Team India: ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియాపై పలువురు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అసలు టీమిండియా ఆసియాకప్‌కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీ పరమ చెత్తగా ఉందని.. అతడి నిర్ణయాలు అంతుబట్టలేని విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆసియా కప్‌ను ప్రయోగాల కోసం వాడుకుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌పైనా దుమ్మెత్తి పోస్తున్నారు. టీ20 ప్రపంచకప్ మరో నెలరోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా టీమ్ సెట్ కాకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. అసలు కోచ్ ద్రవిడ్ ఏం చేస్తున్నాడని మండిపడుతున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా విఫలమైన రోహిత్ శర్మ దానికి కొనసాగింపుగా ఆసియాకప్‌లో నాయకత్వం వహించాడని నెటిజన్‌లు సెటైర్లు వేస్తున్నారు. దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎందుకు జట్టులోకి తీసుకున్నారో రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లకు అయినా తెలుసా అని టీమిండియా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, సంజు శాంసన్ వంటి ప్రతిభావంతులను పక్కన పెట్టి దినేష్ కార్తీక్, అశ్విన్‌లను తీసుకోవడం సరైన పద్ధతి కాదని.. పోనీ తీసుకున్న వాళ్లు తుది జట్టులో ఆడించకపోవడం నేరమని అభిప్రాయపడుతున్నారు. దినేష్ కార్తీక్‌ను కాదని రిషబ్ పంత్.. రవి బిష్ణోయ్‌ను కాదని రవిచంద్రన్ అశ్విన్‌లకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన వాళ్లు విఫలం కాకుండానే జట్టు నుంచి ఎలా తప్పిస్తారని.. ఇలాంటి చెత్త నిర్ణయాలే టీమిండియా కొంప ముంచాయంటున్నారు.
Read Also: Ricky Ponting: అతడే ఇప్పుడు ఉత్తమ టీ20 ఆల్‌రౌండర్
టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా ఈ జట్టుతోనే వెళ్తే లీగ్ దశలోనే తిరిగి రావడం పక్కా అని జోస్యం చెప్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చేసిన తప్పులనే రోహిత్ శ్రీలంక మ్యాచ్‌లోనూ రిపీట్ చేశాడని.. దీపక్ హుడాను ఆరో బౌలర్‌గా వాడుకోకపోవడం, 19వ ఓవర్‌ను అర్ష్‌దీప్‌తో కాకుండా భువనేశ్వర్‌తోనే వేయించడం లాంటి తప్పులను ఎత్తి చూపుతున్నారు.