లక్ష్యం నెరవేరకపోవడంతో ట్రంప్…ఇరాన్‌పై దాడులను మరింత పెంచే అవకాశం ఉంది. అయితే, అవి రాజకీయ, వ్యూహాత్మక, జాతీయ భద్రత విజయాలను అందిస్తాయా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. యుద్ధ విస్తరణ ఉచ్చు పలు దశల్లో ఉంటుందని అంచనా. గగనతల ఆధిపత్యంతో సాధించే విజయాలు స్వల్పంగానే ఉంటాయి. ఆ మాటకొస్తే.. ఇరాన్లో అమెరికా సైన్యం తొలి రోజు వందశాతం విజయం సాధించింది. కానీ వ్యూహాత్మక గెలుపునకు అది దోహదపడకపోవడంతో రెండో దశ ఉచ్చులోకి ప్రవేశించింది. ఇప్పటికీ దాడుల తీవ్రతను ఇంకా పెంచే సామర్థ్యం అమెరికాకు ఉంది. అయినా సరే అగ్రరాజ్యం వ్యూహాత్మక విజయాన్ని సాధించే పరిస్థితులు కనిపించడం లేదు. అప్పుడు మూడో దశ ఉచ్చుకు చేరువవుతుంది. అదే అసలైన సంక్షోభం. ప్రస్తుతం అమెరికా మూడోదశ ఉచ్చు అంచుల్లో ఉందని ఆ దేశ యుద్ధ నిపుణులే అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇరాన్లో పాలనా వ్యవస్థను సరిగ్గా అధ్యయనం చేయకుండా యుద్ధరంగంలోకి దిగిన అమెరికా దానికి తగిన మూల్యం చెల్లిస్తోంది. వెనిజువెలా మాదిరిగా ఇరాన్లో కుదరదని ట్రంప్‌కు తెలిసేసరికే చేయిదాటిపోయింది. మరికొన్నిరోజులు యుద్ధం కొనసాగితే.. అప్పుడు అమెరికా ఆపాలనుకున్నా యుద్ధం ఆగే స్థితి ఉండదని.. చాలా మంది విశ్లేషకులు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమాటకొస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని పుతిన్ ఏడాదిగా మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఏ ప్రయత్నమూ సఫలీకృతం కావడం లేదు. అమెరికా ఇప్పటికైనా ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించకపోతే.. భవిష్యత్తులో అగ్రరాజ్యానికీ అదే గతి పడుతుందని చెబుతున్నారు.
యుద్ధం మొదటి రోజు తగిలిన గట్టి దెబ్బతో ఇరాన్ నాయకత్వం తనదైన సొంత పంథాలో ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి లాగే యత్నం చేసింది. ట్రంప్‌పై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అనుసరించడం ప్రారంభించింది. అమెరికా, గల్ఫ్ దేశాల మధ్య దూరాన్ని పెంచడం, ఆయా దేశాల్లోని ప్రజలు అక్కడి ప్రభుత్వాలను నిలదీసేలా చేయడం కూడా ఇరాన్ లక్ష్యమే. ఇజ్రాయెల్ విస్తరణవాద ఆకాంక్షలకు మనమెందుకు మూల్యం చెల్లించాలని గల్ఫ్ దేశాల ప్రజలు తమ ప్రభుత్వాధినేతలను ప్రశ్నించే పరిస్థితిని తీసుకురావడం కూడా టెహ్రాన్ వ్యూహకర్తల ఉద్దేశం. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం తామెందుకు నష్టపోవాలని అరబ్ దేశాల ప్రజలు ప్రశ్నించేలా చేయడం ద్వారా అమెరికాను ఒంటరిని చేయాలని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న తీరు మొదట్లో ఊహించిన దానికన్నా భిన్నంగా ఉంది. ఇరాన్లో భూతల దాడులకు సైన్యాన్ని రంగంలోకి దించి, కీలకమైన మౌలిక వసతులను, కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని, కుర్దులు, లేదా ఇతర స్థానిక గ్రూపులతో అమెరికా సంప్రదింపులు జరపటం ఒక మార్గం. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు.
ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేయడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఉన్న సులభమైన మార్గం. అయితే, ఇరానీయులు అంత తేలిగ్గా లొంగిపోరు. విజయాన్ని వడ్డించిన విస్తరిలా అందించబోరు. వియత్నాం తరహాలో ఇరాన్ యుద్ధం కూడా ఏళ్ల తరబడి కొనసాగితే పరిస్థితి ఏమిటని పలువురు అమెరికన్లు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. వియత్నాం యుద్ధం తరహాలో ఇది కూడా ఏళ్ల తరబడి కొనసాగితే అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టినప్పటికీ.. ప్రస్తుతం యుద్ధం పూర్తిగా తమ వ్యూహం ప్రకారమే సాగుతుందని ఇరాన్ స్పష్టమైన అంచనాతో ఉంది. అందుకే అమెరికాతో చర్చలకు యత్నించే ప్రస్తావనే లేదని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి తేల్చి చెప్పారు. ఇరాన్ చర్చలను కోరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ నేతలు ఖండిస్తున్నారు. అవసరమైతే ఇంకో ఐదేళ్లు యుద్ధాన్ని కొనసాగించే సత్తా ఇరాన్‌కు ఉందని స్పష్టం చేశారు. గతంలో తాము రెండుసార్లు అమెరికాతో చర్చలు జరిపినా, ప్రతిగా ఇరాన్‌పై దాడులే చేసిందని ఇరాన్ నేతలు చెప్పారు. ఈసారి కూడా చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే, ఇరాన్‌పై అమెరికా దాడులు చేసిందన్నారు. ఈ చేదు అనుభవాల తరుణంలో ఇక అమెరికాతో చర్చలను కోరుకునేది లేదన్నారు. శత్రుదేశాలకు ఇరాన్ ఎన్నటికీ లొంగిపోదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎనిమిదేళ్ల పాటు ఇరాన్-ఇరాక్ యుద్ధం జరిగిందని, దీర్ఘకాలిక యుద్ధాలు చేసిన అనుభవం ఇరాన్‌కు ఉందని అంటున్నారు.
ప్రస్తుత సైనిక ఘర్షణ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం హర్మూజ్ జలసంధి. అది వ్యూహాత్మకంగా ముఖ్యమైన సముద్ర రవాణా మార్గం. దీని మీదుగా రోజూ గ్యాస్, ముడి చమురు సప్లై జరుగుతుంటుంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ మీదుగా ఇంధన సప్లైలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాడటం తప్ప, ఇరాన్‌కు మరో మార్గం లేదు. ఈ యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై బలవంతంగా రుద్దాయి. మా ఆత్మగౌరవం, స్వాతంత్య్రం, దేశం కోసం రక్తాన్ని చిందించడానికి మేం రెడీ అని ఇరాన్ తొడ గొడుతోంది. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ చెబుతుంటే.. ఆ ప్రసక్తే లేదని ఇరాన్ కౌంటరిస్తోంది. ఇప్పటికే అమెరికా దాడుల్లో కచ్చితత్వం కంటే ఇరాన్ దాడుల్లో కచ్చితత్వం ఎక్కువగా ఉండటం యూఎస్ వ్యూహకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే అమెరికాతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే ఇరాన్ సమర్థంగా యుద్ధం చేస్తుండటం.. ట్రంప్‌పై కూడా ఒత్తిడి పెంచుతున్న విషయం.
