మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ (93; 91 బంతుల్లో 8×4, 1×6) సూపర్ ఇన్నింగ్స్ ఆడగా.. శుభ్‌మన్ గిల్ (56), శ్రేయస్ అయ్యర్ (49) రాణించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో గాయం బాధిస్తున్నా వాషింగ్టన్ సుందర్ జట్టు కోసం బ్యాటింగ్ చేశాడు.
వడోదరలో మ్యాచ్ మధ్యలోనే వాషింగ్టన్ సుందర్ మైదానాన్ని వీడాడు. సుందర్ 5 ఓవర్లలో 27 పరుగులే ఇచ్చి పరుగులు కట్టడి చేశాడు. అయితే 5వ ఓవర్ అనంతరం అతడు వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో వాషీ మైదానాన్ని వీడాడు. మరలా బౌలింగ్ చేయడానికి రాలేదు. సుందర్ స్థానంలో తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ చేశాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో తన అవసరం పడడంతో.. ఆరో వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చాడు. వాషీ ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. సింగిల్ తీసే క్రమంలో మరింతగా ఇబ్బంది పడ్డాడు. అయినా కేఎల్ రాహుల్‌కు అండగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. సుందర్ 7 బంతుల్లో 7 రన్స్ చేశాడు. ‘సూపర్ వాషీ’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.