కెసీఆర్ జాతీయ పార్టీ ..ఇప్పుడిదే సంచలనం..రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ…ఈ పార్టీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఒకటైతే..
అసలు ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణాది జాతీయ పార్టీ నిలబడుతుందా అనేది మరో చర్చ..గులాబీ పార్టీ పునాదులపై నిలిచే బీఆర్‌ఎస్ కున్న సాధ్యాసాధ్యాలేంటి?ఇదే ఈ రోజు స్టోరీ బోర్డ్.
చాలా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైతే చాలా వరకు ఊహాగానాలే.కానీ, కెసీఆర్ వ్యూహాలు సామాన్యంగా ఉండవనేది అందరూ ఒప్పుకునే విషయమే. అందుకే బీఆరెస్ విషయంలో క్లారిటీ వచ్చే వరకు ఈ ఉత్కంఠ తప్పదేమో. అప్పటి వరకు దీని చుట్టూ నిత్యం కొత్త విషయాలు వినిపిస్తూనే ఉంటాయి.
బీఆరెస్‌కు ముహూర్తం ఫిక్సైందా?జాతీయ పార్టీపై కెసీఆర్ వ్యూహమేంటి?బీఆరెస్‌కున్న సాధ్యాసాధ్యాలేంటి?టీఆరెస్ బీఆరెస్ గా మారుతుందా? లేక విలీనమౌతుందా?
బీఆరెస్ వార్తలు ఊపందుకుంటున్నాయి.కెసీఆర్ జాతీయ పార్టీని తొందర్లోనే ప్రకటిస్తారని, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ రెడీ అవుతోందని అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.చాలా కాలం క్రితమే కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడతానన్న కేసీఆర్ .. ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. దేశ రాజకీయాల్లో ఇది ఓ రకంగా పెద్ద ఛాలెంజ్. ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. దాని సాధ్యాసాధ్యాలు ఏంటి? ఆ ప్రతిపాదన వర్కవుట్ అవుతుందా? అసలు… బీజేపీ, కాంగ్రెస్, తృతీయ ఫ్రంట్ కాకుండా మరో జాతీయ పార్టీ మనుగడ సాధ్యమేనా? సాధ్యమైతే, దాని సమీకరణాలు ఎలా ఉంటాయ్? ఇవన్నీ కెసీఆర్ జాతీయ పార్టీ అనగానే వినిపించే ప్రశ్నలు.
నిజానికి ఉత్తర భారతదేశ రాజకీయాలు, దక్షిణ భారతదేశ రాజకీయాలు వేరువేరు. ఒక దక్షిణాది నాయకుడు పూర్తిగా తన సామర్ధ్యంతో జాతీయ పార్టీ పెట్టడం, దాన్ని నడపడం, దేశమంతా వ్యాపింపజేయడం… అందరినీ కూడగట్టగలగడం…ఇవన్నీ ఇప్పటి వరకు జగరలేదు. గతంలో దక్షిణాది నాయకులు ఇప్పటివరకు కూటములకు సారధ్యం వహించగలిగారే తప్ప ఏకంగా పార్టీ పెట్టి దాన్ని జనంలోకి తీసుకెళ్లలేదు. ఇది నిజంగా ఓ సాహసోపేత ప్రక్రియ. మాటల్లో చెప్పుకున్నంత అషామాషీ అయితే కచ్చితంగా కాదు. అందుకే బీఆరెస్ చుట్టూ అంతులేని ఆసక్తి ఏర్పడింది.
