ప్రపంచీకరణ తర్వాత యువకుల్లో కెరీరిజం పెరిగింది. ధర్నాలు, ఆందోళనలు తగ్గిపోయాయి. రాజకీయ భావజాలం అంతరించిపోతోంది. ఇది చాలా మంది అభిప్రాయం. అయితే ఇది పూర్తిగా నిజం కాదని శ్రీలంక నిరూపించింది. పాలకులంతా శ్రీలంక నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే.. ప్రజలు మంచి వాళ్లే. అయితే అతి పేదరికం ఆకలిలోకి నెడితే మాత్రం వెంటపడి తరుముతారు. శ్రీలంకలో జరుగుతున్నది ఇదే. దీనికి పరిష్కారం కూడా అంత సులభం కాదు. కొత్తగా ఎవరొచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. అప్పులిచ్చిన సంస్థలన్నీ రుణమాఫీ చేసి, వడ్డీ లేకుండా కొత్త అప్పులిస్తే తప్ప సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడదు.
భారత్, శ్రీలంకల మధ్య ఎలాంటి పోలిక లేదు. ఆర్థిక పరంగా చూస్తే శ్రీలంక చాలా చిన్న దేశం. జనాభా కూడా భారతదేశం కంటే చాలా చాలా తక్కువ. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీలంక పరిస్థితులు భారత్ లో కూడా వస్తాయంటూ పోస్ట్‌లు చాలానే కనిపిస్తున్నాయి. నిజంగానే భారత్ కూడా శ్రీలంక బాటన నడుస్తోందా?
శ్రీలంక సంక్షోభం నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఈ రోజు శ్రీలంకలో ఏం జరుగుతోందనే కథ ఆర్థిక సంక్షోభంగా ప్రారంభమైంది. అయితే ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇప్పుడు రాజకీయ సంక్షోభం రూపంలో ప్రపంచం ముందు ఉంది. శ్రీలంక నుండి భారత్ ఆర్థిక పాఠాలతో పాటూ రాజకీయ గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సి ఉంది.
ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ భిన్నమైనవని. అయితే అందరికీ వర్తించే కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. ఒక దేశంలో అవసరమైన ఆహార పదార్థాలు తగినంత పరిమాణంలో లేకుంటే, ఆ దేశం బయటి నుండి ఆ వస్తువులను దిగుమతి చేసుకోవాలి. దాని కోసం విదేశీ మారక నిల్వలు అవసరమవుతాయి. విదేశీ మారకద్రవ్యం పొందడానికి, ఆ దేశం ఏదైనా ఎగుమతి చేయాలి. అందుకు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఆర్థిక రంగంలో శ్రీలంక సంక్షోభం నుండి భారతదేశం తీసుకోవాల్సిన మొదటి పాఠం ఫారెక్స్ నిల్వలపై ఒక కన్నేసి ఉంచడం, ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే దీర్ఘకాలంలో దిగుమతి బిల్లును ఎలా తగ్గించుకోవాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
సాధారణంగా ఒక దేశపు విదేశీ మారకద్రవ్య నిల్వలు కనీసం 7 నెలల దిగుమతులకు సరిపోతాయని నిపుణులు చెబుతారు. అందులోనే రెండో పాఠం ఉంది. రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టడం, బొగ్గు కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, అలాగే దేశంలోనే వంట నూనె ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలనేది భారత్ కు చాలా ముఖ్యమైన అంశం. ఇది దిగుమతి బిల్లును తగ్గించడానికి, స్వావలంబనకు సహాయపడుతుంది.
గణాంకాల ప్రకారం, భారత్ తన చమురు అవసరాలలో 80-85 శాతం బయట దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. రష్యా-యుక్రెయిన్ సంక్షోభం వల్ల గత కొద్ది రోజులుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. భారత్ దే విధంగా చమురు కోసం ప్రపంచ దేశాలపై ఆధారపడుతుంటే, అక్కడ చమురు ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే, విదేశీ మారక నిల్వలు ఖాళీ కావడానికి ఎక్కువకాలం పట్టదు. అందువల్ల దేశం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని వేగంగా పెంచుకోవలసి ఉంటుంది. ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు. సుదీర్ఘ ప్రణాళిక అవసరం. బొగ్గు రంగంలోనూ ఇదే పరిస్థితి. భారతదేశపు విద్యుత్ రంగం, దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడి ఉంది. ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్నాయి.
వంట నూనె, బొగ్గు కథలు పెట్రోల్, డీజిల్ కంటే భిన్నంగా లేవు. భారతదేశపు దిగుమతి బిల్లులో ఎక్కువ భాగం కూడా వీటికే ఖర్చు అవుతుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉంది.
శ్రీలంక సంక్షోభానికి మరో కారణం రాజకీయం. ఆ కోణంలో కూడా మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఏళ్ల తరబడి కొందరి చేతుల్లోనే అధికార కేంద్రీకరణ ఏ దేశానికి మేలు చేయదు. శ్రీలంకకు సంబంధించి రాజపక్సే కుటుంబం ఏళ్ల తరబడి అధికారాన్ని ఏ విధంగా శాసించిందో, అదే పరిస్థితి భారత్‌లో కూడా ఉందని అంటున్నారు. ఇక్కడ కూడా ఆర్థిక, రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వంలోని ఎంపిక చేసిన కొంతమంది సలహాదారుల చేతుల్లోనే ఉంటుంది. భారత్ లో అన్ని ప్రభుత్వాలు పక్షపాత వైఖరితో పనిచేస్తుంటాయి. శ్రీలంక సంక్షోభం నుండి పాఠాలు నేర్చుకుంటూ , భారత ప్రభుత్వం ఈ వ్యూహంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది.
శ్రీలంకలో అత్యధిక జనాభా సింహళీయులు. తమిళులు మైనారిటీలు. అక్కడి ప్రభుత్వం మెజారిటీ రాజకీయాలు చేస్తోందని తరచూ ఆరోపణలు వస్తున్నాయి. దేశంలోని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలన్నీ, హిందీని తమపై రుద్దుతున్నారని ఆరోపిస్తున్నాయనీ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హిజాబ్, లౌడ్ స్పీకర్, గుడి-మసీదు, మాంసం వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. మెజారిటీవాద రాజకీయాలకు, సాంస్కృతిక ఎజెండాకు సంబంధం ఉందనే వాదనలున్నాయి. ఈ రకమైన రాజకీయాల కారణంగా, దేశంలోని ఒక వర్గం ఏకాకులమన్న భావనలోకి వెళుతుంది. శ్రీలంకలో ఇన్నాళ్లు జరిగిందే భారతదేశంలో చాలా రోజుల నుంచి జరుగుతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఒక దేశంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు, పౌర సమాజం, రాజ్యాంగ సంస్థలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తాయి.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. అది రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. న్యాయవ్యవస్థ, పోలీసు, ప్రభుత్వం, పార్లమెంటు వంటి సంస్థలు బలంగా ఉండటం ముఖ్యం. ఏది సరైనది, ఏది కాదో నిర్ణయంచుకోవడం ముఖ్యమన్న విషయాన్ని మండుతున్న లంక మనకు తెలియజేస్తుంది. లంక సంక్షోభానికి అప్పుల భారం, ప్రభుత్వ నిర్వహణ తీరు, వారి విధానాలు అన్నీ బాధ్యత వహిస్తాయి. కేంద్ర ప్రభుత్వం వీటి నుంచి అనేక పాఠాలను నేర్చుకోవాలి. శ్రీలంక ప్రభుత్వం తీసుకున్నట్లుగా ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ముప్పు తప్పదు.
ఓట్ల రాజకీయాలకు శ్రీలంకలో పన్ను మినహాయింపులను ఉదాహరణగా చూపిస్తున్నారు. 2019 అధ్యక్ష ఎన్నికల తరుణంలో.. ప్రజలకు పన్ను మినహాయింపులు ఇస్తామని గొటాబయ రాజపక్స హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే అమలు చేశారని, కానీ ఇది దేశంపై భారం పడేలా చేసిందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాగ్దానాలు చేస్తున్నప్పుడు, నిపుణుల అభిప్రాయం లేదా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని కాకుండా, కేవలం ఎన్నికల లాభాలను మాత్రమే చూడటం వల్ల వచ్చిన సమస్య ఇది.అటువంటి పరిస్థితిలో, పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పౌర సమాజం తమ స్వరాన్ని వినిపించడం అవసరం. మన దేశంలో కూడా ఇలాంటి ఎన్నికల వాగ్దానాలు చాలా ఎక్కువ. కొన్నిసార్లు ఈ వ్యవహారం కోర్టుకు చేరుతుంది. కొన్నిసార్లు పౌర సమాజం దానిపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరికొన్నిసార్లు దేశ పార్లమెంటులో నిరసనలు కనిపిస్తాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో ఎరువుల దిగుమతులను నిలిపివేస్తే విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావించింది. ఏప్రిల్ 2021లో గొటాబయ రాజపక్స ప్రభుత్వం వ్యవసాయంలో ఉపయోగించే అన్ని రసాయనాల దిగుమతిపై నిషేధాన్ని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి ప్రభుత్వం ఆలోచించలేకపోయింది. దీంతో పంటల దిగుబడిపై ప్రభావం పడింది. ఎరువులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోవడం చాలా ముఖ్యం. భారత ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని అర్థం చేసుకోవాలి. తక్షణ లాభాల కోసం తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో పెను సమస్యగా మారతాయి.
మన దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ అంత గొప్పగా ఏమీ లేదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు.. దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంత భిన్నంగా ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా భారీగానే అప్పులు తీసుకొస్తోంది. ఉదాహరణకు, ఇటీవలి బడ్జెట్‌లో మొత్తం ఆదాయం దాదాపు రూ.40 లక్షల కోట్లు అయితే.. అందులో రూ.16.61 లక్షల కోట్లు కేవలం అప్పులే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా ప్రకారం ఇది రూ.15.91 లక్షల కోట్లు. మొత్తం బడ్జెట్లో అప్పులు 30 శాతం దాటేస్తున్నాయని ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
శ్రీలంక వ్యూహాత్మకంగా మనకు చాలా ముఖ్యమైన దేశం. కాపలాదారు లాగా. నేవిగేషన్, వాణిజ్యపరంగా కూడా. అక్కడి అస్థిరత్వం మనదేశంపై చాలా ప్రభావం చూపుతుంది. తమిళనాడుకు వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇది నేరుగా శ్రీలంకతో సంబంధం ఉన్నదే. లంకలో పరిస్థితి అధ్వాన్నంగా మారితే అనేకమంది శరణార్థులు వస్తారు.
శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని చైనా అవకాశంగా తీసుకుంటుందా? ఇప్పటికే శ్రీలంకకు చైనా భారీగా అప్పులిచ్చింది కదా?
శ్రీలంక రాజకీయాలను మనం నిర్దేశించలేం. కానీ అక్కడ ఇప్పటికే చురుగ్గా ఉన్న, ఇంకా ఎక్కువ పట్టు కోసం ప్రయత్నిస్తున్న చైనా లాంటి దేశాల కార్యకలాపాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. శ్రీలంక విదేశీ అప్పుల్లో పదిశాతం చైనావే. చైనా ప్రాజెక్టులు ప్రత్యేకించి హంబన్‌టోటా పోర్టు అభివృద్ధి, మట్టాలా విమానాశ్రయాభివృద్ధి రాజపక్సలకు చాలా ముఖ్యమైనవి. దీనివల్ల ప్రజలకు, ఆర్థికవ్యవస్థకు కలిగిన ప్రయోజనం చాలా స్వల్పం. హంబన్ టోటా పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకివ్వడం శ్రీలంక సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడమేనని ఆ దేశ ప్రజలు నిరసనలు తెలిపారు. చైనా పెట్టుబడులు, కొలంబో పోర్టు సిటీ ప్రాజెక్టు యాజమాన్యం విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పలేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. శ్రీలంకకు కలిగే ప్రయోజనాల కంటే చైనా వల్ల దోపిడీయే ఎక్కువ ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
ప్రస్తుత సంక్షోభంలో మొదట స్పందించింది భారతదేశం. ఇంధనం, ఆహారం, మందుల కోసం మూడు బిలియన్ డాలర్ల విలువైన సాయం చేసింది. తర్వాత ఆర్‌బీఐ ద్వారా శ్రీలంక సెంట్రల్ బ్యాంకుకు రెండు బిలియన్ డాలర్ల సొమ్మును అందుబాటులో ఉంచింది. ఈ సంక్షోభ సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని, సాయాన్ని కొనసాగిస్తామని భారత్ చెప్పింది.
గాంధీజీ అన్నట్లు.. భారతదేశం, శ్రీలంక ఘర్షణ పడటం అసాధ్యం. అంతా ఒక కుటుంబంలాగానే. శ్రీలంకలో ఎప్పుడూ స్థిరత్వం ఉండేలా మనం చూడాలి. ఆ దేశ స్వతంత్రతను, సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను పరిగణనలోకి తీసుకోవాలి. వ్యూహాత్మకంగా శ్రీలంక చాలా ముఖ్యమైంది. భారతదేశం లాంటి పెద్దదేశానికి సరిహద్దుగా ఉంది. ముందుచూపుతో లంకను గౌరవించాలి. దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య మౌలికవసతుల అనుసంధానం శ్రీలంక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడుతుంది. ముఖ్యంగా బంగాళాఖాత ప్రాంతానికి ప్రయోజనకరం.
ఆ దేశం అనుసరించిన విధానాలే ఆర్థిక సంక్షోభానికి కారణం. ఇలాంటి పరిస్థితిని మన ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుంటారన్న విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రాంతీయ సమైక్యతకు ప్రయత్నించాలి. జీడీపీ వృద్ధి, ఆర్థిక పురోగతిని ప్రోత్సహించాలి. సరిహద్దుకు సంబంధించిన విధానాలకు రూపకల్పన చేయాలి. అమలులో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సుపరిపాలన, సామాజిక, ఆర్థికాభివృద్ధికి నియంతృత్వ ధోరణితో కాకుండా ప్రజాస్వామ్యయుతంగా చర్యలు తీసుకోవాలి. వివిధజాతులు, మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం ముఖ్యం. ఇవి జరిగితే పటిష్ఠమైన మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ ఎలాంటి సమస్యా ఉండదు.
శ్రీలంక ప్రభుత్వం ముందున్న తక్షణ ప్రధాన సవాలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవడం. ప్రత్యేకించి పేదవర్గాలు అనుభవించే బాధలను తగ్గించాలి. చెల్లించాల్సిన విదేశీ రుణాల చెల్లింపు విధానాన్ని మార్చుకోవాలి. ఇందులో జులైలో చెల్లించాల్సిన అప్పు ఎక్కువగా ఉంది. ఐఎంఎఫ్ లాంటి సంస్థలతో కలిసి అప్పుల విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నిత్యావసరాలైన ఆహారం, ఇంధనం, మందుల దిగుమతికి అప్పు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొత్త ప్రధానిగా సుదీర్ఘ అనుభవం కలిగిన రణిల్ విక్రమ సింఘె నియమితులైనా, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దిగిపోవాలని దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను విస్మరించలేరు. తప్పుడు విధానాలతో గొటబాయ దేశప్రయోజనాలను దెబ్బతీశారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. రాజపక్స కుటుంబం తమ భవిష్యత్తును నాశనం చేసిందని, అవినీతితో దేశాన్ని లూటీ చేసిందని జనం రగిలిపోతున్నారు. అనుభవజ్ఞులు, దేశ ప్రయోజనాల గురించి ఆలోచించే రాజకీయ నాయకులతో బృందాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణకు ఉపక్రమించడం కొత్త ప్రధాని తక్షణ కర్తవ్యం. ఇది కూడా అంత సులభం కాదు. శ్రీలంక ప్రజలు మరికొంతకాలం క్లిష్టమైన సమస్యలను ఎదుర్కోనున్నారు. సంక్షోభాన్ని రాత్రికి రాత్రే పరిష్కరించలేం. వచ్చే అయిదేళ్లు సవాళ్లతో కూడుకున్నది. సరైన పాలన ద్వారా పరిస్థితిని మెరుగుపరచవచ్చు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచి, సొంత ఇమేజీ పెంచుకొని, జనంలో లేనిపోని భ్రమలు కల్పించేవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన నేతల నియంతృత్వ పోకడల వల్లే దేశాలు అధోగతి పాలవుతున్నాయి. నాయకుడు ఎంత గొప్పవాడైనా గానీ.. ప్రజాస్వా మ్య నిబంధనలను పాటించక తప్పని కట్టుబాటు ఉండాలి. మనదేశంలో సవాలక్ష సమస్యలున్నప్పటికీ.. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు మారటం, స్వతంత్ర ఎన్నికల సంఘం, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటివి ప్రపంచంలో మనకొక గౌరవాన్ని తెచ్చి పెట్టాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలకు, సంప్రదాయాలకు తూట్లు పడుతున్నాయి.
రాష్ట్రాలు ఎడాపెడా అప్పులు చేస్తూ ఆ సొమ్మును మౌలిక వసతుల కల్పన, ఉపాధికి ఊతమిచ్చే రంగాలపై కాకుండా- రాయితీలు, ఉచిత పంపకాల పథకాలకే ఎక్కువగా వ్యయం చేస్తున్నాయి. ఫలితంగా సంపద సృష్టి చోటుచేసుకోకపోగా… ఆయా రాష్ట్రాలు మరింతగా అప్పుల ఊబిలోకి జారుకుంటున్నాయి. కేంద్రం కూడా అప్పుల విషయంలో రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. రాష్ట్రాల్ని మించి అప్పులు చేస్తుండటంతో.. పరిస్థితి మరింతగా విషమిస్తోంది. కేంద్రం ఓవైపు పథకాల్ని ఎత్తేస్తూ పోతోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచుతోంది. అయినా సరే అప్పుల భారం పెరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితి.
దేశంలో ఎన్నికలు జరిగే క్రమంలో ఉచిత వాగ్దానాలకు బీజం పడుతుంది. చాలా రాష్ట్రాల్లో డబ్బు లేకుండా.. ఆదాయ వనరుల గురించి ఆలోచించకుండా ఉచితాలు, జనాకర్షక పథకాలకే ఖర్చు చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలు ఉచిత విద్యుత్, ఉచిత రేషన్లు, ఉచిత మందులతోపాటు అనేక ఇతర సేవలను సబ్సిడీ లేదా ఉచితంగా అందిస్తామంటూ వాగ్దానం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర భారం పడుతోంది. అలాగే, ఇది ఆరోగ్యం, విద్య వంటి క్లిష్టమైన సామాజిక రంగాలకు ఆర్థికంగా నష్టం జరగడంతోపాటు.. సామర్థ్యం కొంతవరకే పరిమితం అవుతోంది. తమిళనాడులో 1954 1963 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత కె కామరాజ్ పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత ఆహారాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి వాగ్ధానాలకు బీజం పడింది. ఆ తర్వాత నుంచి ఉచిత బియ్యం, ఉచిత కలర్ టీవీలు, నగదు, పలు సౌకర్యాలు కూడా ఉచితమయ్యాయి. ఇలా.. ఉచితాలు వ్యవసాయ రుణాల మాఫీల వైపు మళ్లింది. ఇప్పుడు ఎక్కడా కూడా వెనుదిరిగి చూసే పరిస్థితి లేదని కనిపిస్తోంది.
ఆర్థిక నిర్వహణలో భాగంగా అప్పులు చేయాల్సి రావచ్చు. దానికి ఓ పరిమితి అంటూ లేకపోవడమే సమస్య. రుణం తీసుకొని పెట్టుబడి వ్యయం కింద ఖర్చుచేస్తే ఆదాయం వస్తుంది. తిరిగి కట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా పన్నులు తగ్గించి, సబ్సిడీలకు పెంచి, ప్రజాకర్షక పథకాలకు వ్యయం చేస్తూ పోతే సమస్యలొస్తాయి. ఇలా చేసే శ్రీలంక సమస్యల్లో పడింది. మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాలు ఇలా చేస్తున్నాయి. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం అత్యధికంగా అప్పులు చేసిన అయిదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రాలు చేసే రుణాలు అదనంగా ఉంటున్నాయి. మొత్తం కలిపి చూస్తే జీఎస్‌డీపీలో 50 శాతానికి మించి అప్పులుండే రాష్ట్రాలున్నాయి. రుణ పరిమితిని తుంగలో తొక్కుతున్నాయి.
రాష్ట్రాల అప్పులు పెరుగుతున్నాయి. చెల్లించాల్సిన వడ్డీలూ పెరిగాయి. దీంతో అభివృద్ధి పనులకు డబ్బులుండటం లేదు. అప్పు అంటే బడ్జెట్‌లో చూపని గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి రెండు కారణాలున్నాయి. విదేశీ ఆదాయం తగ్గిపోవడం, ప్రభుత్వ ప్రజాకర్షక పథకాలు. శ్రీలంక ఎక్కువగా విదేశీ పర్యాటకులు, ఇతర దేశాల్లో పని చేసే తమ దేశస్థులు పంపే డబ్బుపై ఆధారపడి ఉంది. 2019లో జరిగిన బాంబుదాడులు, కరోనా కారణంగా ఈ రెండింటిపైనా ప్రభావం పడింది. కొవిడ్ కారణంగా టీ, టెక్స్‌టైల్స్ ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో చైనాతో సహా ఇతర దేశాల నుంచి అధిక వడ్డీలకు తీసుకొన్న రుణాలు చెల్లించలేకపోయింది. మరోవైపు ప్రజాకర్షక పథకాలకు తోడు కొవిడ్‌కు ముందుగా పన్నులు బాగా తగ్గించడం, వడ్డీలేని రుణాలు ఇవ్వడం చేసింది. రసాయనిక ఎరువుల దిగుమతిపై నిషేధం వల్ల ఆహార ధాన్యాల ధరలు బాగా పెరిగాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం వల్ల దిగుమతి చేసుకొనే ఆయిల్ ధరలు పెరిగాయి. ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది. వృద్ధిరేటు ధ్వంసమైంది. ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చి కరెన్సీ విలువ పతనమైంది. రుణాలు తిరిగి చెల్లించలేక డిపాల్ట్ కావడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.
దేశంలో రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అనేక ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తున్నాయి. ఇందుకోసం భారీగా బడ్జెట్‌లో కనిపించని అప్పులు చేస్తున్నాయి. ఆర్టికల్ 293 ప్రకారం ఏ రాష్ట్రప్రభుత్వమైనా అప్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలి. అప్పుడు కేంద్రం అన్నీ పరిశీలించి కొన్ని షరతులు పెట్టొచ్చు. ఆర్థిక ఎమర్జెన్సీ కూడా విధించవచ్చు. ఇప్పటివరకు మనదేశంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే ఆ భయం ఉండాలి.
రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఆర్.బి.ఐ మేనేజర్ పాత్ర పోషిస్తోంది. కేంద్రానికి నివేదికలిస్తుంది. అన్ని రాష్ట్రాల విషయంలో కేంద్రం ఒకే విధంగా వ్యవహరించినపుడు ఎలాంటి సమస్యా ఉండదు. అమెరికాలోని రాష్ట్రాలు బడ్జెట్‌ను బ్యాలన్స్ చేసుకొంటాయి. అప్పులు చేయవు. ప్రభుత్వాల ఖర్చులపై సోషల్ ఆడిట్ కనిపించడం లేదు,
ప్రజాస్వామ్యంలో బడ్జెట్‌ను శాసనసభ ఆమోదిస్తుంది. ప్రజాకర్షక పథకాలు, సబ్సిడీలు ప్రకటించినపుడు ప్రతిపక్షాలు కూడా ఏమీ మాట్లాడవు. ఎందుకంటే ఇవన్నీ ఓట్లతో ముడిపడి ఉండేవి. అసలు కొన్ని అప్పుల గురించి సమాచారమే ఉండదు. దీంతో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్‌కు అవకాశం లేకుండా పోయింది.
శ్రీలంక నుంచే కాదు 1991లో మన సొంత అనుభవం నుంచీ పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక, ద్రవ్య నిర్వహణ అన్నది చాలా ముఖ్యం. అధికలోటు, అప్పులు దేశాన్ని, రాష్ట్రాలను సంక్షోభంలోకి నెట్టి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తాయి. తెచ్చిన రుణాలను మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయకుండా ప్రజాకర్షక పథకాలకు వెచ్చిస్తూ పోతే ప్రభుత్వ ఆదాయం పెరగకపోగా వడ్డీలు అధికమై రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. జీతాలు, పింఛన్లు లాంటి కచ్చితంగా చెల్లించాల్సిన వాటితో పాటు అధిక మొత్తంలో వడ్డీలు కట్టాల్సి రావడంతో పెట్టుబడి వ్యయానికి నిధులుండవు.
ఆర్థికపరమైన అంశాలపై కాగ్ నివేదికలు ఇస్తుంది. ఇవి చాలా ఆలస్యంగా వస్తుండటంతో బ్యూరోక్రసీ పట్టించుకోవడం లేదు.
శ్రీలంక, పంజాబ్ ను పోల్చుకుంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ స్థూల దేశీయోత్పత్తి దాదాపు రూ. 6,07,594 కోట్లు ఉంది. ఈ కాలంలో శ్రీలంక GDP సరిగ్గా అదే గణాంకాల్లో ఉంది. శ్రీలంక ఆర్థికంగా చితికిపోయింది. దీని రుణం/GDP నిష్పత్తి దాదాపు 120 శాతం. అప్పు తీర్చడం, దిగుమతుల కోసం చెల్లించడం.. దేశాన్ని నడిపించడం కష్టంగా మారింది. కేవలం ఒక దశాబ్దం క్రితం ఈ రోజు పంజాబ్ సరిగ్గా 70 శాతం రుణ నిష్పత్తితో ఉంది. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తలు పాటించకపోతే.. మనకూ శ్రీలంక తరహా సమస్యలు తప్పవని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో కేంద్రం కూడా ఆర్థిక వ్యవస్థను లోతుగా అధ్యయనం చేయకుండా.. పైపై గణాంకాలు చూసి మురిసిపోవడం కూడా ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. కేవలం జీఎస్టీ వసూళ్లు, టోల్ వసూళ్లు చూసుకుని.. అంతా బాగుందనుకుంటే.. అది డొల్లతనమే అవుతుంది. ఎప్పటికప్పుడు ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా విశ్లేషించుకోకపోతే ఎప్పటికైనా సమస్యలు తప్పవు.