పదకొండేళ్ల క్రింత ఏర్పాటైన కొత్త రాష్ట్రం తెలంగాణ. అభివృద్ధి, జీడీపీ విషయంలో దేశానికి తలమానికంగా ఉన్న రాష్ట్రం. కానీ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ పరువు తీసింది. మావోయిస్టుల పేరు చెప్పి వందల మంది ఫోన్లు ట్యాప్ చేయడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. కానీ మరింత లోతైన విచారణ కోసం.. ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక్కడ తవ్వేకొద్దీ ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. మొదట్లో ప్రణీత్ రావు వాంగ్మూలం కీలకంగా మారగా.. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ.. కొత్త విషయాలను బయటపెట్టింది. మావోయిస్టుల పేరు చెప్పి ఏకంగా 618 ఫోన్ నంబర్లు ట్యాపింగ్ చేయడం దుమారం రేపుతోంది.
తెలంగాణలో మూడేళ్ల క్రితం ఉన్నట్టుండి ట్యాపింగ్ ఆరోపణలు గుప్పుమన్నాయి. మొదట్లో వీటిని కూడా సాధారణ రాజకీయ ఆరోపణలే అనుకున్నారు. కానీ కాలక్రమంలో ట్యాపింగ్ బాగోతం గురించిన పూర్తి వివరాలు వెలుగుచూశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం కొలువు తీరే లోపే.. కీలకమైన ఎస్ఐబీలో రికార్డుల ధ్వంసం అనుమానాలకు తావిచ్చింది. దానిపై మొదలైన దర్యాప్తు.. చివరకు ట్యాపింగ్ విషయాన్ని ఆధారాలతో బయటపెట్టింది. మొదట్లో ప్రణీత్ రావు లాంటి నలుగురు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు. అయితే కేసు దర్యాప్తు ప్రాథమిక స్థాయిలోనే నిలిచిపోయింది. కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా పారిపోవడంతో.. వారిని రప్పించటానికి ప్రొసీజర్ తో కాస్త సమయం పట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఇండియా వచ్చిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును సిట్ విచారించింది. ప్రభాకర్ రావు విచారణలో దర్యాప్తు అధికారులే విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. మావోయిస్టుల పేరు చెప్పి ట్యాపింగ్ పర్మిషన్లు తీసుకున్నామని ప్రభాకర్ రావు చెప్పారు. అలాగే పై అధికారుల అనుమతితోనే చేశామని బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించారని అప్పటి ఉన్నతాధికారులు చెప్పడంతో.. కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకుండా.. సిట్ ను గందరగోళపరిచేలా, తప్పుదోవ పట్టించేలా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అధికారులు అనుమానిస్తున్నారు.
ట్యాపింగ్ కేసులో సిట్ మాజీ సీఎస్ శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్లను నమోదు చేసింది.ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5(2) ప్రకారం, ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ అనుమతితో పాటు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనుమతీ తప్పనిసరి. ట్యాపింగ్ చేయాల్సిన నెంబర్ల జాబితాను రివ్యూ కమిటీ పరిశీలించి, అనుమతిని కేంద్రానికి పంపిస్తుంది.అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రభాకర్ రావు నేతృత్వంలోని SIB విభాగం సుమారు 618 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ కోసం రివ్యూ కమిటీకి సమర్పించింది. అప్పట్లో సీఎస్‌గా ఉన్న శాంతి కుమారి DOTకి ఆ లిస్ట్ పంపి టెలికం అనుమతులు తీసుకున్నట్లు SIT దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అదే కేసులో అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్‌లకు ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేయగా, తాజాగా శాంతి కుమారి, రఘునందన్ రావులను స్వయంగా విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేసు మరింత లోతుగా సాగుతున్న దశలో, ఈ రెండు స్టేట్మెంట్లు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్యాపింగ్ వ్యవహారం చాలా విస్తృతంగా జరిగినట్టు తేలింది కాబట్టి.. సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇక్కడ నేతలతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో కనిపిస్తున్నారు.
