తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూలేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాలా చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో, లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి, మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు. నిజాయితీగా ప్రజల జీవితాలు బాగుచెయ్యడానికి, వారీ జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం, అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలను చెప్పడం లేదు. కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ అగ్నిగుండం, తెలంగాణలో రెడ్డి వర్సెస్ వెలమ వాడివేడి చర్చ, రచ్చరచ్చ అవుతోంది.
పచ్చని కోనసీమ. అమాయక జనం. శాంతిభద్రతలు చల్లగా వుండే ప్రాంతం. కానీ ఒక్కసారిగా ఈ అందాల ప్రదేశం అగ్నిగుండమైంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో నిరసనకారులు భగ్గుమన్నారు. అమలాపురం పట్టణం ధ్వంసమైంది. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులను తగులబెట్టారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ఇళ్లను తగులబెట్టడం ఆశ్చర్యమే కాదు, ఆందోళన కలిగిస్తున్నాయి. సమయానికి ఫైర్ ఇంజన్లు రాలేదు. పోలీసులు కూడా చేతులెత్తేయడంతో… అమలాపురంలో పరిస్థితులు అదుపు తప్పాయి. ఎస్సీ, డీఎస్పీతో పాటు చాలామంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
మరోవైపు పేరు మార్చే వరకు వెనక్కి తగ్గేది లేదంటోంది కోనసీమ సాధన సమితి. పేరు మార్చడానికి వీల్లేదంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమితి హెచ్చరిస్తోంది. ప్రభుత్వం కూడా జిల్లా పేరు మార్చే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.
ఇక జిల్లా పేరు మార్పు అంశం రాజకీయంగానూ కాక రేపుతోంది. ఈ నిరసనల వెనుక విపక్షాలే కాకుండా, సంఘ విద్రోహ శక్తులున్నాయని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. అయితే ప్రభుత్వం, పోలీసుల వైఫల్యాన్ని ప్రతిపక్షాలకు అంటగట్టడం ఏమిటని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యమే కోనసీమలో హింసాత్మక ఘటనలకు కారణమని విమర్శిస్తున్నారు. .
ఆంధ్రప్రదేశ్ లో కుల కుంపట్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాజకీయ పక్షాలు ఎత్తుగడలు వేస్తుంటే, ఇటు తెలంగాణ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. రెడ్డి వర్సెస్ వెలమ అన్నట్టుగా పొలిటికల్ వెదర్ ను మార్చేశారు. కర్ణాటకలో జరిగిన రెడ్ల సంక్షేమ సంఘం సమావేశంలో వెలమలు..రెడ్ల మధ్య వైరాన్ని ప్రస్తావిస్తూ కీలకమైన కామెంట్స్ చేశారు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది.
కుల సమీకరణలు, పోలరైజేషన్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు పాకులాడుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. కుల పునాదులపై అధికార పీఠం ఎక్కాలన్న వ్యూహం కనిపిస్తోందన్న విశ్లేషణ జరుగుతోంది. కానీ పోలరైజేషన్ తో ఓట్లు పడవు. క్యాస్ట్ ఈక్వేషన్స్ తో అధికారంలోకి వచ్చిన ఉదంతాల్లేవు. వ్యక్తిగత చరిష్మా, భాష, ప్రాంతం, పథకాలతోనే పవర్ లోకి వచ్చిన సందర్భాలే అధికం. ఎన్టీఆర్, కులాలకు అతీతమైన నాయకుడు. ఆయన మీద అభిమానం ఓట్ల రూపంలో ప్రభంజనమైంది. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కులాలతో సంబంధం లేకుండా, జనాల గుండెల్లో స్థానం సంపాదించారు. పార్టీని రెండుసార్లు గెలిపించారు. అలాగని కులం ఓట్లు రాల్చదని కాదు. కేవలం కొంతవరకే. సొంత కులం జనాలు ఓట్లేసినా, అధికారంలోకి రావాలంటే, మిగతా కులాలు కూడా మద్దతు పలకాల్సిందే. ఎన్టీఆర్, వైఎస్ ల విజయాలకు అదే కారణం. బైట్…విశ్లేషకులు
బీహార్, యూపీ తరహాలో వున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో లేదు. అక్కడ రాజకీయాలను సామాజిక సమీకరణలే శాసిస్తాయి. యూపీ, బీహార్ తరహాలోనే సంకుల సమరంలాంటి వ్యూహాలను, కొందరు రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగిద్దామని అనుకుంటున్నారని అర్థమవుతోంది. అందుకే ఈమధ్య కులాలపై చర్చ విపరీతంగా జరుగుతోంది. అది కొన్నిసార్లు హద్దు దాటుతోంది. భావోద్వేగాలను మండిస్తోంది. విధ్వంసాలకు ఉసిగొల్పుతోంది. ఈ విపరీత పోకడే ఆందోళన కలిగిస్తోంది.
