ఇన్సానియత్….మానవత్వం. జమ్హూరియత్….ప్రజాస్వామ్యం. కశ్శీరియత్ స్నేహం….ఈ మూడు తమ కాశ్మీర్ విధానాన్ని నియంత్రిస్తాయని నాడు ప్రధానిగా అటల్ బిహరి వాజ్ పేయి అన్నారు. మండుతున్న మంచులోయకు మళ్లీ వసంతం వస్తుందని, కోయిలలు తిరిగి వస్తాయని, పూలు వికసిస్తాయని ఆకాక్షించారు…వాజ్ పేయి ఆశ కావచ్చు, ఆశయం కావచ్చు…వాటిని నెరవేర్చే దిశగా అన్నట్టుగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాము ఎప్పటి నుంచో చెబుతున్న ఆర్టికల్ 370 రద్దు చేశారు. కాశ్మీరీ పండిట్లు తిరిగొస్తున్నారు….టూరిస్టులతో కళకళలాడుతోంది..డీలిమిటేషన్ తర్వాత ఎన్నికలు జరుగుతాయి…జమ్మూకాశ్మీరం మునుపటిలా ప్రశాంతంగా వుంటుందని అనుకున్నారు. వుండాలని స్థానికులు భావించారు. దేశ ప్రజలు కూడా ఆకాంక్షించారు. కానీ మన భారతదేశ శిఖరం మళ్లీ రక్తకన్నీరు కారుస్తోంది. మన భూలోక స్వర్గం నరకప్రాయంగా మారుతోంది. ఉగ్రవాదం కొత్తకొత్త రూపాలతో మరణమ్రుదంగం మోగిస్తోంది…
ఇదిగో చూడండి….తమ స్వస్థలాలకు వచ్చిన కాశ్మీర్ పండితులు తిరిగి వెళతామంటున్నారు. ప్రాణాలకు రక్షణలేని చోట వుండటం ఎందుకని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇక ఈ ద్రుశ్యాలు చూడండి…బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇలా చాలామంది నిరసనలకు దిగారు. మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు? మేము చేసిన నేరమేంటని నిలదీస్తున్నారు…స్పాట్….
వాయిస్ విత్ గ్రాఫిక్స్అసలేం జరుగుతోంది కాశ్మీరంలో?
జమ్మూకాశ్మీర్ రక్తం విరజిమ్ముతోంది. ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. అందుకే పండిట్లు వెళ్లిపోతున్నారు. మమ్మల్నెందుకు చంపుతున్నారంటూ మరికొందరు నిలదీస్తున్నారు…
ఒకరు కాదు, ఇద్దరు కాదు మార్చి నుంచి 12మంది పండిట్లను చంపేశారు. అల్పసంఖ్యాక వర్గమైన హిందువులను టార్గెట్ గా చేసుకుని నరమేథం సాగిస్తున్నారు. ఒకవైపు భద్రతాదళాలు వరుస ఎన్‌కౌంటర్లతో హడలెత్తిస్తున్నా…ఉగ్రవాదులు మాత్రం నిత్యం ఏదో ఒక చోట సామాన్యులను లక్ష్యంగా చేసుకొని…హత్యలకు పాల్పడుతున్నారు. మొన్న పండిట్ వర్గానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి రాహుల్ భట్ హత్య చేయడం దుమారం రేపింది. దీన్ని మరచిపోకముందే..నటి అమ్రీన్ భట్‌ను…షూటింగ్ పేరుతో బయటికి పిలిచిన ఇద్దరు ఉగ్రవాదులు…కాల్పులకు తెగబడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే…ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత టీచర్ రజినీ బాలను కాల్చి చంపారు.
ఈ ఘటనలు మరువకముందే దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బ్యాంక్ మేనేజర్ ప్రాణాలను బలి తీసుకున్నారు ముష్కరులు. కుల్గామ్‌లోని అరే మోహన్‌పొరా ప్రాంతంలో ఉన్న ఎల్లాఖీ దేహతి బ్యాంక్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు… బ్యాంక్ మేనేజర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మేనేజర్ విజయ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. విజయ్ కుమార్ హత్య మార్చి నుంచి జరిగిన హత్యల్లో పన్నెండోది.