దేశంలో కొన్నాళ్లుగా ట్యాపింగ్ పై చర్చ జరుగుతోంది. సంఘ విద్రోహ శక్తులు, వారితో లింకులున్న అనుమానితుల ఫోన్లు ట్యాప్ చేయడానికి పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగం ఉంటుంది. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారంలో ఉన్న పార్టీ నేతలు.. రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు కూడా ట్యాప్ చేయిస్తున్నారనే ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితమే ట్యాపింగ్ ఆరోపణలతో ఓ సీఎం పదవి ఊడిందంటే.. ట్యాపింగ్ చట్టవిరుద్ధమనే సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అయినా సరే అధికారంలో ఉన్నవాళ్లు ట్యాపింగ్ చేయడం మాత్రం మానలేదు. బయటపడినప్పుడు కదా సమస్య.. అప్పటి సంగతి చూసుకుందాం.. ముందు ట్యాపింగ్ చేసి రాజకీయ అడ్వాంటేజ్ పొందాలనే చూస్తున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు. అవకాశం వస్తే.. ఎవరైనా ట్యాపింగ్ చేయడానికి వెనుకాడరనే చర్చ గట్టిగా జరుగుతోంది. అంతెందుకు ఏకంగా కేంద్రమే పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి.. వందల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్, హ్యాకింగ్ చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. ఇలా పై నుంచి కింది స్థాయి వరకు రాజకీయ ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చట్టవిరుద్ధమని తెలిసినా.. లొసుగుల్ని వాడుకుని రెచ్చిపోతున్నారు. అడపాదడపా ఆరోపణలు వచ్చినా.. నిజాలు నిగ్గుతేల్చటం కష్టంగా మారుతోంది. ఇదే అదనుగా ట్యాపింగ్, హ్యాకింగ్ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారి ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్ చేస్తునట్టు 2022లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్స్ ట్యాప్ చేస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై, అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను సేకరించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష నేతలే కాదు.. సొంత నేతలపైనా నిఘా ఉండేదనే ఆరోపణలున్నాయి. ఇంటలిజెన్స్ విభాగంలో ఫోన్ ట్యాపింగ్ కు ఓ ప్రత్యేకమైన విభాగం ఉండేదని.. చెప్పేవారు. పదేళ్ల పాటు సాగిన ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా బయటకు లాగే ఉద్దేశంతో కనిపిస్తోంది. గత పదేళ్లలో తెలంగాణలో రాజకీయంగా చాల కీలక పరిణామాలు జరిగాయి. వీటన్నింటి వెనుక ట్యాపింగ్ ఉందని ఆధారాలు దొరికితే.. అవి తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. దేశంలోనే కొత్త చర్చకు దారితీయొచ్చు. పెగాసస్ స్పైవేర్ వాడుతున్నారనే అనుమానాలతో పార్లమెంట్ స్తంభించిపోయింది. అంతర్జాతీయంగా కలకలం రేగింది. అదే ట్యాపింగ్ నిజమేనని ఆధారాలతో సహా తేలితే ఎంతమంది పెద్దల బాగోతం బట్టబయలౌతుందో కూడా చూడాల్సి ఉంది. ప్రజలిచ్చిన అధికారంతో ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. అంతేకానీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే.. ఎప్పటికైనా ఫలితం అనుభవించక తప్పదు. ఎందుకంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఐదేళ్లకు కాకపోతే పదేళ్లకైనా, పదిహేనేళ్లకైనా పవర్ పోతుంది. మరో పార్టీ గద్దెనెక్కుతుంది. అప్పుడు గతంలో జరిగినవన్నీ వెలికితీస్తే.. ఇలాంటివి బయటపడతాయి. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగే అధికారులకు కూడా చిక్కులు తప్పవు. సర్వీస్ రూల్స్ ప్రకారం పనచేసినంత కాలం పెద్దగా ఇబ్బందులుండవు. మహా అయితే ఫ్యాన్సీ పోస్టింగులు దక్కకపోవచ్చు. కానీ కీ పోస్టింగులు, అనుచిత ప్రమోషన్ల కోసం కక్కుర్తిపడి.. చట్టవిరుద్ధమైన పనులు చేస్తే మాత్రం మొత్తం కెరీర్ కే ఫుల్ స్టాప్ పడొచ్చు. కోర్టులు కూడా ఇలాంటి పనులు చేసినప్పుడు నేతల కంటే అధికారులపైనే ఎక్కువ సీరియస్ అవుతున్నాయి. అన్నీ తెలిసీ.. చట్టాలు అతిక్రమించడాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సంఘ విద్రోహశక్తుల్ని నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నాయి. కానీ వాటిని సార్వజనీనం చేసి.. అధికార దుర్వినియోగం చేస్తే.. అది ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. ఏ ప్రజలైతే నమ్మి అధికారం అప్పగించారో.. అదే ప్రజలకు విశ్వాస ఘాతుకం చేసేలా ట్యాపింగ్, హ్యాకింగ్ లాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరం అవుతుంది. తెలంగాణలో ట్యాపింగ్ ఎపిసోడ్ కొలిక్కివస్తే.. ఎలాంటి భయంకరమైన నిజాలు వినాల్సి వస్తుందోనని సామాన్యులు భయపడుతున్నారు. పోలీస్ శాఖలో సీక్రెట్ ఆపరేషన్ల పేరుతో అసలేం జరుగుతుందనేది వెలుగుచూస్తే.. కొత్త సమస్యలు కూడా వస్తాయని సీనియర్ అధికారులు వాపోతున్నారు. ప్రణీత్ రావు లాంటి వాళ్లు ప్రభాకర్ రావు లాంటి వాళ్ల అండతో చేసిన చట్టవిరుద్ధమైన పనులు.. మొత్తం ఎస్ఐబీ నిబద్ధతపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఓ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు.. వ్యవస్థ మొత్తానికీ బాధ్యత వహించాలి. ఎస్ఐబీ లాంటి చోట పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే వ్యవస్థ ప్రతిష్ఠకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత సమర్థులైన, ఇంటిగ్రిటీ ఉన్న సిన్సియర్ అధికారులకే ఎస్ఐబీలో పోస్టింగ్ ఇస్తారు. కానీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఇచ్చే అనుచిత పోస్టింగులు, అనుచిత ప్రమోషన్లే చట్టవిరుద్ధమైన పనులకు దారితీస్తున్నాయి. ఇలాంటివాటికి ఎక్కడోచోట అడ్డుకట్ట పడకపోతే.. వ్యవస్థ మరింత వేగంగా పతనమయ్యే అవకాశాలుంటాయి.