ఓ సారి జాతీయ రాజకీయాలను గమనిస్తే, ఇప్పుడు బీజేపీ దేశంలో అత్యంత బలమైన పార్టీగా మారింది. వచ్చే ఎన్నికల్లో కూడా తిరుగులదేని నమ్ముతోంది. ఇటు కాంగ్రెస్ నాయకత్వ లేమితో సతమతమౌతోంది. ఒకప్పటి హేమాహేమీ నాయకులంతా వృద్ధులైపోయారు. యువ నాయకత్వం తగ్గిపోతుంది. వారసత్వ రాజకీయం నుంచి పార్టీ ఇంకా బయటపడలేకపోతోంది. మరోవైపు ఆప్, బెనర్జీ తృణమూల్, శివసేన, ఎన్సీపీ లాంటి పార్టీలన్నీ కూటమిగా ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక జాతీయ పార్టీ ఏర్పడితే దానికుండే అవకాశాలేంటి? రెండు అతిపెద్ద పార్టీలను, ప్రాంతీయ పార్టీల కూటమిని ఢీకొట్టడం కచ్చితంగా కత్తిమీద సామే. దీనిని కేసీఆర్ ఎలా ప్రయోగాత్మకంగా సక్సెస్ చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం
మరోపక్క కెసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి అనేపేరు ఖరారు చేశారనే వాదనలున్నాయి. కొత్తగా పార్టీ ప్రకటనకు తేదీని కూడా ఖరారు చేశారని వార్తలొస్తున్నాయి. జూన్ 19, 20 తేదీల్లో పార్టీని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో దీన్ని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ నేతలతో చర్చలు జరిపిన తర్వాత ఈ తేదీని కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి..పేరు రాజకీయ వర్గాల్లో హల్ చల్ గా మారింది.నిజానికి కెసీఆర్ చాలా కాలంగా ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు..గత సార్వత్రిక ఎన్నికలకు ముందే పలు రాష్ట్రాలు పర్యటించారు.
మమత, స్టాలిన్, నవీన్ పట్నాయక్, అఖిలేష్, మాయావతి సహా అనేకమంది ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు..ఫెడరల్ ఫ్రంట్ వాదనతో జాతీయ రాజకీయాల్లో చర్చ మొదలు పెట్టారు. బిజెపి, కాంగ్రెస్ లకు సంబంధం లేకుండా ఓ కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు..నాటి నుంచి ప్రత్యామ్నాయ కూటమిపై అనేక వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ మధ్య కాలంలో కూడా పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలుస్తూ వచ్చారు..అయితే, టియ్యారెస్ 21 ప్లీనరీ లో ఆయన ప్రసంగం కొత్త సంకేతాలనిచ్చింది.
దేశానికి కావాల్సింది.. రాజకీయ ఫ్రంట్‌లు కాదంటూనే.. దేశ గతి, స్థితిని మార్చే.. ప్రజల అభివృద్ధికి సహకరించే ప్రత్యామ్నాయ అజెండా కావాలని చెప్పారు. భారత్ దేశంలో ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానం కోసం వేదికలు రావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితి కావాలనే
ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలని వ్యాఖ్యానించారు. ఆ రోజు నుండి కొత్త జాతీయ పార్టీ ఊహాగానాలు మరింత పెరిగాయి. రీసెంట్‌గా ప్రగతి భవన్‌లో పలువురితో వరుస సమావేశాల తర్వాత ఈ వాదనలకు బలం పెరిగింది.
అయితే, కెసీఆర్ ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహం ఉంటుంది. అది ప్రత్యర్థులకు అంత తేలిగ్గా అందదంటారు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేదానిపై ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. తొలినాటి నుంచి ఆయన అడుగులు ఇదే చెప్తాయి. వ్యూహం లేకుండా ఆయన ఏదీ చేయరు. మరి ఇప్పుడు కెసీఆర్ కొత్త ప్రణాళికలు ఏ దిశగా సాగుతున్నాయనే ఆసక్తి సామాన్యుల్లోనే కాదు..రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నాయి. అసలు ఓ ప్రాంతీయ పార్టీ పునాదులపై జాతీయ పార్టీ ఎదగగలదా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఓ జాతీయ పార్టీకి స్థానం ఉందా? ఇప్పుడు కెసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో సాధ్యాసాధ్యాలేమిటనే ప్రశ్నలు బలంగానే వినిపిస్తున్నాయి..
ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతున్న బిజెపిని, అంతో ఇంతో బలంగా ఉన్న కాంగ్రెస్ ని, దేశంలో పదుల సంఖ్యలో ఉన్న ప్రాంతీయ పార్టీలను, వాటి కూటమిని దాటుకుని ..ఓ కొత్త జాతీయ పార్టీ తెరమీదికి రావటం అంటే చిన్న విషయం కచ్చితంగా కాదు. రాజకీయాల్లో వాక్యూమ్ ఉన్నపుడు కొందరు నేతలు అనుకూలంగా మార్చుకుంటారు. చాలా అరుదుగా మాత్రమే వాక్యూమ్ తో సంబంధం లేకుండా తమదైన చోటుని సంపాదించుకుంటారు. ఇప్పుడు కెసీఆర్ ప్రయత్నాలకు ఇంతటి అవకాశం ఉందా?
