South Africa Trash Bangladesh: యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో బౌలర్ల జోరు కొనసాగుతోంది. సూపర్ బౌలింగ్‌తో చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని.. కొన్ని టీమ్స్ అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. పాకిస్థాన్‌పై భారత్ 119 పరుగులను కాపాడుకుంటే.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 113 పరుగులే చేసి విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్-డీలో భాగంగా సోమవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. గొప్ప బౌలింగ్ ప్రదర్శనతో సఫారీ జట్టును కట్టడి చేసిన బంగ్లా.. విజయానికి చేరువగా వచ్చి చివర్లో ఓటమి పాలైంది.
బంగ్లా బౌలర్లు తంజిమ్ హసన్ (3/18), తస్కిన్ అహ్మద్ (2/19) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 113 పరుగులే చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (46; 44 బంతుల్లో 2×4, 3×6), డేవిడ్ మిల్లర్ (29; 38 బంతుల్లో 1×4, 1×6) రాణించారు. హెండ్రిక్స్ (0) డికాక్ (18), స్టబ్స్ (0), మార్‌క్రమ్ (4) విఫలమయ్యారు. 23 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడిన జట్టును క్లాసెన్, మిల్లర్ ఆదుకున్నారు. ఈ ఇద్దరు అయిదో వికెట్‌కు 79 పరుగులు జోడించి.. ఇన్నింగ్స్ ఆఖర్లో ఔటయ్యారు.
Also Read: Delhi Water Crisis : నీటి ఎద్దడితో ఇబ్బందుల్లో ఢిల్లీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
అనంతరం సూపర్ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. కేశవ్ మహరాజ్ (3/27), కాగిసో రబాడ (2/19), అన్రిచ్ నోకియా (2/17) విజృంభించడంతో తడబడ్డ బంగ్లా.. 7 వికెట్లకు 109 పరుగులే చేసింది. బంగ్లా బ్యాటర్లలో హృదోయ్ (37) టాప్ స్కోరర్. చివరి 3 ఓవర్లలో 20 పరుగులు చేయాల్సి రావడంతో బంగ్లానే గెలిచేలా కనిపించింది. అయితే రబాడ, బార్ట్‌మన్, మహరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బంగ్లాను పరుగులు చేయకుండా అడ్డుకున్నారు.