టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ వచ్చే ఫిబ్రవరి 7న ప్రారంభమై.. మార్చి 8న ముగుస్తుంది. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టోర్నీపై తన జోస్యం చెప్పాడు.
Also Read: Samsung Black Friday Sale: ‘శాంసంగ్’ స్మార్ట్ టీవీ కొనండి.. 93 వేల ఉచిత సౌండ్‌బార్ పట్టండి!
‘వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అహ్మదాబాద్‌లో జరిగింది. దేవుడి దయతో మేము ఆ ఫైనల్‌లో ఆడాం. టీ20 ప్రపంచకప్ 2024ను కైవసం చేసుకున్నాం. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్ కచ్చితంగా వెళ్తుంది. ఫైనల్‌లో ఏ టీమ్ మీద భారత్ ఆడినా చూడ్డానికి బాగుంటుంది. కచ్చితంగా టీమిండియా ఫైనల్‌లో ఆడుతుందని నేను ఆశిస్తున్నా. మరి ఏం జరుగుతుందో చూద్దాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు. 2007లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచింది. 17 సంవత్సరాల అనంతరం 2024లో రోహిత్ నాయకత్వంలో పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.