ఆర్టికల్ 370 రద్దు, లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం, కేంద్ర పాలనతో జమ్మూకాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దీంతో కాశ్మీర్ పండితుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న కాశ్మీరీ పండితులు తమను బదిలీ చెయ్యాలని నిరసనలు చేస్తున్నారు. దీంతో శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న 177 మంది పండిట్ టీచర్లను బదిలీ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు వరుస హత్యలపై, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆర్మీ చీఫ్, మనోజ్ సిన్హా, జమ్మూకాశ్మీర్ ఉన్నతాధికారులలో సమావేశమై సమీక్షించారు. అక్కడ శాంతి భద్రతలపై రివ్యూ చేశారు.
1990ల్లో కాశ్మీర్ లోయలో మైనార్టీలైన హిందూ పండిట్లపై నరమేధం సాగింది. దీంతో వేలాది కాశ్మీరీ పండితుల కుటుంబాలు వలస వెళ్లాయి. పండిట్ల ఊచకోత, వలసల నేపథ్యంలోనే మొన్న కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. చిత్రంలో చూపించినవన్నీ వాస్తవాలా…అభూత కల్పనలా అనే అంశం పక్కనపెడితే, కాశ్మీర్ ఫైల్స్ పెద్ద రచ్చకు దారి తీసింది. రాజకీయంగానూ దుమారం రేపింది…స్పాట్…కాశ్మీర్ ఫైల్స్ ట్రైలర్
కాశ్మీర్ ఫైల్స్ మూవీ వివాదం పక్కనపెడితే, పండిట్లను తిరిగి తమతమ స్వస్థలాలకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రధానమంత్రి ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కింద వేలాది మందికి ఎస్సీ కోటాలో ఉద్యోగాలు ఇచ్చింది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్యాకేజీలు ఇచ్చింది. దీంతో చాలామంది తిరిగి కాశ్మీర్ లోయకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. సొంత గ్రామాలకు వచ్చామని సంబరపడుతున్నారు. మాత్రుభూమికి వచ్చామని సంతోషపడుతున్నారు. కానీ ఈ ఆనందం ఎక్కువకాలం నిలవడంలేదు. ఉద్యోగాలు చేస్తున్న పండిట్లే టార్గెట్ గా కొన్ని నెలలుగా హత్యలు జరుగుతున్నాయి. దాడులు పెరిగిపోయాయి. టీచర్లు, బ్యాంకు ఉద్యోగులు, కూలీలను చంపేస్తున్నారు. మ్రుతుల్లో పోలీసులు కూడా వున్నారు. కేవలం వారం వ్యవధిలోనే ఉగ్రవాదులు ఎనిమిది మందిని టార్గెట్ చేసి చంపడం టెన్షన్ పుట్టిస్తోంది. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ మైనార్టీలైన పండిట్లు ఆందోళన చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చెయ్యాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీంతో జమ్మూకాశ్మీర్ మళ్లీ రావణకాష్టమవుతోంది….బైట్…
జమ్మూకాశ్మీర్ లో వరుస హత్యలపై పండిట్ల రగిలిపోతుంటే, రాజకీయ నాయకులు కూడా తలోమాటలతో మరింత మంటరేపుతున్నారు. జనం పిట్టల్లా రాలిపోతుంటే, కేంద్రం ఏం చేస్తోందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. ఎన్సీ నాయకులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా సైతం మాటల తూటాలు పేలుస్తున్నారు. వీరికి బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ లో మారణకాండ కొత్తకాదు. కాల్పులు కొత్తకాదు. ఏళ్ల తరబడి సాగుతున్నదే. అయితే, ఇప్పుడే మారణకాండ పెరిగిందన్నట్టుగా హైలెట్ చేస్తున్నారు. హిందువులను టార్గెట్ గా చేసుకుని, ఉగ్రవాదులు చంపుతున్నారని బీజేపీ అంటోంది. పాకిస్తాన్ నుంచి ట్రైనింగ్ అయిన టెర్రరిస్టులే, పండిట్లు, సింధులు ఇలా కొందరే టార్గెట్ గా నరమేధం సాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రాణం అమూల్యమైనది. ఎవరి ప్రాణమైన ప్రాణమే. చంపడం నేరం. దారుణం. హత్యలను ఖండించాల్సిందే. హంతకులన బోనెక్కించాల్సిందే. కానీ మరణాల చుట్టూ పాలిటిక్స్ ఏంటి?
