Virender Sehwag Satire On Team India Performance: కొంతకాలం నుంచి భారత క్రికెట్ జట్టు ఎంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. మొన్న ఆసియా కప్, నిన్న టీ20 వరల్డ్‌కప్, ఇప్పుడు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. ఈ మూడింటిలోనూ అత్యంత చెత్త పెర్ఫార్మెన్స్‌తో భారీ పరాభావాల్ని చవిచూసింది. మరీ ముఖ్యంగా.. బంగ్లా చేతిలో సిరీస్ కోల్పోవడం ప్రతి భారతీయుడ్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఇంకో మ్యాచ్ మిగిలుండగానే, బంగ్లాకు సిరీస్‌ను అప్పగించేయడంతో.. టీమిండియాపై దుమ్మెత్తిపోస్తున్నారు. చెప్పుకోవడానికి జట్టులో ప్రతిభావంతులే ఉన్నప్పటికీ.. కనీస పోరాట పటిమ కనబర్చడం లేదంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో టీమిండియాపై సెటైర్ వేశాడు. ‘‘మన టీమిండియా ప్రదర్శన క్రిప్టో కరెన్సీ కంటే దారుణంగా పతనమవుతోంది. భారత జట్టుని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ మాటతో భారత అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు. ఇది పురుషుల వన్డేల్లో టీమిండియాకు 436వ ఓటమిని, ప్రపంచంలోనే ఇది అత్యంత చెత్త రికార్డ్ అంటూ.. ఫ్యాన్స్ కొన్ని గణాంకాలకు షేర్ చేస్తున్నారు. మీలాంటి విధ్వంసకర ఆటగాడు జట్టులో లేని లోటు కనిపిస్తోందంటూ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. సెహ్వాగ్ చెప్పినట్టు.. జట్టులో చాలా మార్పులు చేయాలని, ఆటగాళ్లు ఫిట్నెస్‌పై కూడా ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.
కాగా.. బంగ్లాదేశ్‌తో ఆడుతున్న మూడే మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ సరిగ్గా లేకపోవడం, మిస్ ఫీల్డ్స్ చేయడంతో.. ఓటమి చడిచూడాల్సి వచ్చింది. రెండో మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్లు మొదట్లో చేతులెత్తేయడంతో, లక్ష్యాన్ని చేధించలేకపోయారు. దీంతో.. ఈ సిరీస్ బంగ్లా కైవసం చేసుకుంది. ఇక మూడో మ్యాచ్ ఛటోగ్రామ్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పేసర్లు దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ గాయం కారణంగా దూరమయ్యారు. ఈ మ్యాచ్ అయినా గెలవాలని ఫ్యాన్స్ భారత్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. లేకపోతే క్వీన్ స్వీప్ అయ్యారన్న ముద్ర పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
Cryptos se bhi tez gir rahi hai apni performance yaar. Need to shake up – wake up.
— Virrender Sehwag (@virendersehwag) December 7, 2022