పచ్చని ప్రక్రుతికి నెలవు కోనసీమ. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన అఖండ గోదావరి నది పాయలుగా ప్రవహిస్తుంది. గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయల మధ్య ప్రాంతాన్ని కోనసీమగా పిలుచుకుంటారు. మూడు వైపులా గోదావరి హోరు, మరోవైపు బంగాళాఖాతంతో ఓ దీవిలాగ కనిపిస్తుంది కోనసీమ. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని ఎన్నికల వాగ్దానాన్ని అమలు పరిచేలా, రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. కోనసీమకు రకరకాల పేర్లు ప్రతిపాదనలోకి వచ్చాయి. కోనసీమే కావాలని కొందరు డిమాండ్ చేశారు. డొక్కా సీతమ్మ వంటి వారి పేర్లు పెట్టాలనే మరికొందరు చెప్పారు. అంబేద్కర్ పేరు పెట్టాలని ముందు నుంచి కొందరు బలంగా డిమాండ్ చేశారు. అయినా కోనసీమ జిల్లాగానే పేరు పెడుతూ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది.
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఉగాది నుంచి పాలన ప్రారంభమైంది. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నుంచి డిమాండ్ వినిపించింది. ఇందుకు దళిత నాయకులు అనేక కారణాలు చెబుతున్నారు. బలీయమైన సంఖ్యలో వున్నాం కాబట్టి, రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
2011 జనాభా లెక్కల ప్రకారం 18 లక్షల మంది జనాభాతో ఏర్పడిన ఈ జిల్లాలో ఎస్సీల పాపులేషన్ సుమారుగా 5 లక్షలు. దాదాపుగా ఇదే సంఖ్యలో కాపు, ఆ తర్వాత శెట్టిబలిజలతో పాటుగా మత్స్యకార కులాలకు చెందిన బీసీలుంటారు. జనాభా దాదాపు సమానంగా వుండటంతో, ఆర్థికంగా, రాజకీయంగా ఆధిపత్యం కోసం ఆయా కులాల మధ్య దశాబ్దాలుగా సాగుతోంది. గతంలో అనేక హింసాత్మక ఘర్షణలకు దారి తీసింది. స్కూల్, కాలేజీ, పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థుల మధ్య ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు కూడా పెద్ద గొడవలకు దారి తీశాయి. ఎనిమిదేళ్ల క్రితం అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చెయ్యడం పెను దుమారం రేపింది. ఇప్పుడు ఏకంగా జిల్లాకే అంబేద్కర్ పేరు పెట్టడంతో కొన్ని వర్గాలు నిరసనలకు దిగాయి.
అమలాపురం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని కుల సంఘాలే కాదు, రాజకీయ పార్టీలు కూడా నినదించాయి. జనసేన పార్టీ నేరుగా దీక్షలకు దిగింది. అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంకి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం వెళ్లినప్పుడు, అక్కడ స్థానిక నేతలు జిల్లా పేరు మార్పు అంశాన్ని ఆయన దగ్గర ప్రస్తావించారు. దీంతో ఆయన కూడా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇలా అందరి వినతులూ పరిగణలోకి తీసుకున్న జగన్ సర్కారు, అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంతో దళిత సంఘాలు, వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లాలో ఏదో ఒక చోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. హఠాత్తుగా పేరు మార్చడంలో ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదని మరో వర్గం అంటోంది. అంబేడ్కర్ పేరు కావాలంటే ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఖాయం చేసిన పేరు మార్చడం ఎవరికీ ఇష్టం లేదంటూ ఆజాద్ యూత్ అసోసియేషన్ నేతలంటున్నారు.
అయితే, కొన్ని రోజుల నుంచి కోనసీమలో కుల వివాదాలు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. ఇటీవల మంత్రి వేణుగోపాలకృష్ణ తీరు మీద శెట్టిబలిజ కులస్తులు ఆందోళనకు దిగారు. మరో మంత్రి విశ్వరూప్ వైఖరిపై ఆయన సొంత కులస్తులే అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటనలు. ప్రస్తుత ఆందోళనల వెనుక ఈ రాజకీయ విభేదాల ప్రభావం కూడా వుండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.
