ఐపీఎల్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌కు ఇప్పటివరకు స్పాన్సర్‌గా కొనసాగుతున్న చైనా కంపెనీ ‘వివో’తో బీసీసీఐ బంధం తెంచుకున్నట్లు తెలుస్తోంది. వివో స్థానంలో భారతీయ కంపెనీ టాటా రానున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. ఐపీఎల్ స్పాన్సర్‌గా వ్యవహరించడానికి టాటా గ్రూప్ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. దీంతో త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 టైటిల్ స్పాన్సర్‌గా టాటా కంపెనీ వ్యవహరించనుంది.
Read Also: మయాంక్‌కు నిరాశ.. ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అతడే…!!
ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరగనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో 2018-2022 కాలానికి ఐపీఎల్ స్పాన్సర్ హక్కులను చైనీస్ మొబైల్ కంపెనీ వివో దక్కించుకుంది. ఏడాదికి రూ.440 కోట్ల చొప్పున రూ.2200 కోట్లకు హక్కులను వివో కంపెనీ సొంతం చేసుకుంది. అయితే 2020లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో భారత సైనికుల ఘర్షణ తర్వాత పరిణామాలు మారిపోయాయి. 2020లో జరిగిన ఐపీఎల్‌కు డ్రీమ్ లెవన్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే 2021లో జరిగిన సీజన్‌కు మాత్రం మళ్లీ యథావిధిగా వివో కంపెనీనే స్పాన్సర్‌గా కొనసాగింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఏడాది అనూహ్యంగా ఐపీఎల్ పాలకమండలి వివో కంపెనీతో బంధం తెంచుకుంది.