ఇప్పటిదాకా అమెరికా ఏ యుద్ధం చేసినా తన చేతులకు మట్టి అంటకుండా చూసుకుంటుంది. గతంలో చేసిన యుద్ధాలన్నీ ఇలాగే చేసింది. నాటో దేశాలను ముందు ఉంచి అమెరికా వెనుక ఉంటుంది. కానీ ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం భిన్నంగా కనిపిస్తోంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. అయినప్పటికీ ఇందులోకి నాటో దేశాలు రావడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్ మాత్రమే పోరాడుతున్నాయి. ఇప్పటికే యుద్ధం గల్ఫ్ దేశాలకు విస్తరించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా 30 దేశాలు పాల్గొంటున్నాయి. అయినా నాటో దేశాలు కల్పించుకోవడం లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఉమ్మడి లక్ష్యంతో యుద్ధం ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. యుద్ధం ముగింపుకు దారి తెలియని ట్రంప్.. ఖర్గ్ దీవి స్వాధీనం పేరుతో మరింత సంక్లిష్ట స్థితికి దారితీస్తున్నారు. అటు నెతన్యాహు ఇదే అదనుగా గ్రేటర్ ఇజ్రాయెల్ కోసం బైబిల్లో చెప్పిన ప్రామిస్డ్ ల్యాండ్ కోసం ప్రయత్నిస్తున్నారు. తొలినాళ్లలో ఏరోజుకారోజు మాట్లాడుకున్న ట్రంప్, నెతన్యాహు మధ్య ఇప్పుడు కమ్యూనికేషన్ లేకుండా పోయిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి.
ఆఫ్గాన్, లిబియా, ఇరాక్‌లో నాటో దేశాలు ముందంజలో నిలిచాయి. ఇరాన్‌పై దాడులకు మాత్రం ఫ్రాన్స్, జర్మనీ, యూకే దూరంగా ఉన్నాయి. టర్కీపై ఇరాన్ దాడి జరిగినా నాటో స్పందన లేదు. యుద్ధాల చరిత్ర ఫలితాలు తెలిసినందున యూరప్ ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. అసలు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక నాటో దేశాలు అమెరికాతో అంటీ ముట్టనట్టు ఉంటున్నాయి. టారిఫ్‌ల విధింపు, గ్రీన్లాండ్ స్వాధీనానికి యత్నించడం తదితర కారణాలు ఇందుకు కారణం. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి. కానీ ఇరాన్ యుద్ధంలో అస్సలుకే జోక్యం చేసుకోవడం లేదు. ఇరాన్‌తో యూరప్‌కు ప్రత్యక్ష గొడవ లేనందున, ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ దూరం అమెరికా వ్యూహాన్ని బలహీనపరుస్తోంది. నాటో దూరం అమెరికాను ఒంటరిగా చేసి, ఇరాన్‌కు ధైర్యం కల్పిస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియాకు యుద్ధనౌకలను పంపాలన్న ట్రంప్ వినతిని ఆస్ట్రేలియా, జపాన్ కూడా తిరస్కరించాయి. ఇక అమెరికాకు అత్యంత నమ్మకమైన దీర్ఘకాలిక మిత్రదేశంగా ఉంటూ వచ్చిన యూకే కూడా ఇరాన్ యుద్ధం విషయంలో గుర్రుగా ఉంది. అందుకే యుద్ధం తొలినాళ్లలోనే అమెరికా సైన్యం తమ ఆధీనంలో ఉన్న సైనిక స్థావరం వాడుకోవటానికి యూకే ప్రధాని స్టార్మర్ నిరాకరించారు. ఈ చర్యను అమెరికా గుర్తుపెట్టుకుంటుందని ట్రంప్ హెచ్చరించినా.. స్టార్మర్ ఖాతరు చేయలేదు.