అంబేద్కర్ పేరుపై కోనసీమలో ఇంతగా చిచ్చురగలడం నిజంగా దురద్రుష్టకరం. ఆయనను ఇంకా ఒక కులానికో, ప్రాంతానికో పరిమితం చెయ్యడం బాధాకరం. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ప్రపంచ మేధావి. కేవలం దళితుల కోసమే పోరాడలేదు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఓసీలు, ఇలా అన్ని కులాల్లోని పేదల కోసం తపించారు. వారి జీవితాల్లో గుణాత్మకమైన మార్పును ఆశించారు. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను వడబోసి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పుడు హక్కులను అనుభవిస్తున్నామంటే, అంబేద్కరే దార్శనికతే కారణం. మహిళల పురోగతే, దేశ నిజమైన పురోగతి అని ప్రకటించిన దార్శనికుడు అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ ను ఒక ప్రాంతానికి, కులానికే పరిమితం చేసి చూడటం, మధ్యయుగాల నాటి మనస్తత్వాలకు నిదర్శనమే వారూ వున్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అంబేడ్కర్ పేరుతో జిల్లాలున్నాయి. అనేక కాలనీలు, నగరాలు, ఊళ్లకు అంబేద్కర్ పేరుంది. వివిధ ఉన్నత సంస్థలు ఆయన పేరు పెట్టుకున్నాయి. కానీ, కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన పెను వివాదంగా మారింది. అంబేద్కర్ అంటే తమకు ఎలాంటి ద్వేషం లేదంటున్న కోనసీమ జిల్లా సాధన సమితి నేతలు, ఈ ప్రాంతం అస్తిత్వానికి ప్రతిబింబమైన కోనసీమ పేరును మళ్లీ ఎందుకు మార్చారని ప్రశ్నిస్తున్నారు.
అయితే, కులాల గొడవలో రాజకీయ పార్టీల లెక్కలు వేరే వున్నాయి. అందరి ముందు కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని చెబుతున్నా, లోలోపల మాత్రం ఆందోళనాకారులను ఎగదోస్తున్నది పార్టీలేనని కొందరు విమర్శిస్తున్నారు. అధికార వైసీపీకి ఎలాగూ దళితుల బలమైన ఓటు బ్యాంకు. అటువంటప్పుడు మిగతా కులాలను తమవైపు తిప్పుకునేందుకు, ఇలాంటి ఘర్షణలను రాజేస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపించడం ఆందోళనకరం. కోనసీమలో కీలకమైన కాపులు, శెట్టిబలిజలను ఆకర్షిస్తే, వచ్చే ఎన్నికల్లో ప్రబల శక్తిగా ఎదగొచ్చని కొందరు రాజకీయ నేతలు ఆలోచిస్తున్నారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. అమలాపురం అగ్ని గుండం కావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడుతున్న పార్టీలు, అంబేద్కర్ పేరు వద్దనే సాహసం మాత్రం చెయ్యవు.
అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని పొలిటికల్ పార్టీలు కోరస్ పాడాయి. ఇఫ్పుడు గొడవలను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. గతంలో తుని ఘటనలో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆగ్రహంతో కాపు నిరసనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. అప్పటి వరకు టీడీపీ వైపే వున్న కాపులు చాలామటుకు, ఆ సంఘటనతో వైసీపీ వైపు మళ్లారు. ఇప్పుడు కోనసీమ ఘటనతో, కాపులు, శెట్టిబలిజలు తమవైపు కన్సాలిడేట్ అవుతారని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయన్న మాటలు వినపడ్తున్నాయి. అందుకే గొడవ జరిగిన తర్వాత, దాన్ని చల్చార్చాల్సిందిపోయి, మరింతగా ఘాటు వ్యాఖ్యలు చేశారు విపక్ష నేతలు. కానీ ఇలాంటి సామాజిక ఘర్షణలు ఓట్లు రాలుస్తాయన్న దాఖలా లేదంటున్నారు విశ్లేషకులు. పథకాలు, కార్యక్రమాలతోనే ఓటర్లను ఆకట్టుకోవాలే తప్ప, ఇలాంటి ఘర్షణలతో అధికారపీఠం ఎక్కడం సాధ్యంకాదని, అందుకు చరిత్రే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపదికగానే జరిగింది. ప్రాంతం మీద ప్రేమతో రాష్ట్రం సాధించుకున్నారు. అంతేకానీ, కులాల ప్రాధాన్యంగా కాదు. అలాగని కేసీఆర్ కులసమీకరణలను నిర్లక్ష్యం చెయ్యలేదు. సాంప్రదాయంగా కాంగ్రెస్ వైపు వుండే రెడ్లను తమవైపు తిప్పుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నించారు. అన్ని పదవుల్లో ప్రాధాన్యనిచ్చారు. కేబినెట్, ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పదవుల్లోనూ రెడ్ల ప్రాతినిధ్యం వుండేలా చూసుకున్నారు. ఈ కారణాల వల్ల రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడాల్సినంతగా పడవన్న భావన ఖద్దరు పార్టీలో వుంది. ఈ కోణంలోనే రేవంత్ రెడ్డి, వెలమ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కర్ణాటకలో జరిగిన రెడ్ల సంక్షేమ సంఘం సమావేశంలో వెలమలు వర్సెస్ రెడ్లు అనే అనే అర్థంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాణిరుద్రమ, ప్రతాప రుద్రుని కాలంలో రెడ్లు సామంత రాజులుగా వున్నప్పుడు, తెలంగాణ సుభిక్షంగా వుందన్నారు రేవంత్ రెడ్డి. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. కాకతీయ సామ్రాజ్యం కూడా… రెడ్ల ను పక్కన పెట్టి, వెలమలకు పట్టం కట్టడంతోనే, కాకతీయ సామ్రాజ్య కూలిపోయింది అంటూనే, రెడ్లు రాజకీయంగా నిర్లక్ష్యానికి గురవుతుననారంటూ చేసిన కామెంట్స్ తో హీటెక్కింది రాజకీయం. రెడ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలుపుకుని పోతారు, రాజకీయ పార్టీలు రెడ్లకు పగ్గాలు ఇచ్చినప్పుడు విజయాలు సాధించారు అని చర్చకు పెట్టారు రేవంత్.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్లే ముఖ్యమంత్రులైనప్పటికీ, కాంగ్రెస్ అంటే మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీల అణగారిన వర్గాల పార్టీగా ముద్ర పడింది. ఒక్కసారిగా ఒక్క కమ్యూనిటీని ఆ పార్టీ సొంతం చేసుకున్నట్టుగా జనంలో భావన మొదలైతే, ఊళ్లలోని ప్రధానంగా, గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన కులాలు దూరమయ్యే ప్రమాదం వుంది. అయితే, ఏదో అన్యాపదేశంగా రేవంత్ మాట్లాడారని అనుకోవడానికి వీల్లేదు. అన్నీ తెలిసే రెడ్డి వర్సెస్ వెలమ కామెంట్లు చేశారన్న చర్చ జరుగుతోంది. దూరమైన రెడ్డి కమ్యూనిటీని తిరిగి ఆర్షించేందుకే అలా అని వుండొచ్చని కాంగ్రెస్ లోనే కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో దగ్గరవుతారనడానికి దాఖలా లేదనే విమర్శలూ వస్తున్నాయి.
రెడ్లు అయినా, కమ్మ అయినా, వెలమ అయినా, వాళ్లవాళ్ల వ్యాపార, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచిస్తారే తప్ప, ఒక పార్టీతోనే శాశ్వతంగా వుండాలని అనుకోరు. వ్యక్తులకు కులం కన్నా వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం. రేవంత్ ప్రస్తావించిన వైఎస్ఆర్ కూడా, బీసీ నాయకుడైన డీఎస్ పీసీసీ చీఫ్ గా వున్నప్పుడే, సీఎం అయ్యారు అనే చర్చ గాంధీ భవన్ లో సాగుతోంది. రెడ్ల ప్రస్తావన ఎలా ఉన్నా..మిగిలిన కులాలు ఎలా స్పందిస్తాయనడానికి వీహెచ్ కామెంట్సే నిదర్శనం.
రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు కులంపైనే రాజకీయం నడుస్తోంది. కులాల లెక్కలపైనే నాయకులు సమీకరణాలు వేస్తున్నారు. పార్టీలూ అలాగే వున్నాయి. కోనసీమలో అంబేద్కర్ పేరుతో రగిలిన కార్చిచ్చులో కొన్ని పార్టీలు చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది కుల కుంపట్ల తరహాలో అగ్గిపుల్ల గీయ్యాలనుకుంటున్నాయి. కులాల వారీగా విడిపోతే, కొన్ని సామాజికవర్గాలైన ర్యాలీ అవుతాయని భావిస్తున్నాయి. కానీ కులంతో ఓట్లు పడవు. క్యాస్ట్ ఈక్వేషన్స్ తోనే అధికార పీఠం అందదు. ఒక కులానికి చెందిన నాయకుడైనంత మాత్రాన, ఆ కులపోళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయన్న గ్యారంటీ లేదు. అందుకు చరిత్రే సాక్ష్యం..
ప్రజల దగ్గరకు వెళ్లడానికి కులం అక్కర్లేదు….ప్రజల కష్టాలు, తెలుసుకోవాలి. వారి ఆలోచన గ్రహించాలి. జనం జీవితాలను బాగు చేసే ప్రయత్నం చెయ్యాలి. పథకాలతో ఆకట్టుకోవాలి. ఎలా బాగు చేస్తామో విజన్ డాక్యుమెంట్ వారి ముందుపెట్టాలి. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుల సమీకరణలతోనే అందలం ఎక్కలేదని గ్రహించాలి. ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం, మహిళల ఆస్తి హక్కు, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి నిర్ణయాలతో ప్రభంజనం మోగించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి జనాకర్షక స్కీమ్ లతో వైఎస్ అన్ని వర్గాల జేజేలు అందుకున్నారు. అందుకే కులం ఓట్లు రాల్చదు. సామాజిక వైషమ్యాలు అధికార పీఠం ఎక్కించలేవని గ్రహంచాలి.