నిత్య రావణకాష్టమని చెప్పుకునే జమ్మూకాశ్మీర్ లో ఇప్పుడు జరుగుతున్న మరణాలనే ఎందుకు హైలెట్ చేస్తున్నారన్నది ప్రశ్న. దీని వెనక బీజేపీకి రాజకీయ ప్రయోజనాలున్నాయని కొందరు అనేస్తున్నారు. రెండు మతాల మధ్య ఘర్షణగా చూపెట్టే కుతంత్రానికి తెరలేపారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇదిగో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రతి ఏడాది జమ్మూకాశ్మీర్ మరణాల సంఖ్యను చెబుతున్నాయంటూ మరికొందరు గణాంకాలను ముందుపెట్టుకుని మాట్లాడుతున్నారు. వీరి వాదనలు పక్కనపెడితే కాశ్మీర్ లో ఈ నరమేధమేంటి? ఎవరి కుట్ర వుంది? ఈ మరణాల చుట్టూ రాజకీయాలేంటి? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం కావాల్సిందే..రావాల్సిందే.
జమ్మూకాశ్మీర్ లో మారణకాండ నిత్యక్రుత్యం. అక్కడ కాల్పుల మోత మోగని రోజు లేదు. రాళ్ల దాడి జరగని రోజు లేదు. భద్రతా బలగాలు, వేర్పాటువాదుల మధ్య నిత్య ఘర్షణ. ఎన్ కౌంటర్లు సర్వసాధారణమయ్యాయి. మంచుకొండలతో చల్లని వాతావరణమున్నా, గొడవలతో మండుతున్న లోయ అది. కాశ్మీర్ లో మారణకాండ వినని రోజు లేదు. అయితే, ఈమధ్య అక్కడ జరుగుతున్న హత్యలు హైలెట్ అవుతున్నాయి. సాధారణ పౌరుల ప్రాణాలూ తీస్తున్నారన్న వార్తలు పతాక శీర్షికలవుతున్నాయి. అయితే, గణాంకాలను ఒక్కసారి విశ్లేషించుకుంటే, ఇదేమంత కొత్తది కాదని అనిపిస్తుంది. అయినా ఎందుకు పదేపదే పెద్దది చేసి చూపిస్తున్నారు? దీని వెనక ఏ పార్టీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలున్నాయన్న చర్చ జరుగుతోంది..
జమ్మూకాశ్మీర్ లో ప్రతిరోజూ ఎన్నో మరణాలు. అందులో ఉగ్రవాదులు, భద్రతా బలగాలు, సామాన్యులవి వుండొచ్చు. అయితే, ఇప్పడు జరుగుతున్న చర్చంతా సాధారణ పౌరులను చంపుతున్నారని. ఒక్కసారి గణాంకాలను తిరగేస్తే, ఏ సంవత్సరంలో ఎంతమంది కామన్ పీపుల్ చనిపోయారో అర్థమవుతుంది. 2010 నుంచి తీసుకుందాం. అప్పడు కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ, కేంద్రంలో అధికారంలో వుంది. 2010లో జమ్మూకాశ్మీర్ లో 34మంది సాధారణ పౌరులు చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే 2011లో 33మంది మరణించారు. 2012లో ఈ సంఖ్య 19. 2013లో 19మంది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక అంటే 2014లో 28మంది సాధారణ ప్రజలు చనిపోయారు. 2016లో 14 మంది మరణిస్తే, 2017లో 54మంది చనిపోయారు. అయితే 2018లో ఏకంగా 86మంది సాధారణ పౌరులు చనిపోయారు. అన్ని సంవత్సరాల కంటే, ఎక్కువ ఇది..
కేంద్రంలో బలమైన మోడీ అధికారం. అందులోనూ జమ్మూకాశ్మీర్ పై పట్టుదలగా వున్న బీజేపీ ప్రభుత్వం. అలాంటి మోడీ పవర్ లో వుండగా, 2018లో 86మంది కన్నుమూశారు. వీరంతా సామాన్యులే. కానీ అప్పుడు హైలెట్ కాలేదు. ఈస్థాయిలో మామూలు ప్రజలు చనిపోతే కాషాయ నాయకులు రచ్చ చెయ్యలేదు. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్న. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే అయినప్పుడు, 2018లో 86మంది చనిపోతే ఎందుకు ఈస్థాయిలో బీజేపీ నాయకత్వం చర్చ పెట్టలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు…
2019లో మరణాల గణాంకాల్లో సాధారణ పౌరులు 42మంది. 2020లో ఈ సంఖ్య 33. 2021లో 36మంది చనిపోయారు. 2022లో ఇప్పటి వరకు 18మంది కన్నుమూశారు. అటు యూపీఏ హయాంలోనూ, ఇటు ఎన్డీయే టైంలోనూ జమ్మూకాశ్మీర్ లో మరణాల సంఖ్య తక్కువేం లేదు. అయితే, నిశితంగా గమనిస్తే, కేంద్రంలో బీజేపీ అధికారం చెలాయిస్తున్నప్పుడే సాధారణ పౌరుల మరణాల సంఖ్య ఎక్కువుందని గణాంకాలను బట్టి చాలామంది వివరిస్తున్నారు. అటువంటప్పుడు ఇప్పుడే ఎందుకు మరణాలను హైలెట్ చేస్తున్నారన్నది అందరి ప్రశ్న.