తమకు ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉందని బీరాలు పలికిన ట్రంప్.. ఇరాన్‌పై ఏకపక్షంగా యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధానికి ముందు అటు నాటోతో కానీ.. ఇటు యూరప్‌తో కానీ చర్చించలేదు. సరికదా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా అదే చెబుతున్నాయి. యుద్ధం పర్యవసానాల్ని అంచనా వేయడంలో తీవ్రంగా విఫలమైన అమెరికా.. కనీసం తమను అప్రమత్తం చేసినా బాగుండేదని గల్ఫ్ దేశాలు మొత్తుకుంటున్నాయి. ఈ చర్యలన్నీ అమెరికా అహంకారం, మొండి వైఖరికి ప్రబల నిదర్శనంగా నిలుస్తున్నాయి. హర్మూజ్ విషయంలో కూడా మొదట్లో సింగిల్ హ్యాండ్‌తో డీల్ చేస్తామని బిల్డప్ ఇచ్చిన ట్రంప్.. చివరకు అమెరికా నౌకలకు కూడా రక్షణ కల్పించలేక చేతులెత్తేశారు. అమెరికా నేవీకి తీవ్ర నష్టం జరిగిందన్న ప్రచారం.. అమెరికాకు పుండు మీద కారం చల్లుతోంది. యుద్ధ నష్టంపై వాస్తవాలు చెప్పాలని స్వదేశంలో ట్రంప్‌కు సెగ తగులుతోంది. ఇప్పటికే సెనేట్‌లో యుద్ధ నివేదికపై దుమారం రేగింది. తలాతోకా లేకుండా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చూసి.. ప్రపంచంలో ఏ దేశమూ ఆయన్ను నమ్మడం లేదు. పైగా మొన్నటిదాకా ఆయన నాటో దేశాలను తీవ్రంగా అవహేళన చేశారు. అమెరికా మీద ఆధారపడి బతుకుతున్నాయంటూ ఈసడించారు. అలాంటప్పుడు తామెందుకు సాయం చేయాలని నాటో దేశాలు పట్టుదలగా ఉన్నాయి. ఇటు యూరప్‌తోనూ ట్రంప్ వ్యవహారశైలి అలాగే ఉంది. అమెరికా పెద్దన్న, యూరప్ చిన్న తమ్ముడు అన్న ట్రంప్ తెంపరితనం.. మొత్తంగా యూరప్ ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. దీంతో అలాంటి స్నేహం తమకు అక్కర్లేదని ఈయూ కూడా అమెరికాతో అంటీముట్టనట్టుగా ఉంటోంది. మొన్నటిదాకా గత యుద్ధాల చరిత్ర చూసుకుని విర్రవీగిన ట్రంప్.. వాటిల్లో మిత్రుల భాగస్వామ్యం ఉందనే విషయం కన్వీనియంట్‌గా మర్చిపోయారు.
ఇప్పుడు కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారీకి రెడీగా ఉందని, ప్రపంచానికి అణుముప్పు తప్పించటానికే యుద్ధం చేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. కానీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు. ఇంతవరకూ ఇరాన్లో శుద్ధిచేసిన యురేనియం ఆనవాళ్లు అమెరికా పసిగట్టలేకపోయింది. అణు కేంద్రాలపై దాడులు చేసి యుద్ధం ఆపేయాలని ఓ దశలో అనుకున్నా.. అవి ఎక్కడ ఉన్నాయో తెలియక.. అమెరికా అయోమయంలో పడిపోయింది. మొత్తం మీద ఇరాన్ యుద్ధం అమెరికాకు రోజురోజుకీ భయం పెంచుతోంది. మొదట్లో ఇరాన్‌ను లొంగదీస్తామనుకున్న అమెరికా.. తర్వాత దీర్ఘకాలయుద్ధానికీ సిద్ధపడింది. కానీ ప్రస్తుతం మాత్రం ఇంకా యుద్ధం ఊబిలో దిగబడేకంటే.. వీలైనంత త్వరగా ముగించి వెనుదిరగటం మంచిదనే ఆలోచన చేస్తోంది. ఎందుకంటే యుద్ధం మొదలైన దగ్గర్నుంచీ ఖమేనీ మరణం మినహా ఇంకేదీ అమెరికాకు అనుకూలంగా జరగడం లేదు. పైగా రోజురోజుకీ నష్టాలు పెరుగుతున్నాయి. అటు అమెరికా సైన్యం, ఇటు అమెరికా ప్రజల నుంచి ట్రంప్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటినీ ఎక్కువకాలం తట్టుకోవడం ట్రంప్‌కు సాధ్యమయ్యే పని కాదు. చివరకు వైట్‌హౌస్‌లో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చిన తర్వాత.. ఇక ట్రంప్ ఎంతోకాలం ఆర్భాటపు ప్రకటనలతో నెట్టుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనపై సందేహాస్పద వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇరాన్ యుద్ధం తరుణంలో కీలకంగా మారిన హర్మూజ్ జలసంధి సమస్య పరిష్కారం కోసం చైనా సహకరించాలంటూ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసే కూటమిలో చైనా చేరకపోతే అవసరమైతే ఈ నెలాఖరులో జరగాల్సిన చైనా పర్యటనను వాయిదా వేయవచ్చన్న సంకేతాలు ఇచ్చారు. హర్మూజ్ జలసంధి సమస్య పరిష్కారంలో చైనా పాత్ర కీలకమని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్ల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు అమెరికా రూపొందిస్తున్న అంతర్జాతీయ కూటమిలో చైనా కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ నెల చివర్లో ట్రంప్ చైనాను సందర్శించి, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కావాల్సి ఉంది. అయితే తాజా వ్యాఖ్యలతో ఆ పర్యటన అనిశ్చితిలో పడింది. దీన్ని కూడా అమెరికా తనకు అనుకూలంగా చెప్పుకుంటున్నా.. అసలు చైనా సహాయం కోసం అమెరికా దేబిరించడం ఏమిటనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. తద్వారా అంతర్జాతీయ వ్యవహారాల్లో తనకన్నా చైనాకే ఎక్కువ పరపతి ఉందని అమెరికా చెప్పకనే చెప్పినట్టైంది. ఇప్పటికే ఇరాన్ యుద్ధంతో రష్యా నెత్తిన పాలు పోసిన ట్రంప్.. ఇప్పుడు చైనాకూ లబ్ధి పొందే అవకాశం ఇవ్వడం ఏం వ్యూహమో తెలియక అమెరికా వ్యూహకర్తలే తలపట్టుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంగా రవాణా అయ్యే చమురులో సుమారు ఐదో వంతు హర్మూజ్ మార్గం ద్వారానే సాగుతుంది. ఇరాన్ నుంచి వచ్చిన హెచ్చరికల కారణంగా చమురు ట్యాంకర్ల రాకపోకలు అంతరాయం ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. అమెరికాలో కూడా పెట్రోల్ ధరలు పెరిగి వినియోగదారులకు భారమయ్యాయి. హర్మూజ్ జలసంధి భద్రత కోసం అమెరికా కొత్త అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ కూటమిలో భాగంగా ఆయా దేశాలు తమ యుద్ధనౌకలను పంపాలని ట్రంప్ పిలుపునిచ్చారు. కానీ ఈ పిలుపుకు ఏ దేశమూ స్పందించకపోవడంతో.. అమెరికాకు తల కొట్టేసినంత పనైంది. ఆధునిక చరిత్రలో అమెరికా అగ్రరాజ్యం అయిన తర్వాత.. ఎప్పుడూ అంకుల్ శామ్కు ఇలాంటి దుస్థితి రాలేదు. ఒకవేళ నిజంగానే ట్రంప్ చైనా పర్యటన వాయిదా పడితే అమెరికా- సంబంధాలపై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. గత ఏడాది నుంచి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పరస్పరం భారీ సుంకాలు విధించే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇటీవల రెండు దేశాలు తాత్కాలికంగా ఒక ఒప్పందానికి వచ్చాయి. ఆ ఒప్పందం ద్వారా సుంకాల యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చైనాలో జరగాల్సిన ట్రంప్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ పర్యటనలో వాణిజ్య చర్చలు, ఆర్థిక సహకారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రావాల్సి ఉంది. ఈ విషయంలో చైనా స్పందన మరింత ఆసక్తికరంగా ఉంది. పశ్చిమాసియా దేశాలతో చైనా సుదీర్ఘ సంబంధాలు కలిగి ఉందని, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్చల్లో భాగస్వామ్యం అవుతామని డ్రాగన్ చెబుతోంది. అంటే మొదట ట్రంప్ యుద్ధంలో వెనకడుగు వేస్తే.. అప్పుడు ఇరాన్‌ను తాము ఒప్పిస్తామనేది చైనా స్పందన అంతరార్థం.
ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. హర్మూజ్ జలసంధి సమస్య త్వరగా పరిష్కారం కానట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే యుద్ధం కారణంగా 45 దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం అవుతున్నాయి. ఆ దేశాలన్నీ ట్రంప్ కారణంగానే ఈ సంక్షోభం వచ్చిందని ఏకాభిప్రాయంతో ఉన్నాయి. దీనికి తోడు అమెరికాతో పోలిస్తే ఇరాన్ యుద్ధ ప్రకటనల్లో పరిణతి కనిపిస్తోంది. అమెరికా యుద్ధ ప్రకటనలన్నీ ఏకపక్షంగా, యుద్ధాన్ని మరింత ఎగదోసేవిగా ఉంటే.. ఇరాన్ మాత్రం ఆత్మరక్షణ కోసమే యుద్ధం చేస్తున్నామని చెబుతూ వచ్చింది. చివరకు తమకు యుద్ధం తప్ప వేరే గత్యంతరం లేకుండా ట్రంపే చేశారని ఆ దేశం విజయవంతంగా ప్రపంచానికి ఎస్టాబ్లిష్ చేసింది. దీంతో ప్రపంచ దేశాల ముందు ట్రంప్ మరింతగా బద్నాం అయ్యారు. అనవసరంగా ప్రపంచాన్ని సంక్షోభం అంచున నిలబెట్టిన ట్రంప్.. ఇప్పుడు తగుదునమ్మా అని యుద్ధం ముగింపుకు తమ సాయం కోరడమేంటని ప్రపంచ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇక్కడ చిన్న దేశం. పెద్ద దేశం అనే తేడా లేదు. మిత్ర దేశం, శత్రు దేశం అనే భేదం లేదు. అన్ని దేశాలూ ట్రంప్ పై అపనమ్మకంగా, అమెరికా వైఖరిపై గుర్రుగా ఉన్నాయి. ట్రంప్‌కు బుద్ధి లేకపోతే అమెరికా చట్టసభ సభ్యులకూ బుద్ధి లేదా అనే ప్రశ్నలు కూడా హోరెత్తుతున్నాయి. తద్వారా మీ అధ్యక్షుడ్ని అదుపుచేయకపోతే.. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరని ప్రపంచ దేశాలు అమెరికాకు సందేశమిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి తరుణంలో.. యుద్ధ రంగంలో ట్రంప్‌కు రివర్స్ గేర్ వేయక తప్పని స్థితి కనిపిస్తోంది. ఖర్గ్ ఆక్రమణ ప్రకటనతో ఇరాన్‌ను మరింత భయపెడుతున్నాననుకుంటున్న ట్రంప్.. అసలు ఖర్గ్ ఆక్రమణకు అమెరికా ఆర్మీ కదులుతుందనే గ్యారంటీ ఇవ్వగలరా అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటున్నారు. ఎందుకంటే యుద్ధం మొదలైన దగ్గర్నుంచీ అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి పెంటగన్‌కు వచ్చిన లేఖల్లో ఏ ఒక్కటి చూసినా.. ట్రంప్ కు నిద్ర కరువౌతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే అమెరికా దళాల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. దీనికి తోడు గల్ఫ్‌లో ఉన్న సైన్యాన్ని వెనక్కి పిలవాలని స్వదేశంలో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ వెనకడుగు వేయక తప్పదు. కానీ అది కూడా ఎలాగో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ట్రంప్.. కాస్త ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకుని.. రివర్స్ గేర్ వేసి పెట్టండని అడిగే దుస్థితికి దిగజారారు. దీంతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ రంకెలేసిన ట్రంప్.. చివరకు వియత్నాం అనుభవాన్ని పునరావృతం చేసి కానీ.. వెనుదిరగడేమోనని అమెరికన్లు భయపడుతున్నారు. ఏతావాతా ఇరాన్ యుద్ధంలో తొలిరోజే విజయనాదం చేసిన అమెరికా.. రెండు వారాల తర్వాత దిక్కుతోచని స్థితిలో ఉండటమే అసలైన యుద్ధ వైచిత్రి.