జాతీయ రాజకీయాల్లో ఆయన ఎదిగే పరిస్థితులు ఉన్నాయా? భారత రాష్ట్ర సమితి తెలంగాణ పునాదులతో ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టగలదా?
రాజకీయాల్లో ఎప్పుడే మలుపులు ఉంటాయో ఊహించటం తేలిక కాదు..మరీ ముఖ్యంగా కెసీఆర్ లాంటి నేత రంగంలో ఉన్నపుడు సంచలనాలు సాధారణమైపోతుంటాయి. ఎందుకంటే కెసీఆర్ ఏం చేసినా దాని వెనుక ఒక వ్యూహముంటుంది. అందుకే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఇంత కలకలం కనిపిస్తోంది. జాతీయ పార్టీ వార్తతో కేసీఆర్ రాజకీయంగా పెద్ద చర్చకే కారణమయ్యారు. అయితే ఇప్పుడు బీఆరెస్ కి ఉన్న స్కోప్ ఎంత అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఉద్యమ పార్టీగా మొదలైన టియ్యారెస్ రాజకీయ పార్టీగా మారి, ఇప్పుడు రెండోసారి తెలంగాణలో అధికారంలో ఉంది.2001లో పురుడు పోసుకున్న టిఆర్ఎస్, 14ఏళ్లలోనే అసాధ్యం అనుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని సుసాధ్యం చేసుకుంది. రెండు సార్లు అధికార పగ్గాలు చేపట్టి ముందుకెళుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ 63 సీట్లు గెలిచింది.
పాలనా కాలం పూర్తవ్వకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎవరూ ఊహించని రీతిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినరోజే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ ఎన్నికల్లో 88 స్థానాలతో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎదురు లేదనిపించుకుంది.
ఈ దూకుడు జాతీయ రాజకీయాల్లో కూడా పనికొస్తుందా? అక్కడ కూడా ఇదే విధంగా రాణిస్తారా? అంతటి అవకాశాలు అక్కడ ఉన్నాయా? అనే ప్రశ్నలు రావటం సహజం.
ఎందుకంటే జాతీయ పార్టీ అనగానే, ప్రకటన చేయగానే ఫలితం వచ్చేయదు. ప్రజలకు దగ్గరవ్వాలి.. రాష్ట్రాల్లో ఓట్లు సంపాదించాలి..ఎమ్మెల్యేలు, ఎంపీలని గెలిపించుకోవాలి..అంతేకానీ, జాతీయ పార్టీని ఎనౌన్స్ చేయగానే అద్భుతాలేం జరగవు. టియ్యారెస్ జాతీయ పార్టీగా మారితే, ఇతర రాష్ట్రాల్లో కూడా కచ్చితంగా పోటీ చేయాల్సిందే. అలాంటపుడు ఏ రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది? అక్కడి ఓటర్లను ఎలా గెలుచుకుంటుందనేది పెద్ద సవాలే.
ఇప్పుడు దేశంలో వివిధ రాష్ట్రాలను గమనిస్తే, యూపీ, గుజరాత్, కర్నాటక,మధ్యప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాలు బిజెపి పాలనలో ఉంటే, రాజస్థాన్, చత్తీస్ ఘర్ కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి. తమిళనాడు, ఏపీ, ఒరిస్సా, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలో ఉన్నాయి. భారత్ రాష్ట్ర సమితికి వీటిలో ఏ రాష్ట్రాల్లో అవకాశం ఉండబోతోంది? ఎక్కడ ఏ వ్యూహం అనుసరిస్తుందనేవి ఇప్పుడు వినిపించే ప్రశ్నలు..
