Suryakumar Yadav Rises To No 2 In T20I Batting Tankings: అదృష్టం తలుపు తట్టినప్పుడే తెరవాలి, అవకాశాలు అందివచ్చినప్పుడే సత్తా చాటాలి. ఇప్పుడు భారత బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ అదే చేస్తున్నాడు. కొంతకాలం గ్యాప్ తర్వాత టీమిండియాలోకి పునరాగమనం ఇచ్చిన ఈ తారాజువ్వ.. మెరుపు ఇన్నింగ్స్‌లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇక మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సహాయంతో 76 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో.. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్య మూడు స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం 816 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 818 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్య మరో మూడు పాయింట్లు సాధిస్తే.. బాబర్‌ను అధిగమించి, నంబర్ 1 ర్యాంక్‌ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు విండీస్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్య 111 పరుగులు సాధించాడు. అంతకుముందు ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించడంతో.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 44 స్థానాలు ఎగబాకి, ఐదో ర్యాంక్‌కి చేరుకున్నాడు.
ఇప్పుడు విండీస్‌లో కనబరుస్తోన్న దూకుడు ప్రదర్శన కారణంగా.. మరో మూడు ర్యాంకులు ఎగబాకి, రెండో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలున్న సంగతి తెలిసిందే! ఈ రెండింటిలోనూ సూర్యకుమార్ విజృంభిస్తే.. బాబర్ ఆజం ర్యాంకుకు ప్రమాదం తప్పదు. లెట్స్ వెయిట్ అండ్ సీ!