Team India: టీ20 ఫార్మాట్‌లో ఐసీసీ నంబర్‌వన్ ఆటగాడిగా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నా అతడిని వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉంచడాన్ని పలువురు అభిమానులు సహించలేకపోతున్నారు. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని జట్టులోకి తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు. సూర్యకుమార్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టలేకున్నా ఇది సరికాదని అభిప్రాయపడుతున్నారు.
Read Also: Varisu: ట్విట్టర్ రివ్యూ… దిల్ రాజు మంచి ఛాన్స్ మిస్ అయ్యాడట
అయితే పరిస్థితులు చూస్తుంటే 32 ఏళ్ల సూర్యకుమార్‌ను కేవలం టీ20లకే పరిమితం చేసేలా టీమిండియా వ్యూహాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య ఫామ్‌ను బట్టి చూస్తే వన్డేల్లో అతడికి స్థానం కల్పిస్తే ఈ ఏడాది జరిగే ప్రపంచకప్‌కు జట్టు బలంగా ఉంటుంది. కానీ సీనియర్ ఆటగాళ్ల కారణంగా సూర్యకు ఇలా జరగడాన్ని మాజీ క్రికెటర్లు కూడా తప్పుబడుతున్నారు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ చక్కగా రాణిస్తూ జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు. అందుకే శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కూడా సూర్యను పక్కన పెట్టిన రోహిత్.. అయ్యర్‌కే అవకాశం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ పెద్దగా రాణించకున్నా అతడి బ్యాటింగ్‌లో ఇంటెంట్ స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సూర్యకు వన్డేల్లో అవకాశాలు దొరకడం కష్టంగా కనిపిస్తోంది.