Ricky Ponting Praises Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో.. మాజీలందరూ ఎవరెవరు, ఏయే జట్లలో ఉంటే బెటరన్న అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. కొందరు క్రికెటర్లను ఎంపిక చేసుకొని, తమ టీమ్‌ని ప్రకటిస్తున్నారు. ఫలానా ఆటగాళ్లు ఆడితే తిరుగు ఉండదని, ఆయా ఆటగాళ్లకు అవకాశం తప్పకుండా కల్పించాల్సిందేనంటూ.. సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అలాంటి సూచనలే ఇచ్చాడు. తన తుది జట్టులోని తొలి ఐదుగురు ఆటగాళ్లను ఎంపిక చేశాడు. అందులో హార్దిక్ పాండ్యా, బుమ్రాలకు స్థానం ఇచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడున్న ఆటగాళ్లలో అతడే అత్యుత్తమ టీ20 ఆల్‌రౌండర్ అని కితాబిచ్చాడు.
‘‘గతంలో పోలిస్తే, హార్దిక్ పాండ్యా ఇప్పుడు తన ఆటని బాగా మెరుగుపరుచుకున్నాడు. అతడు క్రికెట్‌ను ఇంతకుముందు కన్నా బాగా అర్థం చేసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో బాగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్‌లో అతడే అత్యుత్తమ ఆల్‌రౌండర్ కావొచ్చు. వన్డేల్లోనూ అతడు అత్యుత్తమ ఆల్‌రౌండర్ కావొచ్చు’’ అని రికీ పాంటింగ్ చెప్పాడు. ఇక బుమ్రా గురించి మాట్లాడుతూ.. ‘‘బుమ్రా ఇప్పుడు ఫుల్ పామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి అన్ని ఫార్మాట్లలో అత్యంత పరిపూర్ణ బౌలర్ అతడే’’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరితో పాటు రికీ పాంటింగ్ తమ తుది జట్టులోని ఐదుగురు సభ్యుల్లో రషీద్ ఖాన్, బాబర్ ఆజామ్, బట్లర్‌లను ఎంపిక చేసుకున్నాడు.