తెలంగాణ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ.. ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరికీ సీక్రెసీ లేదని తేలిపోయింది. రాష్ట్రంలో ఎవరు ఫోన్ మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి తెచ్చారు. ట్యాపింగ్ పేరుతో కొందరు అధికారులు, మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు ఓ గ్రూప్ గా ఏర్పడి నడిపిన వ్యవహారం.. అందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్యాపింగ్ కేసులో మొదట ఎస్ఐబీ అధికారుల పేర్లు వెలుగుచూశాయి. తర్వాత పోలీసుల పేర్లు వచ్చాయి. సరే ఎంతోకొంత లింక్ ఉంటుంది కదా అని సరిపెట్టుకున్నారు. ఇక్కడదాకా ట్యాపింగ్ ను దుర్వినియోగం చేశారనే కోణమే ఉంది. అధికార దుర్వినియోగమూ జరిగిందని నిగ్గుతేలింది. కానీ ఇక్కడ్నుంచీ ట్యాపింగ్ కథ ప్రమాదకర మలుపు తిరిగింది. ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వమే చేయాల్సిన పని కాకుండా.. చేయకూడని పని చేసిందని మొత్తుకుంటుంటే.. మధ్యలో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తుల ప్రస్తావన రావడం, వారిచ్చిన సమాచారం ఆధారంగా ట్యాపింగ్ జరిగిందన్న సమాచారం మరిన్ని భయాలకు తావిస్తోంది.
దేశంలో ట్యాపింగ్ జరగడం కొత్తేం కాదు. కానీ అత్యవసర సందర్భాల్లో, దేశభద్రత ప్రమాదంలో పడ్డప్పుడు కొందరి వ్యక్తుల వివరాలు కేంద్రానికి పంపి.. అనుమతులు పొంది అధికారికంగా ట్యాపింగ్ చేయొచ్చు. అలాగే ప్రభుత్వాలు కూడా పరిమిత స్థాయిలో అనధికారిక ట్యాపింగ్ చేస్తాయి. ఈ సంగతి పక్కనపెడితే తెలంగాణలో జరిగినంత విస్తృత స్థాయిలో అన్ని వ్యవస్థల్నీ ప్రభావితం చేసేలా జరిగిన విశృంఖల ట్యాపింగ్ మాత్రం ఇంతవరకూ కనీవినీ ఎరుగనిది. అసలు ఇలాంటి ట్యాపింగ్ ఇంతవరకూ జరగలేదనే చెప్పాలి. జీవితంలో ఎప్పుడూ ట్యాపింగ్ పేరుకూడా వినని వ్యక్తులు అనూహ్యంగా ట్యాపింగ్ ను సొంతానికి వాడుకున్నారు. అదేదో మనుషుల్ని కిడ్నాప్ చేసి కుటుంబసభ్యుల్ని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా.. ఎవరి వాయిస్ కాల్స్ వారికే వినిపించి పెద్దమొత్తంలో డబ్బు గుంజటం.. నయా దారిదోపిడీ అని చెప్పకతప్పదు. ఓ రకంగా బ్లాక్ మెయిలింగ్ కు ట్యాపింగ్ నిందితులు కొత్త కోణాన్ని జత చేశారనే చెప్పాలి. అసలు ట్యాపింగ్ ఇంత తెలికగా చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఓ రకంగా ట్యాపింగ్ నిందితులు రాష్ట్రం పరువు తీశారు.
