నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు.. హాజరుకానున్న సీఎం
ఇవాళ ఉదయం 9. 30 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు మరి కొందరు మంత్రులు, నేతలు హాజరు కానున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉగాది వేడుకలకు కూడా సీఎం పాల్గొననున్నారు. ఇక, సాయంత్రం పీ4 కార్యక్రమం ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం.. సాయంత్రం 5 గంటలకు పీ4 కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు.
ప్రంపచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు..
ప్రంపచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అయితే, ఈరోజు (మార్చ్ 30) ఉదయం 9.30 గంటలకు వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం పంచాంగ శ్రవణం జరగనుంది. ఈ ఉగాది వేడుకలకు పలువురు వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో మేకు.. మండిపడిన భక్తులు
విజయవాడలోని ఇంద్రాకీలాద్రి అమ్మవారి ఆలయంలో వెలుగులోకి మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయట పడింది. శుక్రవారం నాడు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.. మహా మండపం కింద 4వ కౌంటర్ దగ్గర ప్రసాదం కౌంటర్ లో పులిహార పొట్లాలు కొనుగోలు చేశారు. అయితే, ప్రసాదం తింటుండగా అందులో ఒక్కసారిగా మేకు రావడంతో సదరు భక్తుడు షాక్ అయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అపరిశుభ్ర ప్రాంతాల్లో అమ్మవారి ప్రసాదం తయారు చేస్తున్నారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని ఎదురుచూపులు..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్సీ కమిషన్ గడువు ఏప్రిల్ 2, 2024న ముగియనుండగా, కమిషన్ ఛైర్మన్ శివశంకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో కమిషన్ గడువును మరో 4 నుంచి 6 నెలల పాటు పొడిగించాలని సూచించారు. గతంలో 2023 అక్టోబర్ 2న కమిషన్‌ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆరు నెలల్లో నివేదికను సమర్పించాలని పేర్కొంది. అయితే పలు కారణాలతో ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించబడింది. తాజా అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు గురించి అనేక సందేహాలు కొనసాగుతున్న తరుణంలో, కమిషన్ గడువు మరోసారి పెంచుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వేతన సవరణ కోసం నిరీక్షణలో ఉన్న ఉద్యోగులు, త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలని ఆశిస్తున్నారు.
పండగ పూట విషాదం.. చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ఇద్దరు కుమారులు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన వారు మౌనిక (26), మైథిలి (10), వినయ్ (7), అక్షర (9)గా గుర్తించారు. మృతదేహాల్లో మౌనికదే ఇంకా లభ్యం కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మౌనిక పిల్లలతో కలిసి చెరువు వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మౌనిక మృతదేహాన్ని వెలికితీయడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో పండగ పూట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
అమిత్ షాని కలవడానికి 4 కార్లు మారాడు.. పళని స్వామిపై స్టాలిన్ ఫైర్..
తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ పొత్తు చిగురించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ భేటీపై సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న సమయంలో అసెంబ్లీలో లేకపోవడాన్ని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లు ముస్లింల హక్కుల్ని హరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు ముస్లింలు మాత్రమే కాదు, భారతదేశం అంతటా ఉన్న ముస్లింలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు చేసిన తీర్మానాన్ని స్వాగతించారని స్టాలిన్ అన్నారు. అయితే, ఇలాంటి కీలక తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సమయంలో పళని స్వామి గైర్హాజరు కావడంపై ఆయన ఆరోపణలు చేశారు. ‘‘ఎందుకు హాజరు కాలేదో అందరికి తెలుసు. తెల్లవారుజామున ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, అతను ఢిల్లీ విమానం ఎక్కడా. స్కామ్‌లో ఇరుక్కున్న వ్యక్తిలాగా ఆయన అమిత్ షాని కలవడానికి నాలుగు కార్లు మార్చారు’’ అని స్టాలిన్ అన్నారు.
నేడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్రమోడీ గుడు పడ్వా, ఉగాది పండగ సందర్భంగా ఈ రోజు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన స్మృతి మందిర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపక నాయకులకు నివాళులు అర్పిస్తారని శనివారం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మోడీ తన పర్యటనలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్, సంస్థ రెండో సర్సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పిస్తారు. 1956లో వేల మందితో కలిసి అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్ష భూమిలో బీఆర్అంబేద్కర్‌కి కూడా నివాళులర్పిస్తారు. మాధవ్ నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఫెసిలిటీలో 250 పడకల ఆస్పత్రి, 14 ఔట్ పేషెంట్ విభాగాలు (OPDలు), 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి.
హెచ్‌సీఏ అధ్యక్షుడి బెదిరింపులు.. హైదరాబాద్ వీడిపోతామంటున్న ఎస్‌ఆర్‌హెచ్!
నిత్యం వివాదాల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)ను బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ హైదరాబాద్ నగరాన్ని వీడిపోతామని హెచ్చరించింది. ఐపీఎల్ 2025 సందర్భంగా కోరినన్ని ఫ్రీ పాస్‌లు ఇవ్వనందుకు ఓ మ్యాచ్‌లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్లు సన్‌రైజర్స్ ప్రతినిధి ఒకరు హెచ్‌సీఏ కోశాధికారికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంత వేదికైన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తమ ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడటం గురించి పునరాలోచించుకుంటామని, అవసరమైతే హైదరాబాద్ వీడిపోతామని హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏ, ముఖ్యంగా అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ఆడడం ఇష్టం లేనట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో మాట్లాడి మరో వేదికకు మారిపోతామని స్పష్టం చేశారు. హెచ్‌సీఏ నుంచి గత రెండేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లేఖలో రాసుకొచ్చారు.