అయితే, అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే బలంగా ఉన్న బిజెపి, కాంగ్రెస్ లతో పాటు, ప్రాంతీయ పార్టీపై బీఆరెస్ పోటీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బిజెపి, కాంగ్రెస్ లను మాత్రమే వ్యతిరేకిస్తూ ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాలనుకుంటే, అలాంటి ఛాన్స్ అక్కడి ప్రాంతీయ పార్టీలు ఇస్తాయా అనేది అనుమానమే. ఉదాహరణకు తమిళనాడులో బలంగా ఉన్న డీఎంకే, బీఆరెస్‌కు మద్దతిచ్చే పరిస్థితి ఉంటుందా? కేవలం, బిజెపి, కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటిపై బీఆరెస్ పోటీకి దిగవచ్చేమో.. కానీ, దేశంలో చాలా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు పోటాపోటీగా ప్రాంతీయ పార్టీలున్నాయి.
ఇక టియ్యారెస్ పోటీ చేయటానికి యూపీలోనో, గుజరాత్ లోనో అభ్యర్థులు ఎవరు దొరుకుతారనేది మరో ప్రశ్న. ఎంత చిన్న పార్టీకైనా అభ్యర్థులు దొరకొచ్చు.. సందేహం లేదు. కానీ, గెలుపు గుర్రాలు దొరకటమే కష్టం. అలాంటపుడు అసంతృప్తితోనో, పునరావాసంలో భాగంగానో వచ్చే నేతలతో బీఆరెస్ కు ప్రయోజనం ఏమిటనేది మరో కీలక ప్రశ్న.
దానితో పాటు, ఇప్పుడు పార్టీని ప్రకటించి, ఈ ఎన్నికలలోపే పార్టీ నిర్మాణం చేస్తారా?ఈ మొత్తం ప్రాసెస్ కి ఇప్పుడున్న కాస్త టైమ్ సరిపోతుందా? అనేది కూడా ముఖ్యమైన అంశమే..
సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితం అవుతాయి. ఆ రాష్ట్రంలోనే బలంగా ఉంటాయి. తమ రాష్ట్రాలకు బయట బేస్‌ను ఏర్పాటు చేసుకోవడం అంత సులువు కాదు. పంజాబ్ ను గెలిచిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ లీడర్‌గా కేజ్రీవాల్ నిలిచారు. కేజ్రీవాల్ తో పాటు, శరద్ పవార్, మమతా బెనర్జీలకు కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే టార్గెట్ ఉంది. మమత ఇప్పటికే ఈ విషయంలో చాలా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతీయ పార్టీల నేతలంతా కూటమి దిశగానే ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో కెసీఆర్ జాతీయ పార్టీ పేరుతో కొత్త దారిలో సాగుతున్నారు. ఇది ఎలాంటి ఫలితాలనిస్తుందనేది ఆసక్తికరంగా మారింది..
అయితే కెసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఎంత వరకు సఫలమౌతారనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు…కానీ, భారత్ రాష్ట్ర సమితి పెడితే అది తెలంగాణలో గులాబీ పార్టీకి మంచి ఊపు తేవటం మాత్రం ఖాయమనే వాదనలున్నాయి. ఇప్పటికే ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్నారు. తొందర్లోనే ఎన్నికలు వచ్చినా, బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఉత్సాహం..ఫలితం ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నా, తెలంగాణలో ఓట్ల శాతాన్ని కచ్చితంగా పెంచే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తక్షణ లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసి, ఆ తర్వాతే జాతీయ రాజకీయాల వైపు చూడటం ఉత్తమమనే సలహాలూ వినిపిస్తున్నాయి.
మరోపక్క టీఆరెస్ నే బీఆరెస్ గా మారుస్తారా? లేక మొదట బీఆరెస్ పెట్టి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆరెస్ ని అందులో విలీనం చేస్తారా అనేది కూడా ఆసక్తికరమే. కారు గుర్తునే కొనసాగించాలని, పార్టీ జెండా రంగును కూడా గులాబీగానే ఉంచాలని నిర్ణయించినట్లు ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం. అయితే, పార్టీ జెండాలో తెలంగాణ మ్యాప్ కు బదులు భారతదేశ మ్యాప్ ఉండేలా నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ కొనసాగించాలని, ఆ తర్వాత టీఆర్ఎస్‌ను బీఎర్ఎస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఏయే రాష్ట్రాల్లో పోటీ చేయాలి? ఏయే పార్టీలతో కలిసి పోటీ చేయాలనేదానిపైనా చర్చించినట్లు తెలుస్తోంది..
