Hyderabad Drugs : హైదరాబాద్ ని డ్రగ్స్ భూతం కమ్మేస్తోంది. ఎప్పటికప్పుడు డ్రగ్స్ దందాలో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా డార్క్ నెట్ ద్వారా కొరియర్లలో డ్రగ్స్ సప్లై గురించి విని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఇంటికి వచ్చే కొరియర్ల కవర్లు తీసి లోపల ఏముందో చెక్ చేయాలని తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చే దుస్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది.
హైద్రాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. గోవా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్ఎస్‌డీ, చరాస్, ఎండీఎంఏను పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 9 లక్షలుంటుందని పోలీసులు చెప్పారు. డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో డ్రగ్స్ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. పెడ్లర్లు, పబ్బుల స్థాయి దాటేసి.. ఏకంగా డార్క్ వెబ్ ద్వారా కొరియర్ పంపే స్టేజ్ కు వచ్చేసింది. పైకి అమెజాన్ నుంచి టీషర్ట్ కొరియర్ వచ్చినట్టు ఉంది. కానీ కొరియర్లో లోపల సీక్రెట్ గా డ్రగ్స్ ప్యాకెట్లు ఉంటాయి. ఇవి పంపేవారికి, తీసుకునేవారికి మాత్రమే తెలిసిన అతి రహస్యాలు. డార్క్ నెట్ లో బుకింగ్.. క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చూస్తుంటే.. భాగ్యనగరంలో డ్రగ్స్ సంస్కృతి ఏ రేంజ్ లో నడుస్తోందో అర్థమవుతోంది. మూడు అంతరాష్ట్ర ముఠాలు డార్క్ నెట్ ను ఉపయోగిస్తూ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాయని పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ ముఠాలో ప్రధాన సూత్రధారి నరేంద్ర నారాయణ్ గోవాలో స్థిరపడ్డాడు. కానీ అతడి స్వంత రాష్ట్రం హర్యానా అని తేల్చారు. ఏడాదిగా డార్క్ వెబ్ సైట్ ద్వారా నారాయణ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దేశ వ్యాప్తంగా 450 మంది వినియోగదారులు నారాయణ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. నారాయణ్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసే వినియోగదారుల్లో తెలంగాణకు చెందిన వారు ఐదుగురు ఉన్నారని తేలడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో గతంలోనూ డ్రగ్స్ భారీగా పట్టుబడ్డా.. డార్క్ నెట్ ప్రస్తావన రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈ కేసును సీరియస్ గా తీసుకుంటున్నారు పోలీసులు. తీగ లాగే కొద్దీ.. మరిన్న డార్క్ సీక్రెట్స్ బయటపడతాయనే అంచనాలున్నాయి.
తెలంగాణలో డ్రగ్స్ వాడుతున్న వారిలో ఎక్కువగా విద్యార్ధులు , సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ఉన్నారు. డ్రగ్స్ వాడుతున్న విద్యార్ధుల వివరాలను పోలీసులు ప్రకటించలేదు. ఇంటికి వచ్చే కొరియర్ కవర్లను పేరేంట్స్ ఓపెన్ చేయాలని సీపీ సూచించారు.
పట్టుబడిన వినియోగదారులు సంపన్న కుటుంబాలు, బాగా డబ్బు ఉన్నవారే ఉన్నారు. విక్కర్ మీ అనే యాప్ ద్వారా వీళ్ళు డార్క్ వెబ్ సైట్ లోకి వెళ్లి వీరు కావాల్సిన రకరకాల డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. డైరెక్ట్ బ్యాంక్ లావాదేవీలు కాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లించి డ్రగ్స్ తీసుకుంటున్నారు. వీరంతా ఫిల్మ్ ఇండస్ట్రీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఉన్నారు. స్టార్ హోటల్స్ లో పార్టీలు ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆర్డినరీ ట్రాన్స్ పోర్ట్ కాకుండా డార్క్ వెబ్ సైట్ ద్వారా నే ఈ దందా జరుగుతోంది.
హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలని సీఎం గతంలోనే ఆదేశాలు ఇవ్వడంతో.. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం తరువాత డ్రగ్స్ పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. డీప్ వెబ్, డార్క్ వెబ్ లలో కూడా వెళ్లి నిందితులను పట్టుకుంది నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్. హైదరాబాద్ లో ఎక్కువ కట్టుదిట్టం చేశారని. మేం హైదరాబాద్ వచ్చి అమ్మలేం.. మీరే రండి అని డ్రగ్స్ పెడ్లర్లు చెబుతున్నట్టు తేలింది. గోవా డ్రగ్స్ కి డెన్ గా మారింది .ఇటీవల గోవాలో బీజేపీ కార్యకర్త సోనాలీ ఫోగట్ డ్రగ్స్ డోస్ ఎక్కువై చనిపోయింది. ఇంటికి వచ్చే కొరియర్లపై నిఘా పెట్టాలని తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.
ప్రధాన నిందితుడు నరేంద్ర నారాయణ్ వ్యవహారశైలి కూడా బాగాలేదని పోలీసులు చెప్పారు. అరెస్ట్ చేయాడనికి ఇంటికి వెళ్తే కుక్కల్ని వదిలాడని చెప్పారు. కనీసం అతని ఇంటి కాంపౌండ్ వాల్ వరకు వెళ్ళడానికి కూడా పోలీసులకు ఎన్నో ఇబ్బందులు తప్పలేదు. డ్రగ్స్ వాడుతున్న పిల్లల గురించి చెబితే పేరేంట్స్ షాక్ అవుతున్నారని చెప్పారు పోలీసులు. తాము రంగంలోకి దిగకముందే.. హైదరాబాద్ లో డ్రగ్స్ వాడే వాళ్ళు, అమ్మే వాళ్ళు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ డ్రగ్స్ మత్తులో జోగుతోంది. నగరంలో స్కూలు పిల్లలు కూడా డ్రగ్స్ బానిసలే అనే భయంకరమైన నిజం ఎవ్వర్నీ మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నుంచి ఇంట్లో పిల్లల వరకూ వరకూ అందర్నీ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. సంపన్నుల పిల్లల నుంచి సామాన్యుల పుత్రరత్నాల వరకూ ఎవరూ డ్రగ్స్ వలలో పడరనే గ్యారెంటీ లేకుండా పోయింది. ఫలానా చోట డ్రగ్స్ పట్టుకున్నారు.. ఎవరో డ్రగ్స్ కు బానిసయ్యారు అని మనం న్యూస్ చదువుతున్నాం. కానీ మనింట్లో ఎంతమంది డ్రగ్స్ బాధితులున్నారో మాత్రం మనకు తెలియదు. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో పరిస్థితి ఇదే. డ్రగ్స్ భూతం కారణంగా.. ఇంట్లోవాళ్లను కూడా అనుమానించాల్సిన పరిస్థితి తరుముకొచ్చింది. పిల్లల దగ్గర్నుంచీ పెద్దవాళ్ల వరకూ అందరూ డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొన్నాళ్లకు హైదరాబాద్ సందుకో డీఅడిక్షన్ సెంటర్ కనిపించినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది. ఐదారంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కక్కుర్తి పడి డ్రగ్స్ తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చదివిస్తుంటే.. యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు. ఎవరు సరఫరా చేస్తారో తెలుసు. ఎవరు వాడతారో కూడా తెలుసు. అన్నీ తెలిసినా అధికారులు గమ్మున ఉంటున్నారు. ఎక్కడైనా, ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా.. పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషనైపోయింది. మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే. కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్, తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడం కష్టం. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్ వర్క్ లు చెలరేగిపోతున్నాయి.
ఒకప్పుడు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండే డ్రగ్స్ దందా.. ఇప్పుడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మార్చుకునే స్థాయికి చేరింది. ముంబై కంటై హైదరాబాద్ నుంచే విదేశాలకు కూడా డ్రగ్స్ సరఫరా ఈజీగా ఉంటుందనే స్థాయికి డ్రగ్స్ పెడ్లర్లు ఎదిగిపోయారు. ఓవైపు ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించి.. పోలీస్, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో సెపరేట్ సెల్ నియామకం చేసినా.. డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు. పేకాట క్లబ్బులు, గుడుంబాను అణచివేసిన తెలంగాణ సర్కారు.. డ్రగ్స్ దందాను కూడా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే విశ్వ నగరం కాస్తా డ్రగ్స్ సిటీగా మారి అపఖ్యాతి పాలయ్యే ప్రమాదం ఉంది.
