టాలీవుడ్‌లో తిరుగులేని కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్, వరుస విజయాలతో సెంచరీ కొడుతున్న మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన మార్కు కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక తాజాగా ఈ 2026 సంక్రాంతి బరిలో నిలిచిన అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘మనశంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించడంలో మరోసారి అనిల్ తన మ్యాజిక్‌ను ప్రదర్శించారు. సంక్రాంతి పండగ పూట నవ్వుల జాతరను తీసుకొచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఈ భారీ విజయం నేపథ్యంలో, NTV తెలుగు ప్రత్యేకంగా నిర్వహించిన పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న అనిల్ రావిపూడి, తన కెరీర్ విశేషాలు , ‘మనశంకరవరప్రసాద్’ సక్సెస్ సీక్రెట్స్‌ను పంచుకున్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ, తన సినిమాల్లో ఉండే వినోదం గురించి చర్చించారు. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి రెండున్నర గంటల పాటు తమ కష్టాలను మర్చిపోయి నవ్వుకోవాలనే ఉద్దేశంతోనే తాను కథలను సిద్ధం చేస్తానని చెప్పారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కథలో బలం ఉండేలా చూసుకోవడం వల్లనే వరుస విజయాలు సాధ్యమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తన తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ, రాబోయే కొద్ది రోజుల్లో ఒక కీలక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. నెక్ట్స్ సినిమా కొత్త బ్యాక్ డ్రాప్ తో ఉంటుందని.. ఇంతవరకు తను తీయని బ్యాక్ డ్రాప్ ఇది అని.. తను కూడా ఎంతో ఎక్సైట్ గా ఉన్నట్లు తెలిపారు. నెక్ట్స్ సినిమా కథ ఇంకా పూర్తి కాలేదని.. కథ కంప్లీట్ అయ్యాక ఆప్డేట్స్ ఇస్తామన్నారు. సినిమా మేకింగ్‌లో స్క్రిప్ట్ వర్క్ అనేది అత్యంత కీలకమని, అందుకే తాను ప్రతి సీన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పారు. నటీనటులతో పని చేసేటప్పుడు వారిలోని ఉత్తమ నటనను రాబట్టడానికి ఒక దర్శకుడిగా తాను పడే తపనను ఈ సందర్భంగా వివరించారు.
స్టార్ హీరోలతో పనిచేయడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద హీరోల ఇమేజ్‌ను కాపాడుతూనే, ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడం ఒక బాధ్యతగా భావిస్తానని చెప్పారు. ముఖ్యంగా ‘ఎఫ్-3’ వంటి మల్టీస్టారర్ సినిమాల సమయంలో నటీనటుల మధ్య సమన్వయం కుదర్చడం, ప్రతి పాత్రకు గుర్తింపు వచ్చేలా చూడటం తనకెంతో సవాలుగా అనిపించిందని వెల్లడించారు.