ఎజెండా ఏమీటో, రూట్‌మ్యాప్ ఏమిటో తెలియకుండా ఇప్పుడు చెప్పటం కష్టమే. కానీ, రాజకీయాలు అనూహ్యంగా ఉంటాయని ప్రజల తీర్పు అంతకంటే విభిన్నంగా ఉంటుందని ఎన్నో అనుభవాలు చెప్తాయి. ఇప్పుడు బియ్యారెస్ ని కూడా కెసీఆర్ అలాగే ముందుకు తీసుకెళ్తారేమో. కానీ, ఆ దారిలో వచ్చే అడ్డంకులు మాత్రం చిన్నవి కాదు.
ప్రత్యామ్నాయ ఎజెండాతో ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు భిన్నంగా బీఆరెస్ వస్తుందనేది టియ్యారెస్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. ఇందులో భాగంగా లైక్ మైండెడ్ ప్రముఖుల్ని కలుపుకుని పోతారనే వాదనలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఉత్తరాదిన రైతు సంఘాల నేత రాజేష్ తికాయత్, సోనూ సూద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు తమిళనాడులో హీరో విజయ్ పేరు వినిపిస్తోంది. రీసెంట్ గా ఏపీ మాజీఎంపీ ఉండవల్లి కూడా కెసీఆర్ ని కలిశారు.. అయితే ఇప్పటి వరకు బీఆరెస్ చుట్టూ వినిపిస్తున్నవన్నీ అనధికారిక వార్తలే.
ప్రజలకు దగ్గరైన ఏ పార్టీకైనా అధికారం దక్కుతుంది..ఢిల్లీ పీఠం బిజెపి, కాంగ్రెస్ ల సొత్తేమీ కాదు..ఆ మాటకొస్తే ఏ రాజకీయ పార్టీకైనా ప్రజాభిమానమే పెట్టుబడి..ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి కూడా ఇలాంటి ఆశలతోనే రంగంలోకి దిగవచ్చు. దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టే స్వేచ్ఛ ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా ఉంది. కానీ, నామమాత్రపు పోటీ కోసమే అయితే ఇంత హడావుడి అనవసరం.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు..జాతీయ పార్టీ అంటూ పెడితే, ఢిల్లీ పీఠాన్ని సాధించాలనో, కనీసం ఢిల్లీలో ఓ గట్టి పార్టీకి ఎదగాలనో ఆశించటం సహజం. కానీ, అది ప్రకటించినంత సులభం కాదు. రాష్ట్రంలో రాజకీయాలు చేసినంత తేలిక కాదు. దానికోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఓ ప్రాంతీయ పార్టీ పునాదులపై ఎదిగే జాతీయ పార్టీ మరీ ఎక్కువగా కష్టించాల్సి ఉంటుంది.
దేశంలో ఇప్పటికే వందలాది రాజకీయ పార్టీలున్నాయి. ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 54 ప్రాంతీయ పార్టీలు 2,797 గుర్తింపు లేని చిన్నా చితకా పార్టీలు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, భాజపా, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఎన్‌పీపీ, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలు. వీటిల్లో ఎన్‌సీపీ, ఎన్‌పీపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు ప్రాంతీయ పార్టీలుగా ఉండి జాతీయ పార్టీలయ్యాయి. మిగిలిన పార్టీల పేరు మారలేదు కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పేరుకు ముందు అఖిలభారత చేర్చి జాతీయ పార్టీగా తీర్మానం చేసి పంపగా…ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం జాతీయ పార్టీ హోదా ప్రయత్నాల్లో ఉంది.
ఓ రాజకీయ పార్టీ పెట్టి, అది ప్రజలకు దగ్గరై ఎన్నికల్లో ఫలితాలు సాధించటానికి చాలా ఏళ్లు పడుతుంది. గతంలో ఎన్టీఆర్ ఎనిమిది నెలల్లో సాధించిన రికార్డ్ అన్ని సందర్భాల్లో, అన్ని రాజకీయ పార్టీలకు సాధ్యమయ్యే ఫీట్ కచ్చితంగా కాదు. అప్పటి రాజకీయ పరిస్థితులు, నాటి అవకాశాలు టిడిపికి ఉపయోగపడ్డాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదనే చెప్పాలి.
