Story board: బంగారం ధర మరోసారి ఆల్‌టైం హై కి చేరింది. పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష రూపాయల 20 వేలకు చేరువైంది. పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజు రోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే 40% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దాని వేగవంతమైన వృద్ధిని చూస్తే, అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు.
గత ఐదు సంవత్సరాలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. దీనికి కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ, అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి. ప్రస్తుతం, ఈక్విటీ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 ఇండెక్స్ గత సంవత్సరంలో దాదాపు సున్నా రాబడిని అందించింది. ఈక్విటీ మార్కెట్లు బలమైన రాబడిని అందించడంలో విఫలమైనప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం, గత సంవత్సరంలో బంగారు ఇటిఎఫ్‌లు 47% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి.
బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. దీనికి తోడు సుంకాల ఆందోళనలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ కారణాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బంగారం ధరలు వచ్చే ఏడాదిలో ఔన్సుకు 4,000 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 3 లక్షల 40 వేలుపై మాటే. తులం బంగారం రూ.లక్ష ఇరవై వేలకు చేరువైతేనే బెంబేలెత్తుతున్న సామాన్యులకు భవిష్యత్ అంచనాలు మరింత కలవరం కలిగిస్తున్నాయి.
గతంలో 2025లో బంగారం ధరలు 3,100 నుంచి 3,500 డాలర్ల పరిధిలో ఉంటాయని చెప్పిన సిటీ బ్యాంక్ ఇప్పుడు దాన్ని 3,300 నుంచి 3,600 డాలర్లకు పెంచింది. ఫిడెలిటీ, గోల్డ్‌మ్యాన్ సాచ్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా బంగారం విషయమై ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు. కరోనా తర్వాత ప్రపంచ ఆర్థికం ఇంతవరకూ పూర్వస్థితికి చేరుకోలేదు. ఇక ఉరుము లేని పిడుగులా వచ్చిపడుతున్న ట్రంప్ సుంకాలు గోల్డ్ కు డిమాండ్ ను అమాంతం పెంచేస్తున్నాయి. దీనికి తోడు దేశీయంగానూ పసిడికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ కారణాలన్నీ కలిసికట్టుగా పసిడి పరుగును ప్రేరేపిస్తున్నాయి. ఒకప్పుడు మన దేశంలో బంగారాన్ని కేవలం నగల కోసమే కొనేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరత, రియల్ ఎస్టేట్ స్లో డౌన్ తో బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా చూసే ధోరణి పెరిగింది. చరిత్ర చూసుకుంటే ఏటా గ్యారెంటీగా 15 శాతం రాబడి ఇస్తున్న పుత్తడికి మించిన పెట్టుబడి ఏముందనే ఆలోచనలు వస్తున్నాయి.
గోల్డ్ రేట్లలో అప్ ట్రెండ్ షురూ అయిందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరను మేజర్‌గా డిసైడ్ చేసేది అంతర్జాతీయ మార్కెటే. మనదేశం.. బంగారాన్ని దిగుమతి చేసుకుంటుండటమే అందుకు కారణం. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌తో పాటు డాలర్ మారక విలువ ఆధారంగా.. బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. భారత్ సహా ఆసియా దేశాలలో బంగారాన్ని ఆస్తిగా చూస్తారు. కానీ మిగిలిన ఇతర దేశాలలో బంగారాన్ని పెట్టుబడిగా చూస్తారు. పెట్టుబడిదారులంతా.. తమకు ఎక్కువ లాభం ఎక్కడ వస్తుందనుకుంటే.. అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు. మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు.. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అందుకే యుద్ధభయాలు, మాంద్యం ఆందోళనలు ఎదురైనప్పుడల్లా.. బంగారంపై పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూ ఉంటుంది.
ద్రవ్యోల్బణంతో పాటు కరెన్సీ విలువ పతనాన్ని తట్టుకొని నిలబడగలిగే ఏకైన సాధనం బంగారం. ప్రభుత్వాల్లో అనిశ్చితి, ఈక్విటీ మార్కెట్లలో కుదుపులు వంటి సందర్భాల్లో పెట్టుబడులు బంగారం వైపు మళ్లుతుంటాయి. అంతేకాదు… ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే ఏకైన సాధనం బంగారం. అందుకే బంగారానికి అంత డిమాండ్. ఇక బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా శ్రేయస్కరం అనేది మార్కెట్ నిపుణుల విశ్లేషణ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్టు ప్రకారం భారత దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు 24 వేల టన్నులు. దీని విలువ 58 లక్షల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ. భారత్‌లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28 శాతం ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో 28 శాతం భారత్‌లోనే ఉంది.
కేంద్ర బ్యాంకులు కూడా ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్నే నమ్ముకుంటున్నాయి. ప్రపంచ బంగారం నిల్వ కేంద్రాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. 63 శాతం మంది పెట్టుబడిదారుల బంగారం ఇక్కడే ఉందని ప్రపంచ స్వర్ణ మండలి లెక్కలు చెబుతున్నాయి. బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్న ట్రెండ్ కు ఇది సంకేతంగా నిలుస్తోంది. కోవిడ్ కారణంగా ధనిక దేశాలు, పేద దేశాలు అనే తేడా లేకుండా.. అన్ని దేశాల సార్వభౌమ రేటింగులు దారుణంగా పడిపోయాయి. ధనిక దేశాలు కూడా చరిత్రలో ఎప్పుడూ చూడాని ఆర్థిక సంక్షోభాన్ని చూడాల్సి వచ్చింది. నిరుద్యోగ రేటు ఊహించనంతగా పెరిగింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి తగినన్ని బంగారం నిల్వలు సహాయపడతాయని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఈ కారణంగానే గతంలో బంగారంపై పెద్దగా ఆసక్తి చూపని దేశాలు కూడా.. ఇప్పుడు వీలైనంత బంగారం కొని పెట్టుకోవాలనే దృష్టితో ఉన్నాయి. ఓవైపు రిటైల్ మార్కెట్ డిమాండ్ కు తోడు.. కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారానికి డిమాండ్ ఉండటంతో.. భవిష్యత్తులో పసిడి మరింత వేగంగా పరుగులు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మొత్తం మీద బంగారం విషయంలో మన పెద్దలు చెప్పిన మాటలు మరోసారి నిజమౌతున్నాయి. ఎప్పటికైనా బంగారం కొనిపెట్టుకుంటే.. చెడ్డవారెవరూ లేరనేది తేలిపోతోంది. బంగారాన్ని ప్రస్తుత గణాంకాలు, రాబడుల ఆధారంగా ప్రపంచం సురక్షిత పెట్టుబడి సాధనమేనని నమ్మొచ్చేమోకానీ.. భారతీయులకు ఈ గణాంకాలతో పనిలేని మాట నిజం. మనకు మొదట్నుంచీ పుత్తడిపై బలమైన నమ్మకం ఉంది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా.. పేద, ధనిక అంతరాలు లేకుండా.. అందరూ తమకు ఉన్నంతలో ఎంతోకొంత పసిడి నిల్వలు పెంచుకోవాలనే చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మన జీవన విధానంలో భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు.