Australia Out From T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఊహించని విజయం సాధించింది. బంగ్లాను 105 పరుగులకే ఆలౌట్ చేసి.. 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. ఈ విజయంతో నేరుగా గ్రూప్ 1 నుంచి అఫ్గాన్ సెమీస్ చేరింది. అఫ్గాన్ విజయంతో సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇప్పటికే గ్రూప్ 1 నుంచి భారత్ నాకౌట్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇదే గ్రూప్‌లో ఉన్న బంగ్లా కూడా ఇంటిదారి పట్టింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 115 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (43; 55 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరి పోరాటం చేశాడు. రషీద్ ఖాన్ (19 నాటౌట్; 10 బంతుల్లో 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశాడు. అఫ్గాన్ కీలక బ్యాటర్లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ (3/26) మూడు వికెట్స్ పడగొట్టాడు. ముస్తాఫిజుర్ (1/17), తస్కిన్ అహ్మద్ (1/12) అఫ్గాన్‌ను కట్టడి చేశారు.
ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్ రషీద్ ఖాన్ (4/23), పేసర్ నవీనుల్ హక్ (4/26) తలో నాలుగు వికెట్లతో చెలరేగారు. లిటన్ దాస్ (54 నాటౌట్; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. వర్షం పడటంతో మ్యాచ్ మధ్యలో కొద్దిసేపు ఆగిపోయింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత లిటన్ దాస్ దూకుడుగా ఆడాడు. దీంతో బంగ్లాదేశ్ పవర్‌ప్లేలో 46 పరుగులు చేసి విజయం దిశగా సాగింది. ఐతే రషీద్ ఖాన్ ఎంట్రీతో అఫ్గాన్ తిరిగి పోటీలోకి వచ్చింది. వరుస ఓవర్‌లో వికెట్లు తీస్తూ బంగ్లాను కష్టాల్లో పడేశాడు. రషీద్ దెబ్బకు బంగ్లా 11 ఓవర్లకు 80/7తో నిలిచింది. మరోసారి వర్షం పడటంతో బంగ్లా లక్ష్యాన్ని 19 ఓవర్లకు 114 పరుగులుగా కుదించారు. 19వ ఓవర్‌లో నవీనుల్ వరుస వికెట్లు తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక గురువారం ఉదయం దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ సెమీఫైనల్ ఆడనుంది.