ఐపీఎల్ పుణ్యమా అని, ఎందరో యువ ఆటగాళ్ళ ప్రతిభ బయటపడింది. ఒక్క అవకాశం అంటూ కలలు కన్న ఎందరో ప్లేయర్స్‌కి.. ఈ టీ20 లీగ్ ఒక అద్భుత వరంలా మారింది. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ సీజన్స్‌లో చాలామంది యంగ్‌స్టర్స్ తమ సత్తా చాటి.. అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియాలో చోటు దక్కిందా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే.. క్రీడాభిమానుల గుండుల్లో మాత్రం తమదైన ముద్ర వేయగలిగారు. ఇప్పుడు లేటెస్ట్‌గా అలాంటి ఆటగాళ్ళ జాబితాలోకి తెలుగుతేజం నంబూరి తిలక్ వర్మ చేరిపోయాడు. ఈ సీజన్‌లో ముంబై తరఫున ఆడిన అతగాడు కొత్త చరిత్ర సృష్టించాడు.
ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ.. రెండు అర్థశతకాలు, 29 ఫోర్లు, 16 సిక్సర్లతో మొత్తం 397 పరుగులు చేశాడు. దీంతో.. డెబ్యూ సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ జాబితాలో తిలక్ చేరిపోయాడు. అగ్రస్థానంలో షాన్ మార్ష్ 616 పరుగులతో (2008 సీజన్‌లో) ఉన్నాడు. ఇక రెండు, మూడు స్థానాల్లో.. దేవదత్ పడిక్కల్ (2020 సీజన్ – 473 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (2015 సీజన్ – 439 పరుగులు) ఉన్నారు. లేటెస్ట్‌గా 397 పరుగులతో, తిలక్ వర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. చివరి ఐదో స్థానంలో రాహుల్ త్రిపాఠి 2017లో 391 పరుగులు సాధించాడు.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుగా విఫలమైనప్పటికీ.. తిలక్ వర్మ మాత్రం అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. డెబ్యూ సీజన్‌లోనే ఇంత బాగా రాణించాడంటే, రానున్న సీజన్స్‌లో కచ్ఛితంగా కీలక ప్లేయర్‌గా అవతరించడం ఖాయమని క్రికెట్ నిపుణులు చెప్తున్నారు. ఇదిలావుండగా.. ఈ సీజన్ ప్లేఆఫ్స్ నుంచి నిష్ర్కమించిన ముంబై, పోతూ పోతూ ఢిల్లీ క్యాపిటల్స్ ఆశల్ని కూడా నీరుగార్చేసింది. మ్యాచ్ గెలిస్తే కచ్చితంగా ప్లేఆఫ్ చేరాల్సిన ఢిల్లీ.. ముంబై దెబ్బకు ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. దీంతో.. ఆర్సీబీకి ప్లేఆఫ్స్‌లో బెర్తు కన్ఫమ్ అయ్యింది.