ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021 లో భారత్ ఈరోజు న్యూజిలాండ్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ గెలిస్తేనే కోహ్లీసేన సెమీస్ రేసులో ఉంటుంది. దాంతో ఈ మ్యాచ్ తుది జట్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్ కి తుది జట్టులో మార్పులు చేస్తే మంచిదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ సూచన చేశాడు. అయితే భారత్ నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఆడించాలని మనోజ్ తివారి సూచించాడు. కోహ్లీసేన బ్యాటింగ్ ఆర్డర్ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, టాప్ ఆర్డర్ వైఫల్యమే దాయాదుల పోరులో ఓటమికి కారణమైందని అతడు వెల్లడించాడు. రవీంద్ర జడేజాను నాలుగో స్థానానికి ప్రమోట్ చేయాలి. ఎందుకంటే న్యూజిలాండ్‌తో మనం కీలకమైన మ్యాచ్ ఆడుతున్నాం. జడేజా తర్వాత రిషబ్ పంత్ క్రీజులోకి రావాలి. చివరి ఓవర్లలో పంత్ చెలరేగుతాడు అని తివారి అభిప్రాయపడ్డాడు.