డ్రగ్స్ రవాణాలో డార్క్ నెట్ ప్రస్తావన రావడం కలకలం రేపుతోంది. అసలు డార్క్ నెట్ ఏంటి..? అదెలా పనిచేస్తుంది..? డార్క్ నెట్ ను పోలీసులు యాక్సెస్ చేయగలరా..?
మనం క్యాజువల్ గా ఇంటర్నెట్ అని చెప్పుకుంటాం. అయితే మొత్తం నెట్ మనం చూసేది, పైకి కనిపించేది ఒక్క శాతం కూడా కాదు. మనం చూసేది పై పొర అయితే దాని కింద.. డీప్ నెట్.. ఇంకా లోతుకి వెళ్తే డార్క్ నెట్ ఉంటాయి. సాధారణ సెర్చ్ ఇంజిన్లు సర్పేస్ నెట్ అనుకుంటే.. కొన్ని పర్మిషన్లు అవసరమయ్యే పర్సనల్ మెయిల్ అకౌంట్లు, కార్పొరేట్ కంపెనీల సైట్లు డీప్ నెట్ కిందకు వస్తాయి. అదే డార్క్ నెట్ అయితే.. దాని ఉనికిని కనిపెట్టడం కూడా కష్టమే. సైబర్ నిపుణులకు కూడా సవాల్ విసిరే డార్క్ నెట్ ను చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకే కాదు.. సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్స్ కూడా ఉపయోగిస్తారు.
సాధారణంగా డార్క్ నెట్ ఉల్లిపొరలను పోలి ఉంటుంది. ఈ పొరలన్నింటినీ తీస్తే కానీ.. అసలు మ్యాటరేంటో అర్థం కాదు. ఇది మామూలువాళ్లకి ఓ పట్టాన మింగుడు పడే వ్యవహారం కాదు. అనైతిక కార్యకలపాలు, చట్ట విరుద్ధమైన పనుల కోసం డార్క్ నెట్ ను సేఫ్ వేగా భావిస్తారు. ఆయుధాల డీల్స్, సెక్స్ ట్రేడింగ్, ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ బిజినెస్ కూడా డార్క్ నెట్ ద్వారా జరుగుతోంది. డార్క నెట్లో సెండర్, రిసీవర్ కు తప్ప మిగతావాళ్లు యాక్సెస్ చేయడం అసాధ్యం అనే చెప్పాలి. అందుకే బహిరంగగా చేయలేని పనులన్నీ డార్క్ నెట్లో ప్రశాంతంగా చేసుకుంటున్నారు క్రిమినల్స్. డార్క నెట్ తో ప్రపంచంలో అత కిరాతకమైన క్రిమినల్ కార్టెల్స్ కు లింకులున్నాయంటే నమ్మాల్సిందే. కొన్ని కార్టెల్స్ సైట్లు కూడా డార్క్ నెట్ తో ఆపరేట్ అవుతున్నాయి.
సాధారణ సైబర్ నేరాల్నే కనిపెట్టలేక చేతులెత్తేస్తున్న పోలీసులు.. డార్క్ నెట్ అంతు చూస్తారా అనే ప్రశ్నలున్నాయి. సైబర్ నిపుణులకే కొరుకుడ పడని డార్క్ నెట్ లో పోలీసులు ఎలా విచారణ చేస్తారనేది తేలాల్సి ఉంది. సైబర్ నిపుణుల సహకారం తీసుకున్నా.. డార్క్ నెట్ ను యాక్సెస్ చేయడం, వచ్చే సమాచారం నిజమో.. కాదో నిర్థారణ చేసుకోవడం అంత వీజీ కాదనే వాదన ఉంది. అతి రహస్యంగా, మూడో కంటికి తెలియకుండా జరిగే బిగ్ డీల్స్ అన్నీ డార్క్ నెట్లోనే జరుగుతాయని చెబుతారు. ఇంటర్నెట్ లో మెజార్టీ వాటా డార్క్ నెట్ దే. కానీ చాలా మందికి ఆ సంగతి తెలియదు. అసలు డార్క్ నెట్ ఒకటి ఉందనే ఐడియా కూడా లేదు. ఇదే క్రిమినల్స్ కు అడ్వాంటేజ్ గా మారింది. ఎవరికీ డౌట్ రాకుండా.. గుట్టుచప్పుడు కాకుండా చట్ట విరుద్ధమైన పనులు చేయడం, భారీగా డబ్బులు పోగేయడమే టార్గెట్.