ప్రస్తుతం ట్యాపింగ్ కేసును సిట్ విచారిస్తోంది. అయితే ఈ కేసు సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. కేసు పరిధి, జరిగిన బాగోతం గురించి తెలుస్తున్నకొద్దీ.. కేంద్ర దర్యాప్తు సంస్థను రంగంలోకి దించడం ఎందుకైనా మంచిదనే భావన బలపడుతోంది. పైగా పోలీసులు ఇన్వాల్వ్ అయిన కేసు కాబట్టి.. సీబీఐ అయితేనే ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయగలుగుతుందనే అభిప్రాయాలున్నాయి.
ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. మరిన్ని సంచలన కోణాలు కూడా బయటపడొచ్చు. ఇది మరింత సంక్లిష్టంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తోంది. కానీ నిజానిజాలు నిగ్గుతేలాలంటే ట్యాపింగ్ వ్యవహారం సీబీఐకి అప్పగించాల్సిందేననే డిమాండ్లు వస్తున్నాయి. ట్యాపింగ్ కేసు ఛేదించింది మన పోలీసులే అయినా.. నిజానిజాలు నిగ్గుతేలాలంటే, అసలు మూలాలు బయటకు రావాలంటే సీబీఐకి ఇవ్వడమే సబబు. లేకపోతే ఇప్పటిదాకా పోలీసులు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యే ప్రమాదం ఉంది. సీబీఐకి ఉండే వ్యవస్థ, టెక్నాలజీ, సాధనసంపత్తి వేరు. అందుకే ఇలాంటి కేసులు సీబీఐకి ఇస్తేనే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ట్యాపింగ్ కేసు ఏదో తేలిగ్గా తీసిపారేసే వ్యవహారం కాదు. చాలా సంక్లిష్టమైనది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ట్యాప్ చేసిన సమాచారం అంతా కూడా లేదు. కొంత సమాచారం ధ్వంసమైంది. ఇదంతా అంతే ఈజీగా దర్యాప్తు చేసే వ్యవహారం కాదు. అందుకే సీబీఐకి ఇస్తేనే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ట్యాపింగ్ పేరుతో ఎంతమంది కాల్స్ విన్నారో.. అందులో ఎంతమంది ప్రైవేట్, పర్సనల్ సీక్రెట్లు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశారో.. అన్నీ లెక్కతేలేసరికి.. ఛార్జ్ షీట్ రాయటానికి ఎన్ని వందల పేజీలు కావాలో కూడా ఊహకు అందడం లేదు. ఇక్కట ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే.. ఏదో పరిమితమైన లక్ష్యం కనిపించడం లేదు. ఛాన్స్ దొరికిందే తడవుగా ఎవరెవరి కాల్స్ అయినా వినేయడం.. దొరికిన సమాచారం ఆధారంగా కొత్త టార్గెట్లు, కొత్తగా బ్లాక్ మెయిళ్లు చేసి.. ట్యాపింగ్ పరిధిని ఎప్పటికప్పుడు విస్తృతం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మరో దారుణం ఏమిటంటే.. కేవలం ప్రభాకర్ రావు చెప్పిన వ్యక్తుల్నే ట్యాప్ చేయలేదనే సందేహాలు కూడా వస్తున్నాయి. ట్యాపింగ్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయిన అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు.. తమ తమ సొంత టార్గెట్లను ఎంచుకుని కూడా ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే దేన్నీ కాదనడానికి లేదు. ఏ అవకాశాన్నీ కొట్టిపారేసే పరిస్థితి రాలేదు. ఇక ట్యాపింగ్ కేసులో నిందితుల వ్యవహారశైలి కూడా సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే.. నిందితులు ఇంకేం తెలివితేటలు ప్రదర్శిస్తారో తేలే అవకాశం ఉంది.
