Story Board: జర్నలిస్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు జర్నలిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జర్నలిజం డెఫినేషన్ మారిపోయిందన్న ఆయన..జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్లు తమ బాధ్యతను మరవకూడదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్నా వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను వేరే చేయాలని.. వాళ్లను వేరుగా కూర్చోబెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పాత్రికేయులకు సూచించారు. వాళ్లు, మీరు ఒక్కటి కాదన్న భావనను ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీలు కూడా రాయలేని వారు కూడా నేను జర్నలిస్ట్‌ని అంటారన్నారు. ఏం జర్నలిస్ట్ అని అడిగితే సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటున్నారు. పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు అదేదో వాళ్ల ఇంటిపేరు అయినట్టు అంటూ వ్యాఖ్యానించారు.
అక్కడితో ఆగని సీఎం రేవంత్‌రెడ్డి…మరో అడుగు ముందుకేశారు. వాళ్ల తాతలు, ముత్తాతల నుంచి జర్నలిజంలోనే పుట్టి పెరిగినట్టు…జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్యా అని పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడు ఎప్పుడైన జర్నలిజం స్కూల్లో చదివిండా ? లేకపోతే ఓనమాలు మొత్తం అయినా వస్తాయా అంటే రెండూ రావని విమర్శించారు. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అయిన జర్నలిస్టులు ఉండేవాళ్లని…లేదంటే జర్నలిజం చదివిన వాళ్లకు ఈ బాధ్యతలు ఇచ్చే వారని గుర్తు చేశారు. వారి పనితనాన్ని బట్టి వాళ్లకు బాధ్యత పెంచేవారన్న రేవంత్‌రెడ్డి…కానీ ఈ రోజు అదేమీ లేదన్నారు. రోడ్లమీద ఆవారాగా తిరిగేటోడు .. ఎక్కువ తిట్లొచ్చినోడు…ఏందంటే అదే మాట్లాడేటోడే జర్నలిజం అనే ముసుగు తొడుక్కొన్నాడని మండిపడ్డారు. అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయన్నారు రేవంత్‌రెడ్డి. కొందరు ప్రెస్మీట్లు పెట్టినప్పుడు జర్నలిజం ముసుగులో కొందరు ముందరి వరుసలో ధిక్కారంగా కూర్చుంటారని అన్నారు. మనమేదో లోకువ అయినట్టు, వాళ్లేదే పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్లు మన కళ్లలోకి చూస్తుంటారని…ఇంకా నన్ను చూసి నమస్కారం పెడతలేవు అన్నట్లు వ్యవహరిస్తుంటారని చెప్పారు. నన్ను చేసి ఇంకా తల వంచుకుంటలేవు అని చూస్తుంటాడని…స్టేజీ దిగిపోయి పల్ల పల్ల చెంపలు పగులగొట్టాలని అనిపిస్తదన్నారు. అయితే పరిస్థితులు, హోదా అడ్డం వస్తుందన్నారు రేవంత్‌రెడ్డి.
ఫేక్ జర్నలిస్టులను గుర్తించకపోతే.. మీడియా సంస్థలకే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి, దేశ భద్రతకు ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు జర్నలిస్టులు అంటే చాలా గౌరవం ఉందన్న ఆయన…వాళ్లు రాసే వార్త కథనాలు ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతాయని గుర్తు చేశారు. ఏ అంశం మీదయినా…విశ్లేషించి రాసినప్పుడు ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేస్తోంది..? పథకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా..? అనేది క్లియర్ కట్‌గా తెలుస్తుందన్నారు. జర్నలిస్టుల ముసుగులో ఎవరూ తప్పులు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు..తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత రోజుల్లో ఎవరు చూసిన సోషల్ మీడియా జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తొడయ్యాయి. మీడియా వ్యవస్థను కొన్ని పార్టీలు నాశనం చేస్తున్నాయ్. కొన్ని పార్టీలు ఏర్పాటు చేసుకున్న సొంత మీడియా సంస్థల వల్ల జర్నలిస్టుల విశ్వసనీయత వేగంగా సన్నగిల్లుతోంది. అందుకే ఇప్పుడు నిబద్ధత గల జర్నలిస్టులు అందరూ ఒక్క వేదికపైకి వచ్చి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన జర్నలిస్టులు ఒకవైపు.. జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వారికి మరొకవైపు నెట్టాల్సిన అవసరం ఉంది.
నిజమైన జర్నలిస్టులెవరో…అసలైన జర్నలిస్టులే తేల్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచన ఆచరణలో సాధ్యమవుతుందా ? ఎవరు జర్నలిస్ట్ ? ఎవరు కాదు ? జర్నలిస్ట్ కు ఉండాల్సిన కనీస విద్యార్హతలు, ప్రమాణాలు, విలువలు ఏంటి ? అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. టెక్నాలజీ ప్రభావంతో సోషల్ మీడియా ప్రభావం, పరిధి విస్తరిస్తోంది. దీంతో ప్రజల్లోనూ వాటి వాడకం పెరుగుతోంది. ఇదే అదనుగా చేసుకుని కొందరు జర్నలిస్టు అవతారం ఎత్తుతున్నారు. జర్నలిజం ముసుగులో వ్యవస్థలోకి చొరబడుతున్నారు. జర్నలిస్టుగా చెలామణి అవుతున్నారు. నేడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా జర్నలిస్టులుగా పరిస్థితులు మారిపోయాయి. ఇంతకూ జర్నలిస్టు లెవరు ? ఎవరిని జర్నలిస్టులుగా గుర్తించాలి ? అనే సందేహాలు ప్రజల్లోనే కాదు. జర్నలిస్టు ప్రపంచంలోనూ నెలకొన్నాయి.