Team India: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం నాడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించగా.. నాగపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో హైదరాబాద్‌లో జరిగే టీ20లో ఎవరు గెలిస్తే వాళ్లు సిరీస్ కైవసం చేసుకుంటారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు అందుకున్న తొలి జట్టుగా రోహిత్ సేన నిలవనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ నెలకొల్పిన రికార్డును టీమిండియా బద్దలు కొట్టనుంది. ఇప్పటివరకు ఈ ఏడాది మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్ 20 విజయాలను నమోదు చేసింది.
Read Also:Team India: రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు
గత ఏడాది బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు 20 విజయాలను అందుకుంది. పాకిస్థాన్ రికార్డును నాగపూర్ టీ20లో గెలిచి టీమిండియా సమం చేసింది. ఇప్పుడు ఉప్పల్‌లో జరిగే టీ20లో గెలిస్తే 21వ విజయంతో భారత్ కొత్త చరిత్ర సృష్టిస్తుంది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు హైదరాబాద్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం నానా గందరగోళం నెలకొంది. టిక్కెట్ల కోసం తొక్కిసలాట కూడా జరిగింది. ఈ ఘటనకు హెచ్‌సీఏ కారణమని పలువురు.. కాదు పోలీసులే కారణమని హెచ్‌సీఏ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ వైఖరే దీనికి కారణమని అందరూ నిందిస్తున్నారు. కాగా ఉప్పల్ జరిగే టీ20లో రిషబ్ పంత్‌ను తప్పించి భువనేశ్వర్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అటు చాహల్ బదులు అశ్విన్‌ను తీసుకుంటారని కూడా టాక్ నడుస్తోంది.