ఇక్కడ ట్యాపింగ్ ఏదో పొరపాటునో గ్రహపాటునో జరగలేదు. ఉద్దేశపూర్వకంగా.. కుట్రపూరితంగా కొందర్ని టార్గెట్ చేసి వేధించారు. ఎవరికీ ప్రైవేట్ లైఫ్ లేకుండా చేశారు. వ్యక్తిగత జీవితాల్ని నడి బజార్లో పడేశారు. ట్యాపింగ్ పేరుతో వ్యవస్థీకృత నెట్ వర్క్ నడిచింది. ఎస్ఐబీకి ఉన్న యంత్రాంగం చాలదన్నట్టు ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఆఫీసుల్ని వాడుకోవడం చూస్తుంటే.. జరిగిన నేరం తీవ్రమైనేద కాదు హేయమైనదని చెప్పకతప్పదు. మామూలుగానే సర్వర్ రూమ్ లో ఆథరైజ్డ్ వ్యక్తులకే ప్రవేశం ఉంటుంది. ప్రభుత్వ సర్వర్లు అయితే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండాలి. ఎందుకంటే వాటిలో రాష్ట్ర పౌరులందరి సమాచారం ఉంటుంది. అలాంటిది కీలకమైన ట్యాపింగ్ సర్వర్ ను తీసుకెళ్లి ప్రైవేట్ ఆఫీస్ లో పెట్టారు. సాధారణంగా ట్యాపింగ్ సర్వర్ ను ఎస్ఐబీలో కూడా ప్రత్యేక విభాగం ఆధీనంలో ఉంచుతారు. అలాంటిది ఎస్ఐబీ పరిధి దాటి.. ఏకంగా పోలీస్ శాఖకు కూడా సంబంధం లేని చోట.. ఎలాంటి రక్షణ లేని ఓ ప్రైవేట్ ఆఫీస్ పెట్టారంటే.. ఇంతకంటే లెక్కలేనితనం, బాధ్యతారాహిత్యం ఇంకేం ఉంటుందనే చర్చ జరుగుతోంది.
అసలు పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి ప్రైవేట్ వారిని ఎలా అలో చేస్తారు..? ప్రభాకర్ రావు అనే అధికారి ప్రైవేట్ వ్యక్తులతో ఓ ముఠాగా ఏర్పడి.. దాని సహకారంతో ఎస్ఐబీలో ట్యాపింగ్ వింగ్ ని నడిపారంటే.. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది. సర్కారుకి ఓత్ ఆఫ్ సీక్రెసీ ఉంటుంది. అధికారులు కూడా రాజ్యాంగబద్ధంగానే విధులు నిర్వహించాలి. కానీ ఇక్కడ అన్ని నిబంధనలకు తిలోదకాలివ్వడమే కాదు.. ఏకంగా రాష్ట్ర ప్రజల జీవితాల్నే ప్రమాదంలో పడేసేంత పని జరిగింది. ఇదేం చిన్న విషయం కాదు. అసలు ఓ ప్రైవేట్ వ్యక్తి చేతికి.. ప్రభుత్వ యంత్రాంగం వెళ్లడమంటే ఏం జరుగుతుందో ఊహించడానికే భయంగా ఉంది. ట్యాపింగ్ కేసులో ప్రస్తుతానికి కొన్ని సంచలన విషయాలే బయటికొచ్చాయి. ఇంకేం బయటపడతాయో చూడాల్సి ఉంది. ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ప్రభుత్వ యంత్రాంగాలు, ప్రైవేట్ ఆఫీసుల్లోకి సర్కారీ సర్వర్లు వెళ్లిపోతే రేపు ఏం జరిగినా ఎవరు జవాబుదారీ లేకుండా పోయే అవకాశం ఉంది. ఇదేదో కేవలం ట్యాపింగ్ కు పరిమితమైన అంశంగా చూడకూడదు. ఇలాగే వదిలేస్తే.. రేపు ఏ డిపార్ట్ మెంట్ ఏం చేస్తుందో ఊహించడం కూడా కష్టమే.
ఉద్దేశం మంచిదైనప్పుడు ఏం చేసినా తప్పు కాదనే కాన్సెప్ట్ కరెక్టే. కానీ ఉద్దేశాలు చెడ్డవి అయినప్పుడే చిక్కులొస్తాయి. పైగా అలాంటి ఉద్దేశాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం.. ఇది చాలదన్నట్టుగా ప్రైవట్ వ్యక్తుల్ని వ్యవస్థలోకి తీసుకురావడం.. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం.. ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడ్డ చోద్యం. పోలీస్ శాఖ అంటే క్రమశిక్షణకు మారు పేరు. ఇక ఎస్ఐబీ ఎలా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎస్ఐబీలో ఏం జరుగుతుందో ఆ వింగ్ కు తప్ప తోటి పోలీసులకు కూడా తెలిసే అవకాశం లేదు. తెలియనివ్వరు కూడా. అలాంటిది ట్యాపింగ్ సర్వర్ తీసుకెళ్లి ప్రైవేట్ ఆఫీస్ లో పెట్టడమే కాకుండా.. శ్రవణ్ రావు అనే ప్రైవేట్ వ్యక్తి చెప్పినట్టుగా ట్యాపింగ్ జరిగిందంటే.. దీనికి కొత్త పేరు పెట్టాల్సిందే. అధికార దుర్వినియోగం, బాధ్యతారాహిత్యం లాంటి పదాల స్థాయి జరిగిన వ్యవహారం ముందు చాలా చిన్నదనే చెప్పాలి.