మెక్సికో లాంటి డ్రగ్స్ నెట్ వర్క్ లు ఎక్కువగా పనిచేసే దేశాల్లో డార్క్ నెట్ వాడకం విపరీతంగా ఉందనే వాదన ఉంది. అయితే మనం ఈ వార్తలు ఇప్పటిదాకా వినడమే కానీ.. ప్రత్యక్షంగా చూసింది లేదు. గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ బిజినెస్.. డార్క్ నెట్ సాయంతో హైదరాబాద్ కు డ్రగ్స్ కొరియర్ చేయడం చిన్న విషయం కాదు. ఈ కేసును ఇంకా లోతుగా తవ్వితే దేశంలో డార్క్ నెట్ డ్రగ్స్ నెట్ వర్క్ గుట్టేంటో తేలుతుంది. వీళ్లంతా దేశీయంగానే పనిచేస్తున్నారా.. ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలున్నాయా అనేది కూడా తేలాల్సిన అంశం. మామూలు డ్రగ్స్ కేసుల్లాగా.. డార్క్ నెట్ ను లైట తీస్కుంటే.. ప్రమదానికి తలుపులు తెరిచినట్టే. పెడ్లర్ల ద్వారా డ్రగ్స్ సప్లై చేయడంలో రిస్క్ ఎక్కువ. చాలా టైమ్ టేకింగ్ కూడా. అదే డార్క్ నెట్ అయితే సెకన్ల వ్యవధిలో వందల మందికి డ్రగ్స్ చేరిపోతాయ. ఇక్కడ రిస్క్ చాలా తక్కువ. అసలు లేదనే చెప్పుకోవచ్చు. డార్క్ నెట్ డ్రగ్స్ కేసును సరిగ్గా విచారించకపోతే.. భవిష్యత్తులో ప్రతి ఇంటర్నెట్ కేఫ్ లోనూ డార్క్ నెట్ ఆపరేటర్లు పుట్టుకొచ్చి.. మూడో కంటికి తెలియకుండా.. డ్రగ్స్ దందా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటిదాకా పబ్బుల్లో మాత్రమే డ్రగ్స్ దొరుకుతున్నాయి. రేపు ఇంటర్నెట్ సెంటర్లలో కూడా డ్రగ్స్ దందా జరిగే పరిస్థితి.. వాటికి అడ్డుకట్ట వేయడం ఇంకా కష్టమౌతుంది. పోలీసులు డార్క్ నెట్ ను శోధించకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పేలా లేదు.
డార్క్ నెట్ యాక్సెస్ చేయడం అంత తేలిక కాదు. ఈ విషయంలో పోలీసుల కష్టాలు పోలీసులకు ఉన్నాయి. అయినా సరే స్పెషల్ టీమ్స్ వేసి అయినా.. చివరి వరకు దర్యాప్తు చేయాల్సిందే. అప్పుడే డార్క్ నెట్ లింక్ దొరికినందుకు ఉపయోగం ఉంటుంది. లేకపోతే రేపు వేల సంఖ్యలో కొరియర్లు వస్తాయి. నగరానికి వచ్చే ప్రతి కొరియర్ ను ఓపెన్ చేసి చూడాల్సిన పరిస్థితి వస్తే.. అది అనవసర గందరగోళానికి, ఆందోళనకు దారితీస్తోంది. అపోహలు పెరిగి.. అశాంతి రేగే ప్రమాదం కూడా ఉంది. పైగా కొరియర్లోనే పంపాలని లేదు కదా. మరో మార్గం ఎంచుకుంటే పోలీసులు ఏం చేస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. రేపు హాల్ టికెట్లు, ఆఫర్ లెటర్ల పేరుతో వచ్చ కవర్లలోనూ డ్రగ్స్ వస్తే ఏం చేస్తారనేది తేలాల్సిన అంశం.
డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేసిన పోలీసులు.. తల్లిదండ్రులే జాగ్రత్తపడాలని చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. మత్తు మాఫియా ఎప్పుడూ ఓ దారి మూసేస్తే.. మరోదారి వెతుక్కుంటుంది. మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలని పేరెంట్స్ కు చెప్పేసి చేతులు దులుపుకుంటే.. ఇక పోలీసులు ఎందుకనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
తగ్గుముఖం పట్టిందనుకున్న డ్రగ్స్ రక్కసి మళ్లీ జడలు విప్పుతోంది. స్కూలుకు వెళ్లే విద్యార్థి టిఫిన్ బాక్స్ లో డ్రగ్స్ తీసుకెళ్తే ఏం చేయాలి. ఇంజినీరింగ్ స్టూడెంట్.. కాలేజ్ బ్యాగ్ లో డ్రగ్స్ ప్యాకెట్లు దొరికితే పరిస్థితేంటి. ఇవన్నీ ప్రశ్నలేం కాదు. డ్రగ్స్ దందాలో ఇప్పటివరకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మాత్రమే బయటపడ్డారు. కానీ టీచర్లు, లెక్చరర్లు లేరు అని మనం కరాఖండీగా చెప్పలేంది. పొరపాటున ఏ టీచరో, లెక్చరరో డ్రగ్ పెడ్లర్ అయ్యుంటే.. వాళ్లు తమ విద్యార్థుల్ని డ్రగ్స్ ఊబిలోకి దింపితే.. ఆ నష్టాన్ని ఊహించడం కూడా కష్టం. పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఇంటర్నేషనల్ స్కూల్లో సైలంట్ గా డ్రగ్స్ దందా నడవొచ్చు. జాబ్ గ్యారెంటీ ఇచ్చే ఇంజినీరింగ్ కాలేజీల్లో.. మనకు తెలియకుండానే.. డ్రగ్స్ పెడ్లర్లూ ఉండొచ్చు. ఎవ్వర్నీ నమ్మడానికి వీల్లేదు. దేన్నీ నిజం అనుకోవడానికి లేదు.
మన కళ్ల ముందే తిరుగుతూ, మనతో కలిసిమెలిసి ఉంటూ.. మనకు తెలియకుండానే మనల్ని డ్రగ్స్ కు బానిసల్ని చేసే పెద్ద వ్యవస్థ హైదరాబాద్ లో నడుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమ్తతంగా ఉండాల్సిందే. ఇక్కడ ఏ సెక్షన్ కూడా డ్రగ్స్ నెట్ వర్క్ కు అతీతం కాదు. డ్రగ్స్ పెడ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త వినియోగదారుల కోసం చూస్తారు. అలా కొత్త వినియోగదారుల్ని వెతికే క్రమంలో ఎవరిపై కన్ను పడ్డా.. వాళ్ల పని మటాష్ అయినట్టే. డ్రగ్స్ మొదటిగా పబ్బుల్లో మొదలయ్యాయి. పబ్బులకు వెళ్తేనే కదా ప్రాబ్లమ్ అనుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను బానిసల్ని చేసుకున్నాయి. కొన్ని సంస్థల్లో పట్టపగలే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ బ్రేకులు కూడా తీసుకునే స్థాయికి దిగజారిపోయారని కూడా వార్తలొచ్చాయి. మన పిల్లలు సాఫ్ట్ వేర్ కాదు కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీల్లోకి వచ్చేశాయి. అంటే హైదరాబాద్ లో ఇంటింటికీ డ్రగ్స్ ముప్పు పొంచి ఉన్నట్టే. ప్రమాదం మనం ఎక్కడకో వెళ్తే రావడం కాదు. ప్రమాదమే మన ఇంటికి వచ్చి తలుపు తడుతోంది. ఊరికే తలుపు తట్టి వెళ్లిపోవడం కాదు. తలుపు తీసి తీరాలని బలవంతం చేస్తోంది. పబ్బుల్లోంచి నట్టింట్లోకి నడిచొచ్చిన డ్రగ్స్.. భావితరాల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేస్తూ.. యువత ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా కొరియర్ల రూపంలో ఇంటి గుమ్మాల దగ్గరకు వచ్చేశాయి డ్రగ్స్. ఇప్పటికైనా మేలుకోకపోతే.. డ్రగ్స్ వినియోగం ఇంతింతై.. వటుడింతై అన్నట్టుగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒళ్లు తెలియని మత్తులో జోగుతున్న యువత… ఎన్నో అరాచకాలకు తెగబడుతోంది. ముఖ్యంగా యువకులు రోడ్ల మీదకు వస్తే యమకింకరులుగా మారిపోతున్నారు. అడ్డొచ్చిన వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తొలుత ఎంజాయ్‌మెంట్‌గా కనిపించినా… మెల్లమెల్లగా మధ్యతరగతి అమ్మాయిలు సంపన్నుల చేతుల్లో ఆటవస్తువుల్లా మారుతున్నారు. ఖరీదైన జీవితంపై మోజుపడి… తమ జీవితాల్నే నాశనం చేసుకుంటున్నారు. పబ్‌లకు వచ్చిన అమ్మాయిలకు రాఫ్నాల్ వంటి డేట్‌రేప్ డ్రగ్స్‌ను ఇచ్చి.. వారిని లోబర్చుకుంటున్నారు. ఆ తర్వాత దానిని ఆసరా చేసుకుని… వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పబ్‌ల్లో డ్రగ్స్ వాడకం కామన్ అన్నది బహిరంగ సత్యం. ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడ్డాక… దాని బారి నుంచి బయటపలేక… నరకయాతన అనుభవిస్తున్నారు. అమ్మాయి పబ్‌కు వెళ్లిందంటే సేఫ్‌గా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు.
