Pakistan 1st Victory in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. మంగళవారం గ్రూప్-ఏ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పనికూన కెనడాపై గెలిచింది. కెనడా నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (33; 33 బంతుల్లో 1×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గ్రూప్-ఏలో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌లలో పాకిస్తాన్ రెండు ఓడి.. ఒకటి గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా.. పాక్ సూపర్-8 చేరుకునే అవకాశాలు తక్కువ. గ్రూప్-ఏ భారత్, అమెరికా అగ్రస్థానాల్లో ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ అరోన్ జాన్సన్ (52; 44 బంతుల్లో 4×4, 4×6) ఒంటరి పోరాటం చేశాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన జాన్సన్.. 14వ ఓవర్లో జట్టు స్కోరు 73 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా నిష్క్రమించాడు. 73 పరుగులలో ఆరోన్ ఒక్కడి స్కోరే 52 పరుగులు కావడం విశేషం. నవ్‌నీత్ (4), పర్గత్ (2), నికోలస్ (1), మొవ్వ శ్రేయస్ (2), రవీందర్‌పాల్ (0) నిరాశపరిచారు. సాద్ బిన్ జాఫర్ (10), కలీమ్ (13 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్, మొహమ్మద్ ఆమిర్ చెరో 2 వికెట్లు తీశారు.
Also Read: Astrology: జూన్ 12, బుధవారం దినఫలాలు
ఛేదనలో పాక్ ఓపెనర్ సయిమ్ అయూబ్ (6) విఫలమయ్యాడు. ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను మహ్మద్ రిజ్వాన్ (53 నాటౌట్; 53 బంతుల్లో 2×4, 1×6) తీస్కున్నాడు. బాబర్ అజామ్ అండతో జట్టును స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. ఆజామ్‌ను ఔట్ చేసిన హెలిజర్.. ఈ జంటను విడగొట్టాడు. పాక్ విజయానికి 30 బంతుల్లో 22 రన్స్ అవసరం అవ్వడంతో పాక్ కంగారుపడలేదు. దూకుడుగా ఆడిన రిజ్వాన్ మిగతా పని పూర్తి చేశాడు. దాంతో 15 బంతులు మిగిలుండగానే పాక్ విజయం సాధించింది.