ట్యాపింగ్ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండటం.. కొత్త భయాలకు తావిస్తోంది. ప్రభుత్వ అధికారులకు సర్వీస్ రూల్స్ ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. రూల్స్ బ్రేక్ చేసినా.. ఎక్కడోచోట పట్టుబడే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి రూల్స్ ఉండవు. వారు నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన అవసరం లేదు. అసలు రూల్ ఆఫ్ లా ఏంటో వీరికి తెలుసా అనేది కూడా పెద్ద ప్రశ్నే. ప్రస్తుతానికి ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉందని మాత్రమే తేలింది.. కానీ ఆ విషయంలో మరింత లోతైన విచారణ జరగాల్సి ఉంది. ఇప్పుడు కేసు సీబీఐకి వెళ్తే.. ఎవరి మెడకు చుట్టుకుంటుది.. ప్రైవేట్ సైన్యాన్ని సీబీఐ ఎలా ట్యాకిల్ చేస్తుంది అనేవి కూడా ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు. ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్లు మొదలయ్యాయి. ఇంకా దర్యాప్తు ముందుకెళ్లేకొద్దీ ఈ డిమాండ్లు ఇంకా ఉధృతమయ్యే అవకాశాలున్నాయి. పైగా పోలీస్ శాఖకు అనుబంధంగా ఉండే ఎస్ఐబీ ఇన్వాల్వ్ కావడం.. ఏకంగా పోలీస్ ఉన్నతాధికారులే ప్రైవేట్ సైన్యాన్ని హైర్ చేయడం లాంటి చర్యలు.. సీబీఐ దర్యాప్తుకు మార్గం సుగమం చేస్తున్నాయి.
అసలు సామాన్యుల ఫోన్ ట్యాప్ చేయడమే నేరం. అదే పని చేయకూడని వ్యక్తి చేస్తే ఘోరం. ఇక్కడ ట్యాపింగ్ కోసం ప్రైవేట్ సైన్యం ఏర్పాటు అరాచకానికి పరాకాష్ట. ఇక ఈ ప్రైవేట్ సైన్యం ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని చేసిన బ్లాక్ మెయిళ్లు, వసూళ్లు అదో పెద్ద గ్రంథమే అవుతుంది. ఇంత తతంగాన్ని సీబీఐ అయితే రాష్ట్ర స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గకుండా దర్యాప్తు చేసి.. మరిన్ని నిజాలు బయటపెడుతుందనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో ట్యాపింగ్ కంటే అది జరిగిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. ఈ స్థాయిలో విచ్చలవిడి ట్యాపింగ్ గతంలో ఎప్పుడూ జరగలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సహజంగా అభివృద్ధి పనుల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ ఉంటుంది. కానీ ఇక్కడ ట్యాపింగ్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ ఉపయోగించడాన్ని చూసి.. కొమ్ములు తిరిగిన నిపుణులే విస్తుబోతున్నారు.
తెలంగాణలో ట్యాపింగ్ వ్యవహారం బయటపడ్డప్పట్నుంచీ వినిపిస్తున్న పేరు ఎస్ఐబీ. ఎస్ఐబీ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. పోలీస్ డిపార్ట్మెంట్ లో SIB అనే వింగ్ నక్సల్స్, టెర్రరిస్ట్ ల ఆగడాలను అడ్డుకోడానికి పెట్టింది. అలాంటి వింగ్ ని కేవలం ట్యాపింగ్ కోసం మాత్రమే వినియోగించడం అప్పటి ప్రభుత్వ అరాచకానికి అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సంఘ విద్రోహశక్తుల్ని నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నాయి. కానీ వాటిని సార్వజనీనం చేసి.. అధికార దుర్వినియోగం చేస్తే.. అది ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. ఏ ప్రజలైతే నమ్మి అధికారం అప్పగించారో.. అదే ప్రజలకు విశ్వాస ఘాతుకం చేసేలా ట్యాపింగ్, హ్యాకింగ్ లాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరం అవుతుంది.
సమాజ హితం కోసం కొన్ని వ్యవస్థలుంటాయి. ప్రజల రక్షణ కోసం మరికొన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా సృష్టిస్తారు. ప్రత్యేక అవసరాల కోసం కొన్ని వ్యవస్థలకు విశేష అధికారాలిస్తారు. వీటన్నింటి వెనుక ప్రధాన ఉద్దేశం శాంతిభద్రతలు కాపాడటమే. సమస్యలు వచ్చాక పరిష్కరించడం ఓ ఎత్తైతే.. అసలు సమస్య రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో సమస్య రాకుండా చూడటానికే ఎక్కువగా తాపత్రయపడుతున్నాయి. అందులో భాగంగానే పోలీస్ శాఖకు అనుబంధంగా కొన్ని ప్రత్యేక వ్యవస్థలకు రూపకల్పన చేశాయి. శాంతిభద్రతల విధులతో తలమునకలుగా ఉండే సాధారణ పోలీసులతో పని కాదనే.. ఎస్ఐబీ పేరుతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను ఏర్పాటు చేసి.. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే ట్యాపింగ్ కూడా చేస్తారు.