ఆగస్టు 5, 2019. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు. దశాబ్దాలుగా జమ్మూకాశ్మీర్ కు సంబంధించి బీజేపీ నాయకులు, ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సాహసోపేతంగా ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పెద్దగా ఎలాంటి చర్చా లేకుండా ముగించేశారు. జమ్మూకాశ్మీర్ లో ప్రధాని పార్టీల నాయకులైన మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా వంటి నాయకులను, ఇళ్లల్లో బందీలను చేసి, ఇంటర్నెట్ కట్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. 370 రద్దుతో ఇక జమ్మూకాశ్మీర్ కు నవ వసంతమేనని అన్నారు. రాష్ట్రాలతో మమేకం అవుతుందన్నారు. కాశ్మీర్ పండితులు తిరిగి స్వస్థలాలకు వస్తారన్నారు. ఉగ్రవాదులు కోరలు తీసేస్తామన్నారు. మంచుకొండల్లో శాంతి కపోతం ఎగురుతుందన్నారు. కానీ జరుగుతోంది ఏంటి? నిత్య మారణకాండనే. సాధారణ ప్రజలు చనిపోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా మరణాల సంఖ్య తగ్గడం లేదు. శాంతి నెలకొనలేదు. అంటే జమ్మూకాశ్మీర్ పై మోడీ విధానం విఫలమైనట్టేనా? మోడీ వాగ్దానం చేసిన కాశ్మీర్ ప్రశాంతత నెరవేరలేదా అన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి..
జమ్మూ కాశ్మీర్‌లో వరుస పౌర హత్యలపై కాంగ్రెస్ నేతలు గొంతెత్తున్నారు. అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారం చెలాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఎందుకు హత్యలను ఆపలేకపోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అక్కడ మరణాకాండను కప్పిపుచ్చుకునేందుకే రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మిగతా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తన వైఫల్యం కనపడకూడదనే, హిందూ పండిట్లను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నాయంటూ విమర్శిస్తున్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు కాశ్మీర్ కిల్లింగ్స్ పై ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. ఆర్టికల్ 370 రద్దుతో అక్కడి పరిస్థితులు సాధారణానికి చేరుకుంటాయని చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌పై బీజేపీ వ్యూహం పూర్తిగా విఫలమైందని.. వారు అనుకున్నది సరైంది కాదని విమర్శించారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత జమ్మూ- కాశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడతాయని బీజేపీ నాయకులు హోరెత్తించారని, కానీ, అలా ఎందుకు జరగలేదని కామెంట్ చేశారు ఛత్తీస్ గఢ్ సీఎం. కాశ్మీర్ ఫైల్స్ చూడటానికి వారికి సమయం ఉంటుంది. కానీ, ఇప్పుడు అక్కడ హత్యలు జరుగుతున్న సమయంలో బీజేపీ, ఆరెస్సెస్ ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారాయన. కాశ్మీరీ పండిట్లు, మైనార్టీల హత్యలకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వ ఉద్యోగులను కాపాడలేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు.
ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ, జమ్మూ కాశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తుందని ఆరోపించారు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాశ్మీరీ పండిట్లకు సురక్షితమైన వాతావరణం కల్పించామన్నారు. 2016లో తీవ్ర అశాంతి సమయంలో,ఎటువంటి హత్య జరగలేదన్న ముఫ్తీ, కాశ్మీర్ ఫైల్స్ చిత్రం హింసను ప్రేరేపించిందని ఆరోపించారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి హిందూ-ముస్లిం సమస్యలను సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. అటు ఫరూక్ అబ్దుల్లా కూడా ది కాశ్మీర్ ఫైల్స్ పై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. ఇది దేశంలో ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించిందని అన్నారు. వీరి విమర్శలు ఎలా వున్నా, కాశ్మీర్ ఫైల్స్ ను బీజేపీ ఓన్ చేసుకుంది. ఏకంగా ప్రధానమంత్రి సినిమాను ప్రమోట్ చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ చూడాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ సినిమాను బీజేపీ నేతలు ప్రమోట్ చెయ్యడాన్ని, ఇప్పుడు కాశ్మీర్ లో పండిట్ల హత్యలను హైలెట్ చెయ్యడానికి కొందరు లింకు పెడుతున్నారు. కాశ్మీర్ లో హిందూ-ముస్లం గొడవలను రాద్దాంతం చేసి, దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించి, పోలరైజ్ పాలిటిక్స్ చెయ్యడమే బీజేపీ నేతల లక్ష్యమని వివరించే వారూవున్నారు. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా సాధారణ పౌరులు భారీ సంఖ్యలో చనిపోతున్నా పెద్దగాపట్టించుకోని బీజేపీ, ఇప్పుడు మాత్రం పెద్దది చేసిచూపే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించే వారూ వున్నారు. ఇందులో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలున్నాయంటూ చెబుతున్నారు..విజువల్స్బైట్.
జమ్మూకాశ్మీర్ విషయంలో మొదటి నుంచి అన్ని రాజకీయ పార్టీలదీ రాజకయమే. పక్కాగా ఓట్ల రాజకీయమే. అక్కడ మైనార్టీలుగా వున్న హిందువులపై బీజేపీ ప్రేమ ఒలకబోస్తుంటే, మరికొన్ని పార్టీలు అక్కడి మెజార్టీలైన ముస్లిం ఓట్ల ప్రాపకం కోసం వెంపర్లాడాయి. అందుకే దశాబ్దాలుగా కాశ్మీర్ భావోద్వేగ రాజకీయాలతో మండుతూనే వుంది.
హైబ్రీడ్ ఉగ్రవాదం. ఆన్‌లైన్‌లో టెర్రరిస్ట్ కోచింగ్. తుపాకీ ఎలా కాల్చాలో..తూటాలు ఎలా పేల్చాలో పక్కాగా శిక్షణ. మధ్యవర్తి ఎవరో రైఫిల్ అందిస్తాడు. మర్డర్ తర్వాత తిరిగి ఆ రైఫిల్ ఇచ్చెయ్యాలి. జమ్మూకాశ్మీర్ లో సామాన్య ప్రజలను చంపేస్తోంది ఇలాంటి హైబ్రీడ్ ట్రైన్డ్ ఉగ్రవాదులేనట. మరి కాశ్మీర్ లో ఇలాంటి కొత్త తరహా ఉగ్రవాదాన్ని అణచివేసేదెప్పుడు? రాజకీయ పార్టీలు ఐక్యంగా కదిలేదెప్పుడు?
జమ్మూకాశ్మీర్ లో ఇప్పటి హత్యలను, 1990లో జరిగిన మారణకాండను పోల్చి చూస్తున్నారు కొందరు. 1990లో జనవరి – మార్చి మధ్య అంటే, మూడు నెలలు కాశ్మీర్ లోయ కల్లోలమైంది. కాశ్మీరీ పండితులు, మైనార్టీలే లక్ష్యంగా సాగిన ఊచకోతతో, దేశం దిగ్భ్రాంతికి గురైంది. మూడు నెలల్లో ఏకంగా 32 మందిని చనిపోయారు. కాశ్మీర్ లో వుంటే బతకలేమంటూ వేలాది కాశ్మీరీ పండితుల కుటుంబాలు కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత కాశ్మీర్ అలాంటి పరిస్థితులనే చూస్తోంది. 1990లో మారణ హోమం టైంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వుంది. అప్పుడు జమ్మూకాశ్మీర్ లో నేషనల్ కాన్ఫిరెన్స్ పవర్ లో వుంది. నాటి మారణహోమానికి కాంగ్రెస్, ఎన్సీల బాధ్యత వుంది. ఇప్పుడు కేంద్రంలో మోడీ వపర్ లో వుంటే, స్టేట్ లో కూడా అదే అధికారం చెలాయిస్తోంది. అందుకే మోడీపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి..
