రాంచీ వేదికగా ఇవాళ కివీస్‌తో రెండో టీ-20 జరగనుంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రెండో టీ-20లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ ఆపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.మూడు మ్యాచుల టీ-20 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఇవాళ కివీస్‌తో రెండో మ్యాచులో తలపడనుంది. రాంచీ వేదికగా సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి జట్టులో ఉన్న ఆటగాళ్లతోనే ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది భారత్.
తొలి టీ-20లో కివీస్‌ను మట్టికరిపించిన రోహిత్ సేన.. దూకుడుతో ఉంది. రెండో టీ-20 గెలిస్తే సిరీస్ భారత్ వశమైనట్లే.అటు ఎలాగైన ఓటమికి బదులు తీర్చుకుని.. సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది న్యూజిలాండ్. అయితే ఇందులో టాస్ కీలకంగా మారనుంది. మ్యాచ్ ప్రారంభంలో మంచు ప్రభావం కనిపిస్తుందని.. అందుకే టాస్ ప్రధానంగా మారనుందని పిచ్ క్యూరేటర్ చెబుతున్నారు. బ్యాటింగ్ పిచ్ కావడంతో.. రెండో టీ-20లో పరుగులు భారీగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాంచీ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. రెండో టీ20ని వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా కారణంగా సగం మంది ప్రేక్షకులతోనే మ్యాచ్‌ను నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 100 శాతం సామర్థ్యంతో ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.