Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్థానిక కీలక నేతలకు మధ్య సయోధ్య లేకపోవడంతో… ఎవరి వెంట ఉండాలో, ఏం చేయాలో అర్ధంగాక క్యాడర్ అయోమయంలో ఉంది. ఇక్కడి నుంచి వైసీపీ తరపున రెండు సార్లు గెలిచారు కిలివేటి సంజీవయ్య. నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉండడంతో.. ఆ నాయకులతో సఖ్యతగా ఉంటూనే రెండు సార్లు అసెంబ్లీకి వెళ్ళారాయన. అయితే… గత ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని కీలక రెడ్డి నాయకులకు, కిలివేటికి మధ్య దూరం పెరిగిందట. అదికూడా… అలా ఇలా కాకుండా….వాళ్ళంతా కలిసి సంజీవయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేదాకా వెళ్ళిందంటున్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని సూళ్లూరుపేట మున్సిపల్ ఛైర్మన్ శ్రీమంత్ రెడ్డి, ఆయన మామ శేఖర్ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కోరారట. టికెట్ ఇస్తే మేం సహకరించబోమని కూడా చెప్పేసినా…. ఫైనల్‌గా సంజీవయ్య వైపే మొగ్గు చూపారు జగన్. దాంతో…. ఎన్నికల సమయంలో కిలివేటిని ఓడించేందుకు సూళ్ళూరుపేట రెడ్డి నాయకులంతా ఒక్కటైనట్టు ప్రచారం జరిగింది.
Read Also: Off The Record: పబ్లిసిటీ కోసం వెళ్లి హోంమంత్రి ఇరుకునపడ్డారా..?
ఎంపీకి మాత్రమే ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యే ఓటును టీడీపీ అభ్యర్థికి వెయ్యమన్నట్టు చెప్పుకుంటున్నారు. సంజీవయ్య ఘోరంగా ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అన్న విశ్లేషణలున్నాయి. రెడ్డి నాయకుల వెన్నుపోటు వల్లే తాను ఓడిపోయానంటూ కిలివేటి సంజీవయ్య కూడా… తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట. దీనికి సంబంధించి ఏడాది క్రితం శేఖర్ రెడ్డి మీద వైసీపీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇక అప్పటి నుంచి సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకి పూర్తిగా దూరం అయ్యారు. పార్టీ కార్యక్రమాలను సొంతగా చేసుకుంటూ… నేను జగన్‌కు విధేయుడిని తప్ప లోకల్ మాజీ ఎమ్మెల్యేతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తమ బలంతో సంజీవయ్యను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే… గత ఎన్నికల టైంలో ఆయనే తమను దూరం పెట్టేశారని అంటోంది మున్సిపల్ ఛైర్మన్ వర్గం. నాయకుల మధ్య గ్యాప్ పెరుగుతున్నా… పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకపోవడంతో…. వ్యవహారం అంతకంతకూ ముదురుతోందని అంటున్నారు కార్యకర్తలు.
పూర్తి స్థాయిలో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉండే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో… ముగ్గురు మినహా మిగిలిన అందరూ మాజీ ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారట. వాళ్ళ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేయలేక, అలాగని జరుగుతున్న పరిమామాల్ని జీర్ణించుకోలేక కిలివేటి సతమతం అవుతున్నట్టు సమాచారం.
నేరుగా ఫిర్యాదు చేస్తే…. అధిష్టానం ఎలా తీసుకుంటుందోనన్న అనుమానం కూడా మాజీ ఎమ్మెల్యేకి ఉన్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో…తాను నిర్వహించే పార్టీ కార్యక్రమాలన్నిటినీ నాయుడుపేట కేంద్రంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రం సూళ్లూరుపేట వెళ్తే… వ్యతిరేక వర్గం కలిసిరాక, గ్రూప్ రాజకీయాలు ఎటు దారి తీస్తాయో అర్ధంగాక అటువైపు చూడ్డమే మానేశారట మాజీ శాసనసభ్యుడు. నియోజకవర్గ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే రెడ్డి నేతలందరికీ ఏదో ఒక రూపంలో పార్టీ అధిష్టానం, లేదా ముఖ్య నాయకులతో సత్సంబంధాలు ఉంటాయని, అలాంటి వాళ్ళను టచ్ చేస్తే తనకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్నది సంజీవయ్య భయంగా చెప్పుకుంటున్నారు. ఒకరిద్దరు నేతల్ని పక్కన పెట్టుకుని సంజీవయ్య సూళ్లూరుపేట వైసీపీని నాశనం చేస్తున్నారన్నది ఆయన వ్యతిరేకవర్గం ఆరోపణ. దీంతో… అధిష్టానం ఎంత త్వరగా జోక్యం చేసుకుంటే… పార్టీ అంత కంఫర్ట్ జోన్‌లో ఉంటుందని, లేదంటే… ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం బలపడుతోంది.