T20 World Cup Controversy: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చర్చల సందర్భంగా అనుకోని అడ్డంకితో మళ్లీ వివాదం ప్రారంభమైంది. ఢాకాకు వెళ్లాల్సిన ఐసీసీ ప్రతినిధి బృందం, వీసా సమస్యల కారణంగా ఒక్కరికి పరిమితమైంది. ఐసీసీ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ విభాగం అధిపతి ఆండ్రూ ఎఫ్గ్రేవ్ ఈరోజు (జనవరి 17న) ఒంటరిగానే బంగ్లా రాజధాని ఢాకాకు చేరుకున్నారు. అయితే, భారతీయ పౌరసత్వం కలిగిన మరో సీనియర్ ఐసీసీ అధికారికి సమయానికి వీసా రాకపోవడంతో ప్రయాణం రద్దు చేసుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది.
Read Also: PM Modi: తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన మోడీ
కాగా, ఈ పర్యటనను ఐసీసీ చివరి ప్రయత్నంగా భావిస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనే విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ చర్చలు కీలకంగా మారాయి. భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ తమ జట్టు భారత్‌లో ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని అధికారికంగా కోరాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతపై ఉన్న ఆందోళనలే ఈ డిమాండ్‌కు ప్రధాన కారణమని పేర్కొన్నాయి.
Read Also: Tamil Nadu Elections: పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. మ్యానిఫెస్టో విడుదల చేసిన ఏఐఏడీఎంకే
ఇక, ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రూ ఎఫ్గ్రేవ్ భుజాలపై మొత్తం బాధ్యత పడింది. అంతర్జాతీయ క్రీడా భద్రత రంగంలో అనుభవం కలిగిన మాజీ బ్రిటిష్ పోలీస్ అధికారి అయిన ఎఫ్గ్రేవ్, భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు పటిష్టమైన భద్రత కల్పించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉందని వివరించే సమగ్ర భద్రతా ప్రణాళికను బీసీబీకి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికతో బంగ్లాదేశ్ అధికారుల ఆందోళనలను తొలగించాలని ఐసీసీ ఆశిస్తోంది.
Read Also: Lava Blaze Duo 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. AMOLED డిస్‌ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
కాగా, ఇదిలా ఉంటే, భారతీయ పౌరసత్వం కలిగిన ఐసీసీ అధికారి వీసా పొందలేకపోవడం భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ వీసా అంశంపై ఐసీసీ అధికారికంగా స్పందించకపోయినా, సంస్థలో అసంతృప్తి నెలకున్నట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా మూడు వారాల సమయం కూడా లేకపోవడంతో.. ఈ వివాదం త్వరగా పరిష్కారం అవుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఆండ్రూ ఎఫ్గ్రేవ్ బంగ్లాదేశ్‌ను ఒప్పించడంలో విఫలమైతే, టోర్నమెంట్ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని క్రీడా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒక్క బంతి పడక ముందే ప్రపంచ కప్ భవితవ్యం ఈ చర్చలపై ఆధారపడటం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.