ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నమెంట్ 2026 ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమై.. మార్చి 8న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీలో అడుగుపెట్టనుంది. టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్‌లో చేర్చడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా, 2024 టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మ, 2025 మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లు షెడ్యూల్‌ను లాంఛనంగా విడుదల చేశారు. ఫైనల్ సహా టోర్నీలో 55 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్‌లో పాల్గొనే 20 జట్లను 5 జట్ల చొప్పున మొత్తం 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్-8లో కూడా జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ దశలో ప్రతి గ్రూప్‌లోనూ టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్‌లో గెలిచిన రెండు టీమ్స్ ఫైనల్ ఆడతాయి.
ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం… ప్రతి గ్రూప్‌లో రెండు టాప్ టీమ్స్ ఉండగా, మిగతా మూడు చిన్న జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘ఏ’లో భారత్, పాకిస్థాన్, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఉన్న చిన్న టీమ్స్ కూడా అద్భుతాలు చేశాయి. అందుకే ఏ జట్టును అంత తేలిగ్గా తీసుకోలేము. గ్రూప్-బి లో మాజీ ఛాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంక ఉన్నాయి. వీటితో పాటు జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ జట్లు తలపడనున్నాయి. బలమైన జట్లు ఉండటంతో ఈ గ్రూపు నుంచి తదుపరి దశకు చేరే జట్లపై ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు చరిత్రలో తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఇటలీ కూడా ఉంది. గ్రూప్-డిలో బలమైన జట్లయిన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇదే గ్రూపులో ఉండటం గమనార్హం. వీటితో పాటు కెనడా, యూఏఈ జట్లు కూడా గ్రూప్-డిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
Also Read: IND vs SA: లక్ష్యం 549, ప్రస్తుతం 27/2.. భారత్ రోజంతా నిలవగలదా?
టీ20 ఫార్మాట్ కాబట్టి ఎప్పుడు ఏ టీమ్ ఎలా ఆడుతుందో చెప్పలేము. తనదైన రోజున చిన్న టీమ్ కూడా టాప్ జట్టును ఓడించగలదు. దాయాది పాకిస్థాన్ మనపై గెలవాలని చూస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యూఎస్‌ఏ, నెదర్లాండ్స్, నమీబియా కూడా పెద్ద పెద్ద స్కోర్స్ చేశాయి. కాబట్టి టీమిండియా ఏమరపాటుగా ఉంటే అంతే సంగతులు. సూపర్-8, సెమీఫైనల్‌లో బలమైన ప్రత్యర్ధులు ఎదురయ్యే అవకాశం ఉంది. భారత్, శ్రీలంక గడపై స్పిన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ విభాగం కూడా పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. చక్రవర్తి, కుల్దీప్ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బుమ్రా, సిరాజ్, అర్షదీప్ పేసర్లుగా ఆడనున్నారు. బ్యాటింగ్ విభాగంలోనే టీమిండియాకు అసలైన పరీక్ష. అభిషేక్, సూర్య, గిల్ తప్ప జట్టులో ఎవరుంటారో అనేది క్లారిటీ లేదు. ఈ సమస్యను అధిగమిస్తే టీమిండియాకు తిరుగుండదు.