ఇప్పుడున్న పరిస్థితిలో టియ్యారెస్ కొత్త పార్టీగా మారితే, అది జనాల్లోకి వెళ్లటానికి కొన్నేళ్లు పట్టవచ్చు. అసలు ఏ వ్యూహాలను అనుసరిస్తారు.. ఎవరెవరు కలిసి వస్తారు? ఏ పార్టీలు మద్దతిస్తాయి అనే అంశాలన్నీ ఇప్పటి వరకు ఊహాగానాలే. కాబట్టి బీఆరెస్ ఎజెండా ఏమిటో రూట్ మ్యాప్ ఏమిటో తెలియకుండా తేల్చేయటం సరైన పని కాదు కానీ, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఓ కొత్త పార్టీ వచ్చి ప్రజల్లోకి చొచ్చుకుపోవటం అంత తేలికైతే కాదు. కానీ, టియ్యారెస్ పార్టీ పెట్టినపుడు కూడా ఇలాంటి వాదనలే వినిపించాయని, ఇప్పుడు కూడా అలాగే సైలెంట్ గా వచ్చి అద్భుతాలు చేస్తామని కొందరు టియ్యారెస్ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే దేశమంతా వచ్చే ఫలితాల సంగతి ఎలా ఉన్నా, బీఆరెస్ వస్తే, ఆ ఊపులో తెలంగాణలో గులాబీ పార్టీ మరింత బలపడి, ఓట్ల శాతం పెంచుకుంటుందనే వాదన మాత్రం గట్టిగానే ఉంది.
ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే, బిజెపి రెండోసారి గెలిచి మూడోసారి కూడా తమదే పైచేయి అనే ధీమాలో ఉంది. ఇటు కాంగ్రెస్ వరుస ఓటములతో, చేజారుతున్న రాష్ట్రాలు, సీనియర్లతో అల్లకల్లోలమౌతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బీజేపీని సవాల్ చేస్తున్నాయి. పదికి పైగా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులుగా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. బెంగాల్, బీహార్, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఏపీల్లో కాంగ్రెస్, బీజెపీలు అంతంత మాత్రమే. ఈ రాష్ట్రాల్లో సమీప భవిష్యత్తులోఓ జాతీయ పార్టీ అధికారం చేజిక్కించుకునే పరిస్థితి లేదు. అంటే ఈ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయి, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీని సవాల్ చేస్తే జాతీయ పార్టీగా బియ్యారెస్ ఎదిగే అవకాశం ఉంటుంది. ఇందులో సాధ్యాసాధ్యాలేమిటో తొలి అడుగులు పడిన తర్వాత కానీ, తేలే విషయం కాదు.
ఫ్ర్రంట్లు కాదు…ప్రత్యామ్నాయం కావాలంటున్నారు కెసీఆర్. జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయం లేకనే బిజెపి ఆడింది ఆట, పాడింది పాటగా ఉందని విరుచుకుపడుతున్న కెసీఆర్, అనేక సందర్భాల్లో కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకే పరిమితం కావటం వల్లనే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందనేది కెసీఆర్ వాదన.. ఇప్పుడా స్థానాన్ని బీఆరెస్ భర్తీ చేస్తుందని ఆయన అభిప్రాయం కావచ్చు. మరోపక్క రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి ధీటుగా అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ప్రాంతీయ పార్టీలున్నాయి. ఇది పరోక్షంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎటు ఉండనుందో స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాతీయ పార్టీ చర్చ తీసుకొచ్చిన కెసీఆర్, దేశంలోని అనేక పార్టీలు, మేధావులు, ప్రజల మధ్దతు తనకు ఉందంటున్నారు.
దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిద్దామని కేసీఆర్ టియ్యారెస్ శ్రేణులతో చెప్తున్నారు. కానీ, దానికున్న సాధ్యాసాధ్యాలేమిటో తేలటానికి మరికొంత సమయం పడుతుంది.