కానీ ఇక్కడ ఎస్ఐబీ ఏర్పాటుచేసిన అసలు లక్ష్యాన్ని ఎప్పుడో నీరుగార్చేశారు. సంబంధం లేని పనులకు ఎస్ఐబీని వాడుతూ దాని స్థాయిని దిగజార్చారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి.. గ్రేహౌండ్స్ తో మంచి సమన్వయం చేసుకుని.. మావోయిస్టుల ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించడంలో ఎస్ఐబీది కీలకపాత్ర. అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఎంత సమర్థత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి ఎస్ఐబీని తక్కువ స్థాయి పనులకు వాడటం.. దాని స్థాయి తగ్గించడమే కాదు.. ప్రభుత్వ వనరుల్ని వృథా చేయడమే. ఈ ట్యాపింగ్ తంతు జరిగే సమయంలో.. ఎలాంటి విద్రోహ చర్యలు జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రైవేట్ సైన్యం టార్గెటెడ్ ట్యాపింగ్ లో బిజీగా ఉన్నప్పుడు సంఘ విద్రోహుల కీలక సమచారం మిస్సై.. జరగరానిది జరిగి ఉంటే.. ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నే అందర్నీ భయపెడుతోంది.
ట్యాపింగ్ అనేది చిన్న విషయం కానే కాదు. నాకు తెలియదు అని ఎవరూ తప్పించుకోలేరు. ఇదేదో పొరపాటున జరిగిందనటం కంటే పెద్ద అబద్ధం మరొకటి ఉండదు. అంతా పక్కా స్కెచ్ ప్రకారం.. కొంతమంది ఉద్దేశాలు నెరవేర్చడం కోసం.. కొందరి కనుసన్నల్లో.. కొందరు ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో జరిగింది. ప్రజల భద్రతను పణంగా పెట్టి.. సర్కారీ యంత్రాంగం నిబద్ధతను ప్రశ్నార్థకం చేసి.. అతి రహస్యంగా ఉండాల్సిన సమచారాన్ని ఎవరికి పడితే వారికి పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. అసలింత వ్యవస్థీకృత ట్యాపింగ్ దేశంలో ఇదివరకు ఎక్కడైనా జరిగిందా.. ఇది స్పెషల్ కేసా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏకంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో జోక్యం ఉన్న ట్యాపింగ్ నేరం అంటే.. దాని తీవ్రత ఊహించినదాని కంటే ఎన్నో రెట్లు పెద్దది అనడంలో సందేహం లేదు. అందుకే ఇంత తీవ్రమైన సంక్లిష్టమైన కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
మావోయిస్టులు, టెర్రరిస్టుల ఫోన్లు ట్యాప్ చేయడం ఓ పద్ధతి. లేకపోతే ఎవరిపై అయినా అనుమానం ఉంటే.. అవసరమైన అనుమతులు తీసుకుని ట్యాపింగ్ చేయొచ్చు.అంతే కానీ సెలబ్రిటీల దగ్గర్నుంచీ సామాన్యుల వరకూ ర్యాండమ్ గా ఫోన్లు ట్యాపింగ్ చేయడం.. పర్సనల్ వ్యవహారాలు విని.. వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడటం.. వ్యవస్థీకృత నేరం కంటే తక్కువా అనేది అసలు ప్రశ్న. డ్రగ్స్ నెట్ వర్క్, మాఫియా నెట్ వర్క్ తరహాలో ట్యాపింగ్ నెట్ వర్క్ పనిచేసిందనే విషయం అందర్నీ భయపెడుతోంది. ఇదేదో హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన వ్యవహారం కూడా కాదు.జిల్లాలకూ ట్యాపింగ్ భూతం విస్తరించిందన్న కోణం మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ట్యాపింగ్ ను ఎన్నిరకాలుగా వాడకూడదో.. అన్నిరకాలుగా ఉపయోగించారని విచారణలో తేలుతోంది.