రకరకాల మానసిక జాఢ్యాలతో రగిలిపోతున్న కొందరు లోకల్ యూత్ ను ఉగ్రవాద సంస్థలు ఆకర్షిస్తున్నాయి. వారికి తాయిలాలు ఇస్తాయి. 10 – 15 రోజుల పాటు ఆన్‌లైన్‌లోనే ట్రైనింగ్ తో అవగాహన కల్పిస్తాయి. డైరెక్టుగా కలవకుండా అంతా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలోనే శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారిని దారుణాలకు దించుతాయి. కుల్గామ్‌లో రజిని బాలా అనే ఉద్యోగిని, ఆన్ లైన్ లో ట్రైనింగ్ పొందిన ముష్కరుడే చంపాడని పోలీసులు నిర్ధారించారు. దుండగులు ఆమెను అతి సమీపం నుంచి కాల్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రజిని హత్యకు పాల్పడిన నిందితులు లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాదులని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడికి కేవలం 10 రోజుల ముందే వారిని లష్కరే నియమించుకొన్నాయని అంటున్నాయి.
మామూలుగా అయితే,పక్కాగా ట్రైనింగ్ తీసుకుని టెర్రరిస్టుగా మారినవారికి నేర చరిత్ర వుంటుంది. వారిపై పోలీసుల నిఘా వుంటుంది. అందువల్ల వారి కార్యకలాపాలను ట్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ.. ఇటీవల జరిగిన అనేక టార్గెటెడ్ కిల్లింగ్స్ లో నిందితులు హైబ్రీడ్ ఉగ్రవాదులేనని పోలీసు వర్గాలు నిర్ధారిస్తున్నాయి. వీరంతా స్థానిక యువకులే కావడం, గతంలో నేరాలు చేసినట్లు ఎలాంటి రికార్డులూ లేకపోవడంతో, వీరిని గుర్తించడం భద్రతా బలగాలకు కష్టమైంది.
ఒక్క మే నెలలోనే కనీసం 12 మంది యువకులు టెర్రరిస్ట్ సంస్థలకు ఆకర్షితులయ్యారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరిలో నలుగురిని ఇటీవల పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అయితే, ఆన్ లైన్ ద్వారా శిక్షణ తీసుకుంటున్న చాలామంది యువకులకు, తాము ఎవరి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నామన్నది తెలియదు. ఆన్ లైన్ లో ట్రైనింగ్ తర్వాత, మధ్యవర్తి ఒకరు తుపాకీ అందిస్తారు. మర్డర్ చేసిన తర్వాత, ఆ తుపాకీని తిరిగి మధ్యవర్తికి ఇచ్చేస్తారు. వారి దైనందిన పనుల్లో మునిగిపోతారు. వీరిని కనిపెట్టడం పోలీసులకు అతిపెద్ద సవాల్ గా మారింది..
ఇలా హైబ్రీడ్ పంథాతో శిక్షణ పొందిన టెర్రరిస్టులతో, జమ్మూకాశ్మీర్ లో రక్తం ఏరులై పారుతోంది. అయితే, ఈ మారణకాండపై రాజకీయం ముసురుకుంటోంది. ప్రతి ఏడాది ఇలాంటి మరణాలు చోటు చేసుకుంటున్నా, ఇప్పుడే హైలెట్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదని, ఆ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే, బీజేపీ మతం కోణాన్ని ప్రముఖంగా తెరపైకి తెస్తోందని వాదిస్తున్నారు. హిందులనే టార్గెట్ చేశారని చెప్పుకోవడం ద్వారా, దేశవ్యాప్తంగా పోలరైజ్ పాలిటిక్స్ వ్యూహం వుందని విశ్లేషిస్తున్నారు..
మొత్తానికి జమ్మూకాశ్మీర్ దశాబ్దాలుగా మండుతూనే వుంది. రాజకీయ పార్టీల కుతంత్రాలకు రగిలిపోతూనే వుంది. ఇప్పుడు కూడా మారణకాండ సాగుతూనే వుంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రానిదే. రాజకీయాలను పక్కనపెట్టి, అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేలా అన్ని పార్టీలు చేయి కలపాలి. మతాల మధ్య చిచ్చుపెట్టే నాయకుల నోళ్లకు తాళమెయ్యాలి. కాశ్మీర్ పండిట్లు, ముస్లింలు అక్కడ దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారు. వారి మధ్య చిచ్చుపెట్టి, రాజకీయ లబ్దిని మూటగట్టుకునే ప్రయత్నం మానుకోవాలి. చితిపై చలికాచుకునే కుట్రలను అన్ని పార్టీలూ వదిలెయ్యాలి. అప్పుడే దివంగత ప్రధాని అటల్ బిహరి వాజ్ పేయి కలలు గన్న ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్శీరియత్ వెల్లివెరుస్తుంది.