సిగరెట్, బీర్, హుక్కా, గంజాయి… ఆపై డ్రగ్స్. జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కినట్టు… పతనంలో కూడా యువత ఒక్కో మెట్టూ దిగజారుతోంది. ఇంతలా యూత్‌ను పక్కదారి పట్టిస్తోంది పబ్ కల్చర్. పెచ్చురిల్లుతున్న పబ్ కల్చర్ యువత భవితను సర్వనాశనం చేస్తోంది. మనది కాని ఈ పబ్ కల్చర్ ఇప్పుడు మనల్నే ముంచేస్తోంది. గ్లోబలైజేషన్ డెవలప్‌మెంట్ పేరుతో మన దేశంలో అడుగుపెట్టిన ఈ పాశ్చాత్య సంస్కృతి… మన సమాజ జీవనాడుల్ని నిలువునా ముంచేస్తోంది. ఇలా అడుగు పెట్టాయోలేదో.. మెట్రో యూత్‌ను తమవైపు తిప్పుకున్నాయి. బడాబాబుల పిల్లలే కాదు.. మిడిల్ క్లాస్ యూత్‌ని కూడా తనవైపు లాక్కుంది. ఇలా పబ్బు మబ్బుల్లో విహరిస్తూ యువత ఫ్యూచర్ నాశనం చేసుకుంటుంటున్నారు.
డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా.. ఓ సామాజిక రుగ్మతలా చూడాలి. డ్రగ్స్ ను అడ్డుకోవడం, అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే డ్రగ్స్ ను అరికట్టగలం. మత్తు పదార్థాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలి. ముఖ్యంగా పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండాలి. మీ పిల్లలపై కన్నేసి ఉంచండి. ఇంటికి వచ్చే కొరియర్లు చెక్ చేయండి. వ్యవహారశైలిలో తేడా వస్తే గమనించండి లాంటి సూచనలు చేస్తే.. పోలీసుల పని పూర్తైనట్టు కాదు. డ్రగ్స్ సరఫరా అయ్యే అన్నిదారులూ మూసేయాలి. కొత్త మార్గాలు తెరవకుండా చూడాలి. నైట్ పెట్రోలింగ్ లాగా.. డ్రగ్స్ పెట్రోలింగ్ పార్టీలు రంగంలోకి దిగాలి. ప్రెస్ మీట్లు పెట్టి.. డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకుంటున్నారు కానీ.. అసలు సూత్రధారుల కూపీ లాగడం లేదనే విమర్శలున్నాయి. దీనికి పోలీసుల దగ్గర రెడీమేడ్ ఆన్సర్లు ఉంటున్నాయి. అసలు వాళ్లు ఎవరూ అనేది తెలియడం చాలా కష్టమని, పలు అంచెల్లో సాగే డ్రగ్స్ బిజినెస్ లో లాస్ట్ ఎండ్ కు చేరడం సులభం కాదనే వాదన ఉంటుంది. కానీ వివరణలతో సమస్యకు పరిష్కారం దొరకదు. గ్రేహౌండ్స్ పేరుతో అడవుల్నే జల్లెడ పట్టి మావోయిస్టుల్ని కట్టడి చేసినప్పుడు.. నగరాల్లో డ్రగ్స్ పెడ్లర్లకు అడ్డుకట్ట వేయడం, దారులు మూసేయడం పెద్ద పని కాదనే వాదన కూడా ఉంది. ఏదేమైనా డ్రగ్స్ విషయంలో పోలీస్ శాఖ.. సీరియస్ ప్రకటనలు కాకుండా సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.