ట్యాపింగ్ పేరుతో ఫోన్ కాల్స్ వింటే అంత కొంపలు మునిగిపోతాయా అనుకోవడానికి లేదు. ఈరోజుల్లో ఒకరి ఫోన్ కాల్స్ వింటేచాలు.. వారి జీవితంపై ఓ అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో వారి జీవితాన్ని తమకు తోచినట్టుగా ఆడించారు ట్యాపింగ్ నిందుతులు. వ్యాపారుల్ని బెదిరించి నచ్చిన పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుని చేయకూడని పనులు చేయించారు. రియల్టర్లను టార్గెట్ చేసి వసూళ్లు చేశారు. చివరకు నగల దుకాణాల యజమానుల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు నొక్కేశారు. ఇలా ఒకటేంటి.. కావల్సినన్ని పద్ధతుల్లో ఇల్లీగల్ దందా చేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే నాలుగు కోట్ల మంది జీవితాలపై 50 మంది సభ్యుల ముఠా డేగకన్ను వేసింది.అందరి కదలికలు, లావాదేవీలు గమనించింది. సందు దొరికితే బెదిరించడం కాదు. సందు చేసుకుని మరీ బ్లాక్ మెయిల్ చేసి టార్చర్ చేశారు.
ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసిన తరుణంలో..ట్యాపింగ్ ను వాడి.. ఎన్నో ఎలక్టోరల్ బాండ్లు ఇప్పించారని దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. వ్యాపారంలో సవాలక్ష వ్యవహారాలుంటాయి. తోటి వ్యాపారితో కష్టం సుఖం చెప్పుకుంటే బుక్కైపోయినట్టే. డైరక్టుగా మాట్లాడటం రిస్కని..ఫోన్ చేశారా.. ఇక వ్యాపారం రోడ్డునపడ్డట్టే. ఇలా వెంటాడి వేధించారు ట్యాపింగ్ నిందితులు. వీరి బాధలు పడలేక వన్ టైమ్ సెటిల్మెంట్ కు బేరం మాట్లాడుకున్నవారు కూడా ఉన్నారనే వాదన వినిపిస్తోంది. మరికొంతమంది ఇంకాస్త డబ్బిచ్చి.. వ్యాపార ప్రత్యర్థులపై ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించారని కూడా చెబుతున్నారు.
సినిమాలు, వ్యాపారాలు, భూ లావాదేవీలు, బంగారం కొనుగోళ్లు.. ఇలా ఒకటేంటి కాస్త డబ్బులు కనిపించే ఏ రంగాన్నీ ట్యాపింగ్ భూతం వదల్లేదు. గత కొన్నాళ్లుగా అనూహ్యంగా జరిగిన పరిణామాల్నే కాదు.. సహజంగా జరిగినట్టుగా కనిపించిన ప్రతి లావాదేవీని అనుమానించాల్సిన పరిస్థితి తలెత్తింది. విన్న ఫోన్ కాల్స్.. బెదిరింపులకు వాడిన ఆడియోలు.. ఇవన్నీ ఎలా చూడాలి.. ఎక్కడ వినాలి.. వీటిని ఏఏ ఘటనలతో లింక్ చేయాలనేది పెద్ద చిక్కు ప్రశ్న. ఇంత సంక్లిష్టమైన కేసును సాధారణ దర్యాప్తుతో తేల్చగలరా అనేది పెద్ద ప్రశ్న. అందుకే ఇప్పటిదాకా దేశంలో అడపాదడపా జరిగిన ట్యాపింగ్ ఓ లెక్క. ఇప్పుడు తెలంగాణలో జరిగిన ట్యాపింగ్ మరో లెక్క అనే చర్చ జరుగుతోంది.
ట్యాపింగ్ చేసేవాడే మొనగాడు అన్నట్టుగా.. ఊరూపేరూ లేని వ్యక్తుల్ని ప్రముఖుల్ని బెదిరించారు. కేవలం ఫోన్ కాల్స్ ఆడియో వినిపించి బతుకు రోడ్డున పడేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. సమాజంలో పేరుప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు బెదిరిపోయారు. అడిగినంత ముట్టజెప్పారు. కొందరు సామాన్యులైతే నిస్సహాయస్థితిలో ఆత్మహత్యలు చేసుకున్నారనే అనుమానాలూ లేకపోలేదు. సమాజంలో కింది స్థాయి నుంచి పై వరకు.. అన్ని వర్గాలనూ టచ్ చేస్తూ ఇంత వ్యవస్థీకృతంగా జరిగిన ట్యాపింగ్ నిగ్గు తేలాలంటే.. సీబీఐ లాంటి సంస్థ వల్లే అవుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీనికి తోడు ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు పోలీసుల్ని బెదిరించే ప్రయత్నం చేయడం, దర్యాప్తు అధికారుల్ని దబాయించడం, చాలా ప్రశ్నలకు బుకాయింపే సమాధానం కావడాన్న సీరియస్ గా తీసుకోవాల్సిందే. కేసును మరింత సంక్లిష్టం చేసే ఉద్దేశంతో కనిపిస్తున్న ప్రభాకర్ రావు లాంటి వారి ఆట కట్టించడం సీబీఐకే సాధ్యం అనడంలో సందేహం లేదు.