ఐపీఎల్‌లో వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి గాయపడటంతో తర్వాతి మ్యాచ్‌లో అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని హెడ్ కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు. గతంలో సుందర్‌కు గాయమైన కుడి చేతికే మరోసారి గాయమైందని తెలిపాడు. గాయం కారణంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సుందర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండానే మైదానాన్ని విడిచివెళ్లాడు.
కాగా టోర్నీ ప్రారంభంలో సన్‌రైజర్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లను ఆడిన తర్వాత కుడి చేతివేలికి గాయం కావడంతో సుందర్ పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లను సన్‌రైజర్స్ గెలిచింది. గాయం నుంచి కోలుకున్న అనంతరం చివరి రెండు మ్యాచ్‌లను సుందర్ ఆడగా.. ఆ రెండింట్లోనూ టీమ్ ఓటమిపాలైంది. మరోసారి ఇప్పుడు బౌలింగ్ చేసే చేతికే గాయం కావడంతో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సుందర్ వేయాల్సిన కోటాను పార్ట్ టైం బౌలర్ మార్‌క్రమ్ పూర్తి చేశాడు. ఈనెల 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో సుందర్ ఆడకపోతే తమపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. అతడు తమ కీలక బౌలర్ అని కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు.