కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేయడం లేదని, విద్యార్ధులు చదువులు మానేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి దీవెన కూడా ఇవ్వట్లేదని, రూ.2200 కోట్లు బకాయి పెట్టారన్నారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా నిర్వీర్యం చేస్తున్నారని, ప్రతీ పిల్లాడు సొంతగా కారియర్స్ తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని, అందుకే ఆరోగ్యశ్రీని ఎత్తేశారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో అన్నీ స్కాములే అని.. బాధ్యతల నుంచి తప్పించుకోవటం, స్కాములు చేయటం అని విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒక స్కాం అయితే.. తీసుకున్న వాళ్లకు ఒక బొనాంజా ఇచ్చారని జగన్ చెప్పుకొచ్చారు.
ఈరోజు వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘విద్యార్ధులు చదువులు మానేస్తున్నారు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు 8 క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఆగిపోయాయి. మొత్తం దాదాపు రూ.5600 కోట్ల వరకు ఆగిపోయాయి. ఇప్పటివరకు ఇచ్చింది రూ.700 కోట్లు.. దాదాపు రూ.4800 కోట్లు బకాయిలు ఉన్నాయి. వసతి దీవెన కూడా ఇవ్వట్లేదు.. రూ.2200 కోట్లు బకాయి పెట్టారు. విద్యా దీవెన, వసతి దీవెన కలపి రూ.7 వేల కోట్ల వరకు బకాయి ఉన్నాయి. పిల్లల జీవితాలను సీఎం చంద్రబాబు చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రతీ పిల్లాడు సొంతగా కారియర్స్ తీసుకువెళ్తున్నారు. తినే ఆహారం అసలు రుచిగా ఉండటం లేదు. ఈ 18 నెలల్లో ప్రభుత్వ హాస్టల్స్ లో కలుషిత ఆహారం, తాగునీటి వల్ల 29 మంది విద్యార్ధులు చనిపోయారు. 29 మంది విద్యార్ధులు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చనిపోయారు. వందల మంది విద్యార్ధులు అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్రంలో చదువులు, విద్యార్ధుల పరిస్థితి ఎలా ఉంది అనేదానికి అనేక ఉదాహరణలు. ఈ ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది.. ఆరోగ్యశ్రీని ఎత్తేశారు. ఈ ప్రభుత్వంలో అన్నీ స్కాములే. బాధ్యతల నుంచి తప్పించుకోవటం.. స్కాములు చేయటం అలవాటుగా మారింది. బకాయిలు చెల్లించకపోవటంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు అనేకసార్లు ప్రశ్నించటంతో రూ.1800 కోట్లు ఇచ్చారు. రూ.3600 కోట్లు బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల వాళ్ళు సమ్మెకు దిగారు. పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడికి 108, 104 అప్పగించారు. కనీసం రూ.500 కోట్లు నెట్వర్ట్ కూడా లేని సంస్థకు ఇచ్చారు’ అని జగన్ మండిపడ్డారు.
‘మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒక స్కాం అయితే, తీసుకున్న వాళ్లకు ఒక బొనాంజా ఇచ్చారు. కళాశాలలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు మాత్రం ప్రభుత్వం ఇస్తుందట. ప్రభుత్వ భూమి, బిల్డింగులు, స్టాఫ్, జీతాలు.. కానీ ఓనర్లు మాత్రం ప్రైవేట్ వాళ్ళు. లాభాలు ప్రైవేట్ వాళ్లకు.. భారాలు ప్రభుత్వానికి. ఒకవైపు ప్రజా ఉద్యమం జరుగుతున్నా ఖాతరు చేయకుండా జీవో ఇస్తున్నారు. స్కాముల్లో కూడా ఇక అడుగు ముందుకు వేసి చేస్తున్నాడు. ఈ నిర్ణయం వెనక్కు తీసుకోకపోవటంతో ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. మా పార్టీ ఆద్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. అన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 10న అందరికి చూపించి జిల్లా కేంద్రాలకు పంపుతాం. 13న అన్నీ జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేసి పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు చేరతాయి. ఈనెల 16న గవర్నర్ కు చెప్పటం.. చూపించటం అయిన తర్వాత హైకోర్టులు పిటిషన్ కూడా వేస్తాం’ అని వైఎస్ జగన్ తెలిపారు.